*ఆదమరిస్తే.. బ్యాంకు ఖాతా ఖల్లాస్*
ఒకప్పుడు బ్యాంకుకు నేరుగా వెళితే తప్ప ఆర్థికలావాదేవీలు జరిగేవి కావు. ఇప్పుడంతా ఆన్‌లైన్‌మయమే. కాలు బయటపెట్టకుండా అరచేతిలోని సెల్‌ఫోన్ ద్వారానే ఆ లావాదేవీలు పూర్తి చేసేస్తున్నాం. ఇందుకు దోహదం చేస్తున్న పరిజ్ఞానమే మోసగాళ్లు రూ.కోట్లు కొల్లగొట్టడానికీ కారణంగా మారింది. కూర్చున్న చోటు నుంచే నేరాలకు పాల్పడే హైటెక్ మోసగాళ్లకు సాంకేతికత ఆయుధంగా మారింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు ఎలా జరుగుతాయి..? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
ఆదమరిస్తే.. ఖాతా ఖల్లాస్
రకరకాలు...
ఫిషింగ్ స్కామ్స్ : మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్ ద్వారా లాగిన్, వ్యక్తిగత డేటాను దొంగిలించడం.
ఎలా చేస్తారంటే..: బ్యాంకు అధికారుల మాదిరిగా కాల్ చేస్తారు. లేదా ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా లింక్‌లు పంపిస్తారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పాస్‌వర్డ్ అడుగుతారు. ఒకవేళ ఆ వివరాలు చెబితే సొమ్ము మాయమవుతుంది.
కార్డ్ ఫ్రాడ్ : బాధితుల కార్డు వివరాలను వినియోగించి కొనుగోళ్లు జరపడం.
ఎలా చేస్తారంటే.. : ఏటీఎంలు లేదా స్టోర్లలో స్కిమ్మర్లను అమర్చి కార్డు వివరాలను దొంగిలిస్తారు. లేదా బాధితుల కార్డు వివరాలను భౌతికంగా సేకరించి దొంగచాటుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తారు. బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్ చేసి కార్డు వివరాలను తెలుసుకోవడం మరో విధానం.
ఐడెంటిటీ థెఫ్ట్ అమాయకుల గుర్తింపుకార్డులను దొంగిలించి నకిలీ ఖాతాలను తెరిచి మోసాలకు పాల్పడటం.
ఎలా చేస్తారంటే.. : బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని మోసగాళ్లు దొంగిలిస్తారు. అనంతరం బాధితుల ముసుగులో వారి సన్నిహితులకు మెసేజ్‌లు పంపి డబ్బు అడగడం ద్వారా మోసాలకు పాల్పడతారు.
ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ మోసాలు బాధితుల ఆన్‌లైన్ క్రెడెన్షియల్స్‌ను దొంగచాటుగా సేకరించి మోసాలకు పాల్పడటం.
ఎలా చేస్తారంటే.. : మొబైల్‌ఫోన్‌లోకి మాల్‌వేర్ పంపించి ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలను తస్కరిస్తారు. ఆ వివరాల ఆధారంగా అనధికారిక నగదు లావాదేవీలను నిర్వహిస్తారు. అందుకే వెబ్‌సైట్‌ల యూఆర్‌ఎల్‌లను నిశితంగా పరిశీలించాకే ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాలి. అనుమానాస్పద లింక్‌లను తెరవొద్దు. బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, పిన్‌నంబర్లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దు.
ఒకవేళ మోసం జరిగితే..
ఒకవేళ మోసానికి గురైతే వెంటనే కార్డును బ్లాక్ చేయించాలి.
1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్‌సీఆర్‌పీ) వెబ్‌సైట్‌లో ఫిర్యాదును నమోదు చేయాలి.
ఆర్‌బీఐలోని కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్)కు నివేదించాలి.
మోసపూరిత లావాదేవీకి సంబంధించిన కాల్ రికార్డింగ్స్, ఈ-మెయిల్స్‌లాంటివి కీలకాధారాలవుతాయి. పోలీసులకిచ్చే ఫిర్యాదులో వీటిని జతచేయాలి.
ఈ ప్రక్రియ ఆన్‌లైన్ మోసాల గురించి తెలుసుకొని నిఘా ఉంచేందుకు, నియంత్రించేందుకు దోహదపడుతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, పిన్‌నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దు.
బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లను నిశితంగా గమనించాలి. తద్వారా అనుమానస్పద లావాదేవీలు జరిగితే గుర్తించొచ్చు.
అంకెలు, సంజ్ఞలు, అక్షరాలను మిళితం చేస్తూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవాలి.
ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహించేటప్పుడు అక్కడి యంత్రాల్లో స్కిమ్మర్లు లేదా కార్డురీడర్లను బిగించారా..? అనేది నిశితంగా గమనించాలి. అలాంటివి ఉంటే సంబంధిత బ్యాంకు అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు. ఫిషింగ్ దాడులను నియంత్రించేందుకు ఇది ఉపకరిస్తుంది.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీ జరిగిన ప్రతిసారీ సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేసి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి తెప్పించుకునే అవకాశముంటుంది.
సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలోని సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడంతోపాటు సురక్షితమైన యాంటీవైరస్‌లను నిక్షిప్తం చేసుకోవాలి.
అత్యధికం తెలంగాణలోనే...
జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక మేరకు 2022లో దేశవ్యాప్తంగా అన్ని రకాల సైబర్‌నేరాలు 64,907 నమోదు కాగా.. తెలంగాణలోనే అత్యధికంగా 15,297 జరిగాయి. అయిదోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 2,341.
ఓటీపీ మోసాల్లో తెలంగాణాదే అగ్రస్థానం. దేశవ్యాప్తంగా నమోదైన 2,819 కేసుల్లో తెలంగాణవే 2,179 కావడం గమనార్హం. ఒడిశాలో 201.. మహారాష్ట్రలో 195.. ఆంధ్రప్రదేశ్‌లో 61 నమోదయ్యాయి.
క్రెడిట్, డెబిట్‌కార్డు మోసాలు దేశవ్యాప్తంగా 1,660 నమోదైతే.. ఒక్క తెలంగాణలోనే 535 నమోదయ్యాయి. బిహార్(562కేసులు) తర్వాత స్థానం తెలంగాణదే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో ఇవి 39 నమోదయ్యాయి.
ఏటీఎంల్లో జరిగిన మోసాలు 1669 నమోదు కాగా.. బిహార్‌లో అత్యధికంగా 638 కేసులయ్యాయి. అనంతరం తెలంగాణలో 624 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 30.
ఐడెంటిటీ థెఫ్ట్ కేసులు దేశవ్యాప్తంగా 5662 నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 3752 కేసులుండగా.. తెలంగాణలో 77, ఆంధ్రప్రదేశ్‌లో 82 నమోదయ్యాయి.
ఈనాడు, హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి