12, డిసెంబర్ 2024, గురువారం

ఆవు మీద వ్యాసం

 ఆవు మీద వ్యాసం:


అనగనగా ఒక చదువుకునే ఉత్తమ విద్యార్థి వున్నాడు. అతను పాఠశాలలో చదువుతున్నాడు. చిన్నవాడే కానీ అతనికి ఉండాల్సిన దానికన్నా తెలివితేటలూ ఎక్కువగా వున్నాయి. కొన్నిసందరాలలో మనకు తెలివి ఎక్కువైతే ఏమవుతుందో చెప్పటానికి ప్రయత్నం.

 తెలుగు మాస్టారు గారు పిల్లలకు వివిధ విషయాంశాలతో పాటు వ్యాస రచనకు సమందించిన విషయాలను కూడా పేర్కొన్నారు ఉదా .  ఆవు, బడి, విమానం, రైలు, మొదలగునవి. అయితే మన ఆదర్శ విద్యార్థి వాటినన్నిటిని ఒక్కసారి చూసిన తరువాత  ఆవు తనకు నచ్చింది కాబట్టి దానిని ఎంపిక చేసుకొని దాన్ని చక్కగా చదివి గుర్తుపెట్టుకున్నాడు. మనసులో పరీక్షకు వెళ్లే ముందు తన ఇష్ట దైవాన్ని పరి పరి విధాలుగా ప్రార్ధించాడు కారణం తన పరీక్షలో వ్యాసం కేవలం ఆవు మాత్రమే రావాలి. 


కానీ మన విద్యార్థి మోర దేముడు ఆలకించ నట్లున్నాడు ఆ పరీక్షా పేపర్లో వ్యాసానికి సంబందించిన ప్రశ్న ఒకటి కాదు రెండు వచ్చాయి. అందులో ఒక్కటికూడా ఆవు లేదు అవి ఒకటి విమానం, రెండు రైలు. అరె చచ్చిందిరా గొర్రె అని మనస్సులో అనుకున్నాడు మన మహానుభావుడు అదికూడా ఆ రెండు ప్రశ్నలు తప్పనిసరి. ఇప్పుడు ఏమిచేయాలి, ఇప్పుడు ఏమిచేయాలి ఇదే సమస్య మెదడంతా తిరుగుతున్నది. మన విద్యార్థి ఓటమిని ఒప్పుకునే రకం కాదు ఎట్లాగయినా ఆ రెండు ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి అదికూడా మంచిగా అని నిర్ణయించుకున్నాడు. అతను ఆ రెండు వ్యాసాలు ఎలా వ్రాశాడో చూద్దాం. 


1) విమానం: విమానం అనగానే తానూ విమానం శబ్దం విని ఆకాశంలో పోయే విమానం గుర్తుకు వచ్చింది. వెంటనే వ్రాయటం మొదలు పెట్టాడు.విమానం చాలా పెద్దగా ఉంటుంది. దానిలో చాలామంది ప్రయాణించ వచ్చు. అది గాలిలో ఎగురుతుంది. అంతమటుకు చక్కగా వ్రాసాడు. ఇక ఆ పైన పెన్ను నడవటంలేదు. ఒక్కనిమిషం అటు ఇటు చూసాడు ఎవరి పేపరు వాళ్ళు వ్రాసుకుంటున్నారు. మాస్టారు తననే చూసాడు రామా రావు సిట్రియేట్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమి చేయాలి. మనసులో పరిపరి ఆలోచనలు ఎట్లాగైనా ప్రశ్నకు సమాధానం వ్రాయాలి అంతేకాదు ఇంకోటి అదే రైలు గూర్చి కూడా వ్రాయాలి. దేముడా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతావు. దేముడిమీద కొంత సేపు భక్తి, కొంత సేపు తనకు అనుకూలించనందుకు కోపం. సమయం అయిపోతూవుంది.  ఇంతలో ఇవ్వన్నీ తరువాత చూసుకోవచ్చు ముందు ఈ గండం గడవటం ఎట్లారా భగవంతుడా. ఇక ఆగలేదు అప్పుడు సమయస్పూర్తి చూపించాడు మన రామారావు.పెన్ను పట్టుకొని చక చకా వ్రాయటం మొదలు పెట్టాడు. అది చూసిన మాస్టారుకుడా మన రామా రావు ఇందాక పాపం సమాధానం కోసం ఆలోచించాడులే అని అనుకున్నారు. ఇంతకూ మన రామా రావు వ్రాసింది ఏమిటి చుడండి.

విమానం గాలిలో ఎగురుతుంది దగ్గర ఆగాడు ఇప్పుడు దాని తరువాత విమానానికి కిటికీలు ఉంటాయి,  ఆ కిటికీలనుండి చుస్తే క్రింద పచ్చిక బయళ్లు ఉంటాయి. అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుంది.  ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. సాగుతూనే వున్నది ఒక్కసారి ఫై నుండి క్రిందికి పేజీ చూసాడు తనను తానె నమ్మలేక పోయాడు పేజీ మొత్తం నిండింది అరె నేను చాలా పెద్ద వ్యాసం వ్రాసాను అని తనను తానె పొగుడుకున్నకు. ఈ పరీక్షల్లో మొదటి ర్యాంకు నాకు రావటం ఖాయం అని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇక్కడితో కథ అయిపోలేదు ఇంకా రెండో వ్యాసం అదే రైలు వ్యాసం వ్రాయాలి అది యెట్లా వ్రాశాడో చూద్దాం.

ఇప్పుడు రామారావు మోహంలో ఎంతో దైర్యం, ఆత్మా విస్వాసం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఈ పిల్లవాడికి తెలియని ప్రశ్న ఏది లేదు అని అందరు అనుకునేలా వుంది అతని ముఖ వర్చస్సు. ఇక రైలు వ్యాసం ఇలా సాగింది.

రైల్వే స్టేషనులో రేలు వచ్చి ఆగుతుంది వెంటనే అందరు రైలు ఎక్కుతారు అది చుకు చుకు అని బయలుదేరుతుంది. రైలుకి రెండువైపులా కిటికీలు ఉంటాయి. (భగవంతుడా రైలుకి కూడా  కిటికీలు పెట్టి నన్ను రక్షించావు అని మనసులో అనుకున్నాడు) ఆ కిటికీలలోనుంచి బయటకు చుస్తే పచ్చిక బయళ్లు ఉంటాయి. అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుంది.  ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. ఇలా సాగుతూనే వున్నది మన రామారావు జవాబు పత్రం మీద వ్యాసం. ఎట్టకేలకు రామారావు రెండు వ్యాసాలను తన సమయస్ఫూర్తితో సంపూర్ణంగా వ్రాసినట్లు ఆనందపడ్డాడు. ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ప్రతి సాధకుడు కూడా ఈ కధలోని రామారావు లాగానే ప్రవర్తించాలి అది యెట్లా అంటే తానూ తన మనస్సు, బుద్ది ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని మీదనే లగ్నాత చెంది ఉండాలి ఏరకంగా అయితే రామారావు మనస్సు పూర్తిగా ఆవుతో జత చేయపడి తానూ వ్రాసే ప్రతి వ్యాసాన్ని ఆవుతో కలిపాడా అదే విధంగా మన మనస్సు బాహ్యంగా ఏ ఏ విషయాలమీద ఉన్నాకూడా చివరకు అది పరమేశ్వరునిమీదకు మాత్రమే మళ్ళాలి. ఆలా మనం మన మనస్సుకు శిక్షణ ఇస్తే తప్పకుండ ఇస్తే నిత్యము పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులము అవుతాము తత్వారా మోక్ష మార్గము మనకు సుగమం అవుతుంది. కాబట్టి సడక మిత్రమా ఈ విధంగా జీవనాన్ని గడుపుతే మోక్షార్థులము కాగలము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: