*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము*
*గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*15.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*దేశే శుచౌ సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః|*
*స్థిరం సమం సుఖం తస్మిన్నాసీతర్జ్వంగ ఓమితి॥6276॥*
ధర్మరాజా! సాధకుడు పవిత్రమైన, సమతలమైన భూమిపై తన ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై నిటారుగా, నిశ్చలముగా, సుఖముగా కూర్చొనవలెను. పిదప ఓంకారమును జపింపవలెను.
*15.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*ప్రాణాపానౌ సన్నిరుధ్యాత్పూరకుంభకరేచకైః|*
*యావన్మనస్త్యజేత్కామాన్ స్వనాసాగ్రనిరీక్షణః॥6277॥*
మనస్సుసంకల్ప వికల్పములను విడిచిపెట్టనంత వరకు సాధకుడు తననాసికాగ్రమున దృష్టిని నిలుపవలెను. పిమ్మట పూరక, కుంభక, రేచకముల ద్వారా ప్రాణాపాన గతులను నియమింపవలెను. (గాలిని నిండుగా తీసికొనుట పూరకము. నింపి కొంత సేపు నిలిపి ఉంచుట కుంభకము. బయటకు వదలుట రేచకము)
*15.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*యతో యతో నిఃసరతి మనః కామహతం భ్రమత్|*
*తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాచ్ఛనైర్బుధః॥6278॥*
కామవాసనలచే కొట్టబడి, అటునిటు పరుగులు దీయుచున్న చిత్తమును విద్వాంసులు మఱలవెనుకకు మరల్చి, మెల్లమెల్లగా హృదయము నందు నిలుపవలెను.
*15.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*ఏవమభ్యస్యతశ్చిత్తం కాలేనాల్పీయసా యతేః|*
*అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనవహ్నివత్॥6279॥*
సాధకుడు ఈ విధముగా నిరంతరము అభ్యాసము చేసినచో, ఇంధనము లేని అగ్నివలె అతని చిత్తము స్వల్పకాలములోనే ప్రశాంతమగును.
*15.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిలవృత్తి యత్|*
*చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్॥6280॥*
ఈ విధముగా కామవాసనల తాకిడిని నిరోధించి నప్పుడు, అతని వృత్తులు అన్నియును శాంతించును. అప్పుడు అతని చిత్తము బ్రహ్మానందముతో మునిగిపోవును. మరల ఆ వృత్తులు ఎన్నడును తలయెత్తవు.
*15.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*యః ప్రవ్రజ్య గృహాత్పూర్వం త్రివర్గావపనాత్పునః|*
*యది సేవేత తాన్ భిక్షుః స వై వాంతాశ్యపత్రపః॥6281॥*
ధర్మార్థకామములకు మూలమైన గృహస్థాశ్రమమును పరిత్యజించి, సన్న్యాసమును స్వీకరించినవాడు తిరిగి గృహస్దాశ్రమమును స్వీకరించినచో, వాడు తాను వమనమును (వాంతిని) చేసికొనిన ఆహారమును, మరల భుజించినట్టీ కుక్కతో సమానుడగును.
*15.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*యైః స్వదేహః స్మృతో నాత్మా మర్త్యో విట్కృమిభస్మసాత్|*
*త ఏనమాత్మసాత్కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః॥6282॥*
తన శరీరమును అనాత్మయనియు, మృత్యుగ్రస్తమై, మలము, క్రిములు, బూడిదకు నిలయమని భావించినవాడు, తిరిగి ఆ శరీరమే ఆత్మయని ప్రశంసించినచో, నిజముగా అతడు మూఢుడే.
*15.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి|*
*తపస్వినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలతా॥6283॥*
*15.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*ఆశ్రమాపసదా హ్యేతే ఖల్వాశ్రమవిడంబకాః|*
*దేవమాయావిమూఢాంస్తానుపేక్షేతా నుకంపయా॥6284॥*
కర్మలను త్యజించిన గృహస్థుడు, బ్రహ్మవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, గ్రామములో నివసించునట్టి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖలోలుడైన సన్న్యాసి అను నలుగురును తమ ఆశ్రమములకు కళంకమును తెచ్చెదరు. వారు ఆయా ఆశ్రమములలో ఉన్నట్లు కపట నాటకమును ఆడుచున్నవారగుదురు. కావున, భగవంతుని మాయచే మోహితులైనట్టి ఆ మూఢులపై జాలిచూపి, వారిని ఉపేక్షింపవలెను.
*15.48 (నలుబదియవ శ్లోకము)*
*ఆత్మానం చేద్విజానీయాత్పరం జ్ఞానధుతాశయః|*
*కిమిచ్ఛన్ కస్య వా హేతోర్దేహం పుష్ణాతి లంపటః॥6285॥*
ఆత్మజ్ఞానమును సాధించినవానికి అంతఃకరణము నిర్మలమగును. అట్టి జ్ఞానికి దేహాభిమానము ఉండదు. కావున, అట్టి జ్ఞానియైనవాడు తిరిగి ఇంద్రియలౌల్యము నందుగాని, దేహాసక్తియందుగాని ఏల చిక్కుకొనును?
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి