12, డిసెంబర్ 2024, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*223 వ రోజు*

ధృతరాష్టుని చూసి " దేవా! వారి మాటలను బట్టి భీష్ముడు శిఖండి వంతు, ద్రోణుడు దుష్టద్యుమ్నుని వంతు, దుర్యోధనుడు అతని తమ్ములు భీముని వంతు మీలోని యువకులు అభిమన్యుని వంతు, అశ్వత్థామ, కర్ణుడు, సైంధవుడు మొదలగు మహా వీరులు అర్జునుని వంతు కృతవర్మ సాత్యకి వంతు సోమదత్తుడు చేకితానుడు అనే యాదవ రాజు వంతు శకుని నకుల సహదేవుల వంతు, శల్యుని ధర్మరాజు సంహరిస్తాడు . ఇక మీరే ఆలోచించీ నిర్ణయించండి " అన్నాడు. అదివిన్న ధృతరాష్టుడు " అయ్యో ఇక నాకు దిక్కెవరు? ధర్మరాజు శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లెక్క చేయక పోవడం నా కర్మ. ఇక చెప్పకు అలా జరగాలంటే అలా జరుగుతుంది " అన్నాడు. అలా దుఃఖిస్తున్న తండ్రిని చూసి సుయోధనుడు " తండ్రీ మేము పాండవులు ఒకే చోట పుట్టి పెరిగాము కదా మా కంటే పాండవులు బలవంతులు ఎలా అయ్యారు? నువ్వు ఎప్పుడూ వారిని పొగుడు తుంటావు ఈ రాజ్యం మాది మాకు దక్కాలని భగవంతుడు నిర్ణయించారు. బాధపడ వద్దు " అన్నాడు. ధృతరాష్టుడు " సంజయా! చూసావా నా కొడుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడు తున్నారు. పాండవుల వైపు వారిని ఎవరు రెచ్చ కొడుతున్నారు? " అన్నాడు. సంజయుడు " దేవా! దుష్టధ్యుమ్నుడు పాండవులలో అగ్నిని రెచ్చ కొడుతుంటాడు. తాను ఒక్కడే కౌరవ సైన్యాన్ని హతమారుస్తాను అంటాడు. ధర్మరాజు "నువ్వు అన్నంత పని చేస్తావు అంటాడు " అప్పుడు దుష్టధ్యున్ముడు నన్ను చూసి మహేశ్వరుడు, ఇంద్రుని అనుగ్రహం పొందిన మా అర్జునునితో సరి పోలు వారు కౌరవ సేనలో ఎవరున్నారు? ధర్మరాజును శరణు వేడి బ్రతకమని సుయోధనునికి చెప్పు " అన్నాడు. అది విన్న ధృతరాష్టుడు " కుమారా నీకు సగం రాజ్యం చాలదా? ధర్మరాజుకు సగరాజ్యం ఇచ్చి హాయిగా బ్రతకవచ్చు కదా పెద్దల మాటలు నీకు ఎందుకు వినవు? శకుని, కర్ణుల మాటలు ఎందుకు వింటావు " అన్నాడు.ఆమాటలకు కోపించిన దుర్యోధనుడు " నామాటలు ద్రోణుడు, భీష్మాదులు అంగీకరించడం లేదు. నేను ధర్మరాజుకు సూది మొన ఓపినంత భూమి కూడా ఇవ్వను కర్ణుడు, దుశ్శాసనాదుల సహాయంతో యుద్ధం చేసి పాండవులను గెలుచుట నిశ్చయం. ఇదే నా నిర్ణయం " అన్నాడు. ధృతరాష్టుడు " కుమారా ! నా మాట విని యుద్ధం మాను. భీముడు యుద్ధ రంగంలో నిన్ను నీ సైన్యాన్ని చీల్చి చెండాడు తున్నప్పుడైనా నా మాట వింటావా? అర్జునుడు ఛంఢ ప్రఛంఢుడై సైన్యాన్ని దునుమాడుతున్నప్పుడైనా నామాట వింటావా? నీది కేవలం మానవ శక్తి పాండవులది దైవ శక్తి అర్జునుడు అగ్ని దేవుని వలన అక్షయ తుణీరాన్నీ పొందాడు. వాయు దేవుడు, ఇంద్రుడు, యముడు, అశ్వినీ దేవతలు వారిని కాపాడు తుంటారు. కనుక వారిని చంపడం భీష్మునికి వీలు కాదు. దేవతలకు వీలు కాని రాక్షసులను అర్జునుడు చంపాడు, కనుక అతడు దేవతలను మించిన వాడు. అర్జునుడు ఒకేసారి ఒకే వేగంతో అయుదువందల బాణాలు వేయగలడు కనుక శాంతి ఒక్కటే ప్రస్తుత కర్తవ్యం " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! రాగద్వేషాలకు అతీతులైన దేవతలు వారికి ఎలా సాయం వస్తారు. వారు పక్షపాత బుద్ధి వహిస్తే వారికి దైవత్వం ఎలా సిద్ధిస్తుంది? పాండవులకు దేవతల సాయం ఉంటే అరణ్యాలలో ఎందుకు కష్ట పడతారు? ఆత్మస్తుతి క్షమార్హం కాదు కాని నాకు కోపం వస్తే పాండవులను దేవతలు రక్షించరు. బ్రద్దలయ్యే భూగిరి శిఖరాలను నేను మంత్ర శక్తితో ఆపగలను.రాళ్లవానను గాలిని అందరూ చూస్తుండగా శమింప చేయగలను. నీళ్ళను స్తంభింపజేసి వాటిమీద రధాలను సైనికులను నడిపించ గలను. దేవ దానవ శక్తులు నాకు ఉన్నాయి. ధర్మతనయుడు అతని తమ్ములు, కుమారులు వాసుదేవాది యాదవులు, కేకయ, పాండ్య, మగధ, చైద్య, ప్రముఖ వీరులు నా బారిన పడి అణగారి పోవడం మీరు వింటారు. వారి తేజస్సు, శౌర్యము నాకు సాటి రావు, పితామహ, ద్రోణ, అశ్వథామ, కృపులకు తెలిసిన సమస్త అస్త్రాలు నాకు తెలుసు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: