*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*
*ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం..*
*(ముప్పై ఆరవ రోజు)*
శ్రీ స్వామివారు ప్రతిరోజూ చెపుతున్న ఉపదేశాలకు.. ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధరరావు ప్రభావతి గార్లు..ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యేవరకూ శ్రీ స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు..కానీ దైవ సంకల్పం వేరొక విధంగా ఉంటుందని వారికి తెలిసిరాలేదు..
శ్రీ స్వామివారు..ఆ దంపతుల ఇంటికొచ్చిన ఇరువైఒకటో రోజు సాయంత్రం నుంచీ రాత్రి పొద్దుపోయేదాకా వివిధ అంశాలమీద ఉపదేశం చేసి, తన బసకు వెళ్లిపోయారు..ఆ సంగతులే ముచ్చటించుకుంటూ...శ్రీధరరావు దంపతులు నిద్రకుపక్రమించారు..
అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి , "అమ్మా!..అమ్మా!.." అన్న పిలుపు వినబడింది..ముందు కలలో ఏదన్నా ఆలాపన లాగా వచ్చిందేమో అని భ్రమ పడిన ప్రభావతి గారికి..మరలా అదే పిలుపు కొంచెం గట్టిగా.."అమ్మా!..తలుపు తియ్యండి.." అంటూ వినపడింది..ఈలోపల శ్రీధరరావు గారూ ఈ అలికిడికి లేచారు..ముందుగా తేరుకున్న శ్రీధరరావు గారు ఒక్క ఉదుటున లేచి తలుపు తీసారు..అవతలి గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లిగా లేచి వరండాలోకి వచ్చారు..
ఎదురుగ్గా శ్రీ స్వామివారు..వరండా లో వ్రేలాడుతున్న లాంతరు తాలూకు వెలుతురులో..తేజోపుంజం లాగా నిలుచుని వున్నారు..స్వచ్ఛమైన నవ్వు ముఖంతో చూస్తూ వున్నారు..
"ఏం నాయనా?..ఏమైనా కావాలా?.."అన్నారు ప్రభావతిగారు..
"అమ్మా!..ఈశ్వరాజ్ఞ అయింది..ఇక ఇక్కడ వుండనమ్మా..త్వరగా బండి సిద్ధం చేయండి..నేను ఆ ఆశ్రమ స్థలానికి వెళ్లిపోవాలి..అక్కడే వుంటాను!.." అన్నారు శ్రీ స్వామివారు అదే చిరునవ్వుతో..
శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..
"అదేమిటి స్వామీ..అక్కడ కేవలం స్థలం చదును చేసారే గానీ..కనీసం పునాదులు కూడా తీయలేదు..గోడలు కట్టి, పై కప్పు పడితే గదా మీరు ఉండడానికి అనువుగా ఉండేది..ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది?..ఈ చలి కాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు?.." అన్నారు శ్రీధరరావు గారు ఆతృతగా..
"నాయనా!..ఇప్పుడేం తొందర వచ్చిందని ఈ నిర్ణయం?..మందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ ఇక్కడే ఉండొచ్చు కదా?.." అన్నారు ప్రభావతి గారు ఆందోళనగా..
"లేదమ్మా..ఇక ఆలస్యం చేయకూడదు..అది ఈశ్వరాజ్ఞ తల్లీ..నేను ఆ ఆజ్ఞ ను మీరి పోకూడదు!..ఇప్పుడే వెళ్లిపోవాలి..మీకు బండి సిద్ధం చేయడం కుదరదంటే.. నేను నడచి వెళ్లిపోతాను..నడక నాకు అలవాటే కదమ్మా.." అన్నారు శ్రీ స్వామివారు..
"కనీసం రేపు సాయంత్రం వరకూ వుండండి.. అక్కడ చిన్న పాక లాగా వేయిస్తాను..చుట్టూరా తాటాకు దడి లాగా ఏర్పాటుచేయిస్తాను..కొద్దిగా ఓపిక పట్టండి.."అన్నారు శ్రీధరరావు గారు..నిజానికి ఆయనకు లోలోపల కొద్దిగా చిరాకుగా ఉంది..అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారమేమిటని ఆయన ఆలోచన!..
"శ్రీధరరావు గారూ..నేనిప్పుడు వెళ్లిపోవాలి..వెళతాను కూడా..మీరనుకునే ఆ పాక ఏదో రేపుదయం వేయించండి.." ఈసారి శ్రీ స్వామివారి కంఠం లో ఒక విధమైన తీవ్రత వినిపించింది..
ప్రభావతి గారు ఇక ఉండబట్టలేకపోయారు..స్ర్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది ఆవిడ స్వరం లో..
"నాయనా!..మేము చేస్తున్న ఉపచారాలలో నీ కేదైనా లోటు కనిపించిందా?..అపచారం ఏదైనా జరిగిందా?..లేక అజ్ఞానం తో అడగరాని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా?..మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో..నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా?..ఒక్కపూట కూడా వుండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయనా!..నా మనసుకు కష్టంగా ఉంది!.." అన్నారు..
"ఎంత పిచ్చి తల్లివమ్మా నువ్వు!.." అన్నారు శ్రీ స్వామివారు..ఆ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలువారుతున్నది.. "మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యమూ లేదు..నాకు అపచారమూ జరుగలేదు..అపవిత్రత అన్న మాటే లేదు!..నేను చెపుతున్నది ఈశ్వరాజ్ఞ గురించి..నేను మాలకొండ నుంచి ఇక్కడకు బయలుదేరే సమయంలో..అక్కడే కొద్దికాలం వుండమన్నారు..కుదరదన్నాను..ఎందుకు?.. అదికూడా ఆరోజు ఆ ఈశ్వరుడి ఆదేశానుసారమే.. ఈరోజు మీ ఇంట్లో వుండమంటున్నారు.. ఈరోజు కూడా ఉండలేను..వుండబోను..ఇది కూడా ఈశ్వరుడి ఆదేశమే!..గృహస్తుల వద్ద ఎక్కువ కాలం మా లాంటి యోగులు ఉండరాదు..ఉండము కూడా..అది నియమం!..నన్ను వెళ్లనివ్వండి.." అన్నారు..
శ్రీ స్వామివారి వివరణ..ఫకీరు మాన్యం లో బస..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి