18, ఏప్రిల్ 2021, ఆదివారం

సుంద‌ర‌కాండ- *రామయ్యకు శుభవార్త*

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

           *రామాయ‌ణ*

*దివ్య‌క‌థా పారాయ‌ణ‌ము*


*శ్రీరామ న‌వ‌మి* 

*ప‌ర్వ‌దినం వ‌ర‌కు*


           *6వ‌రోజు*


    *సుంద‌ర‌కాండ- *రామయ్యకు శుభవార్త*

               ***

          🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శిరసా సమామి

              ***


సీతామాత‌ దర్శనం, ఆమె ఆశీస్సులు అంద‌డంతో హ‌నుంతుడు ప‌ట్ట‌రాని సంతోషంతో గంతులు వేశాడు.  ఇక పనిలో పనిగా రావణునిచూసి రావ‌ణుడి శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను తెలుసుకోవాల‌నుకున్నాడు. రావ‌ణుడితో ముఖాముఖి మాట్లాడాల‌నుకున్నాడు. అలాగే యుద్ధ వ్యూహంతో లంకను పరిశీలించాల‌ని నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుందనుకున్నాడు. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చు. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై వనాన్ని ధ్వంసం చేశాడు, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ పిడిగుద్దులు గుద్ది మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.


ఈ వింత వాన‌రాన్ని బంధించమని రావణుడు అపార సైన్యాన్నిపంపాడు. హనుమంతుడు 

 జయత్యతిబలో రామో, 

లక్ష్మణశ్చ మహాబల:,

 రాజా జయతి సుగ్రీవో,

 రాఘవేణాభిపాలిత:,

 దాసోహం కోసలేంద్రస్య, 

రామస్యా క్లిష్ట కర్మణః,

 హనుమాన్ శత్రు సైన్యానాం,

 నిహన్తా మారుతాత్మజః అని జయఘోష చేశాడు -


 మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాద పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.

అప్పుడు రావణుడు, ప్రహస్తుని కుమారుడు మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అర‌చేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా లంకాప‌ట్ట‌ణ వీధులు  రాక్ష‌సుల‌ రక్త మాంసాలతో నిండిపోయాయి.

 పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రణ భూమి అంతా రాక్షస, వాహన కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.

*అక్ష‌కుమారుడితో భీకర‌స‌మ‌రం*

ఇక  లాభం లేద‌నుకుని అక్షకుమారుడు సకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది.  అక్షకుమారుడు హ‌నుమంతుడిపై  బాణాల వ‌ర్షం కురిపించాడు. అవి హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుగ్గునుగ్గయ్యింది.

*ఇంద్ర‌జిత్తుతో యుద్ధం:*

అక్ష‌కుమారుడు మ‌ర‌ణించిన సంగ‌తి తెలుసుకుని రావణుడు కలవరపడడ్డాడు. ఇదెక్క‌డి వాన‌రం అని త‌ల‌ప‌ట్టుకున్నాడు. పెక్కు జాగ్రత్తలు చెప్పి, త‌న కుమారుడైన‌ ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడు. అతడు తండ్రి యైన రావ‌ణాసురుడికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా హ‌నుమంతుడు నటించాడు. ఆ విధంగా రావణునితో మాట్లాడే అవ‌కాశం దొరుకుతుంద‌ని అనుకున్నాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి, బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయాయి.


*రావణునితో సంవాదం :*

బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలోకి ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలి, వీరుడును అయిన‌ రావణుడు పది శిరస్సులు క‌లిగి ఉన్నాడు. ద‌శ కంఠుడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’ అనుకున్నాడు.

రావ‌ణుడు హ‌నుమంతుడిని చూశాడు. 

హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఇత‌నిని ఎవరు పంపారు? - తెలిసికోమని రావణుడు మంత్రులను ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుడి మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను అప‌హ‌రించితెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతున్న‌ది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకు, లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను రాముడికి అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

ఆ మాట వింటూనే రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు అన్నాడు.  అంతే కాకుండా హ‌నుమంతుడు తిరిగి వెళ్ళకపోతే నువ్వు శతృవులతో యుద్ధం చేసి వారిని ఓడించే అవకాశం కోల్పోతావు. కనుక, హ‌నుమంతుడిని దండించి వదిలివేయ‌మ‌ని  సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి వూరంతా త్రిప్పమని ఆదేశించాడు..

*లంకా దహనం*

హ‌నుమంతుడి హిత‌వ‌చ‌నాలు రావ‌ణుడికి న‌చ్చ‌లేదు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి  క‌ల‌వ‌ర‌ప‌డింది. హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతిన సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గిపాలు చేశాడు.


అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న భ‌యంతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతను దర్శించి, ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో రాగలడని మ‌రోమారు చెప్పి సీత‌మ్మ పాదాల‌కు న‌మ‌స్క‌రించి, తిరిగి ఉత్తరదిశకు బయలుదేరాడు.


ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకాద‌హ‌నం చేసి, రావణుని మదమణచి, సీతకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.


*తిరుగు ప్ర‌యాణం:*


హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. - "కనుగొంటిని సీతమ్మను. ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూచుచు కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న మాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.


ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించ‌డ‌మే సరైనపని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.

*మధువనం:*

సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని వెంట‌బెట్టుకుని హుషారుగా కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ,  వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.


సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.


*రాముడికి శుభవార్త*

*సీతమ్మ‌ జాడ తెలుపుట:*


అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. *దృష్టా దేవీ (చూచాను సీతను)* అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.


ఓ రామా! సీతామాత నిరంత‌రం నిన్ను స్మ‌రిస్తూ రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నీకోసం ఎదురుచూస్తున్న‌ది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరిస్తావ‌నే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక నెల‌ లోపల అలా జ‌ర‌గ‌కుంటే తాను ప్రాణాల‌తో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారంలో చూడగలవని ఆమెకు చెప్పాను. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చాను. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.


రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది.

బ్రహ్మాండ పురాణం రామాయణంలోని ఒక్కొక్క కాండం పారాయణానికి

 ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి ...

*"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం*,

*హనూమత్సేవితం ధ్యాయేత్ సుందర కాండ ఉత్తమమ్‌* అని పేర్కొన్నది.

                  ***

ఆపదా మపహ‌ర్తారం ధాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

                    ***

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ

నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ

                  ***

గోష్పదీకృత వారాశిం

మశకీకృత రాక్షసమ్

రామాయణ మహామాలా

రత్నం వందే అనిలాత్మజమ్.


 (సుంద‌ర‌కాండ స‌మాప్తం)

కామెంట్‌లు లేవు: