🌹🌹🌹🌷🌷🌹🌹🌹
*నాకు నచ్చిన శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి కథ*
🌷🌷🌷
అవని కథ : -
మధ్యాహ్నం అయ్యింది. ఎండాకాలం ఎండలు దంచేస్తున్నాయి. అప్పుడే భోజనం ముగించిన అవని భర్త వాట్సప్ కు మెసేజ్ పెట్టింది తిన్నారా? అంటూ... జవాబు రాలేదు. మిగతా పనులు చేసుకుని కాల్ చేసింది.
"ఆ.. తిన్నాను. తినకుండా ఎందుకు ఉంటాను. రోజూ ఇదో వెధవ గోల నాకు. ఇన్నేళ్లనుంచి చెబుతూనే వున్నా. అయినా ఇదే తంతు. ఏదో దూర ప్రాంతంలో ఉన్నట్టు. రోజూ కొంపలోనే ఉంటాం కదా!" అని విసుగ్గా ఫోన్ కట్ చేసాడు భూపతి.
ఒక్క నిముషం నిట్టూర్పు విడిచి, అలా నడుము వాల్చింది. ఒక్కసారి తన జీవితం అంతా వరుసగా మనసులో మెదిలింది.
డిగ్రీ అయిన వెంటనే అవనికి ఒక మంచి కంపెనీలో ఆఫీసర్ గా పని చేస్తున్న భూపతి తో పెళ్లి చేశారు పెద్దలు. పెళ్లి అవ్వగానే ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగారు.
భూపతి అదో రకం మనిషి. తను చెప్పిందే జరగాలనే తత్వం. అదీ ఒక అవని వద్దనే. బయట వాళ్ళతో ఎంతో బాగా వంగి మాట్లాడ తాడు. తను ఇలా అంటాడని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఏదైనా కొంటే మీ చెల్లెళ్లకు, అన్నయ్య లకు చెబుతావేమో ఇప్పుడే అందరికీ చెప్పకు. తర్వాత చెబుదాం అని చెప్పి, తాను మాత్రం చెప్పేవాడు వాళ్ళతో. దాంతో అవని అంటే వాళ్లందరికీ మంట. భూపతి చాలా మంచివాడు, దాపరికం లేని భోళా మనిషి. అవని మంచిది కాదు అనే అభిప్రాయం ఏర్పడింది ఇటు అత్తవారింటి వైపు, అటు పుట్టింటి వైపూ కూడా. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు ఆమెతో. చచ్చావా? బ్రతికావా? అడగరు. కానీ తన అవసరం ఉన్నప్పుడు బాగా మాట్లాడి పనులు చేయించుకుంటారు.
పెళ్ళైన కొత్తలో చెల్లెళ్ళ తో, అన్నలతో మాట్లాడడానికి కాల్ చేస్తే , లేదా వాళ్ళు కాల్ చేసినా పెట్టేయ్యి తర్వాత మాట్లాడతా అని చెప్పు అని విసుక్కునేవాడు భూపతి. దాంతో ఏం గొడవ అవుతుందోనని భయపడి పెట్టేసేది. వాళ్లకు ఈ విషయం సూచాయగా చెప్పినా అవనిపైనే కోపం పెట్టుకున్నారు వాళ్ళు.
అవని పెళ్లి అయ్యాక ఏడేళ్లకు తల్లిదండ్రి చనిపోయారు. ఇక తనతో సరిగ్గా మాట్లాడే నాధుడే లేకపోయాడు. అప్పట్నుంచి తన మనసే తనకు ఫ్రెండు ఇంకా అన్నీ.
పెళ్లి అయిన కొత్తలో ఒక సెల్ ఫోన్ కొనిచ్చారు అవని నాన్న. అది అప్పట్లో బేసిక్ మోడల్. ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కి ఛార్జ్ వేసేవారు. తనకు ఏమీ తోచక మధ్యాహ్నం లంచ్ టైం లో కాల్ చేస్తే, ఇది అడగడానికి ఒక్క రూపాయి వేస్ట్ చేయాలా? అని అరిచినంత పని చేసాడు భూపతి.
"నాకేమీ తోచట్లేదు ఏదైనా జాబ్ చూడండి, చేస్తాను" అని అంటే
పెద్దగా నవ్వి..
"నీ తెలివితేటలకు ఇంకా జాబ్ ఏమి చేస్తావు? " అని వేళాకోళం చేసి, చూద్దాం లే అన్నాడు.
కానీ ఆ చూడడం ఇంతవరకూ అవ్వలేదు. అవనికి 59 ఏళ్ళు. భూపతి కి 60 నిండిపోయాయి. జాబ్ నుంచి రిటైర్డ్ అయ్యాడు కానీ స్నేహితుడితో కలిసి ఏదో చిన్న బిజినెస్ మొదలు పెట్టాడు. అతనికి బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. అందుకే ఇలా కాల్ చేస్తుంది అవని టైం కి తిన్నాడో లేదోనని. విసుక్కున్నా పట్టించుకోకుండా లంచ్ టైం లో కాల్ చేస్తుంది.
ఓ సారి చుట్టాలమ్మాయి చదువుకోడానికి వచ్చి ఓ రెండేళ్లు వీళ్ళింట్లో ఉంది. ఆ అమ్మాయి తో ఎంత బాగా మాట్లాడేవాడో! ఓ సారి ఆ అమ్మాయికి జ్వరం వస్తే ఎంతో హడావుడి చేసాడు. అవనికి అనారోగ్యంతో వున్నా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు కానీ. ఏవో మందులు తెచ్చి మొహాన కొట్టేవాడు వేసుకొమ్మని. ఎలా ఉందని అడిగే వాడే లేడు.
పిల్లలూ అంతే. వాళ్ళ అవసరాలు తీరితే చాలు. అక్కడే ఉండి అనారోగ్యంతో ఉన్నది చూస్తున్నా పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్న భర్తను, పిల్లల్నీ చూసి ఆశ్చర్యపోయేది అవని. ఇంత కఠినమైన మనసుతో ఎలా ఉంటారో అర్ధం అయ్యేది కాదు ఆమెకు. తోబుట్టువులూ అంతే. కొందరి తలరాతలు అలానే వుంటాయేమో?
ఓ సారి అన్న కూతురు ఏదో పని ఉండి వచ్చింది. చాలా ఆత్మీయురాలి గా మాట్లాడింది. అందుకే తన తో
" అవసరం వెళ్లదీసుకుని మళ్ళీ నాతో మాట్లాడరు సరిగ్గా. నాకు అత్తింటి వైపు, పుట్టింటి వైపూ ఒకేలా వున్నారు " అంటూ చెప్పిన అవనితో
"అందరూ అలానే వున్నారు అంటే నీలోనే లోపం ఉంది అత్తా! నేను చూడు మా ఆయన ను ఎలా గుప్పిట్లో పెట్టుకున్నానో? ఏది కావాలంటే అది కొంటారు. అత్తా వాళ్ళు నోరు మెదపరు. అలా మనలోనే ఉండాలి ఆ టాలెంట్. అందరినీ అనుకుంటే ఏమి లాభం!" అంది.
ఇద్దరు పిల్లలూ పెళ్లిళ్లు అయి సెటిల్ అయిపోయారు. పురుళ్ళూ పుణ్యాలు చేయించుకున్నారు అవనితో.
ఇప్పుడు కాల్ చేస్తే మాట్లాడరు.
"అమ్మా! నీకు లా ఖాళీగా ఉన్నామను కున్నావా? ఊరికే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? మా ఉద్యోగాలు, పిల్లలూ చూస్కోవాలిగా!" అని విసుగు ప్రదర్శించారు. అందుకే వాళ్లకు చేయడం మానేసింది.
"వాళ్ళ నాన్నతో మాట్లాడతారు కానీ నాతో మాట్లాడ డానికి ఇలా విసుక్కుంటారు ఏమిటో" అనుకుని నిట్టూర్చేది.
కొత్తగా పెళ్ళైన చెల్లెలు పెళ్లి కాగానే మొగుణ్ణి కంట్రోల్ లో పెట్టుకోవాలి అని సలహా ఇచ్చి నప్పుడు ఓ శుష్కమైన నవ్వు నవ్వుకుంది అవని.
కొందరు భార్య మాటలకు విలువ ఇచ్చేవాళ్లను చూసింది. ఆవిడ మాటలే తమ మాటలుగా చెప్పిన వాళ్ళను చూసింది. ఏదైనా అడిగితే మా ఆవిడను అడిగి చెబుతా కుదురుతుందో లేదో అని భూపతితో నే అనగా వింది. కానీ భూపతి కి మాత్రం ఆ ఆలోచన ఉండదు.
అవతలి వాళ్ళు ఏది చెబితే అది ఓకే చేస్తాడు తనకు ఇష్టముందా లేదా అనే అలోచననే చేయడు. ఓ రోజు భూపతి స్నేహితుడు ఒకరు "మా ఆవిడకు తోడుగా పంపు మీ ఆవిడను. తను వాళ్ళ పుట్టింటికి ఒక్కతే వెళ్ళాలి "అని అడిగితే సరేనని చెప్పేసి ఇలా వెళ్ళాలి అని చెప్పేసాడు ఇంటికి రాగానే.
ఆవిడ నాకు పరిచయం వున్నా వాళ్ళింట్లో వాళ్ళు తెలియదే అని అన్నా వినిపించుకోలేదు భూపతి. ఇది తమ పెళ్ళైన కొత్తలో నే జరిగిన సంఘటన. గుర్తొచ్చినప్పుడల్లా కొందరి జీవితం ఇంతేనేమో అని అనిపిస్తుంది.తమ చుట్టూ అవసరం కోసం మాత్రమే మంచిగా మాట్లాడే అవకాశవాదులే ఉండడం నిజంగా కొందరి దురదృష్టం.
అవని కి తన చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి. నానమ్మ అంటే తనకెంతో ఇష్టం. ఆవిడ పిల్లలందరిని కూర్చోబెట్టుకుని రామాయణ, భారత, భాగవతాల్లోనుంచి కథలు చెప్పేది. ఆ కథలు చెబుతూ మనిషి ఎలా ఉండాలో కూడా వివరించేది. ఆ విషయం అంతగా తన తోబుట్టువులు పట్టించుకోలేదు కానీ తనకు మాత్రం బాగా మనసుకు హత్తుకు పోయాయి. ముఖ్యంగా నానమ్మ కృష్ణావతారం గురించి చెబుతూ...
" ఈ మనుషులతో వుండే బంధాలు అన్నీ అశాశ్వతాలు. భగవంతుడితో వుండే ఏ బంధంతో కూడిన భావన అయినా శాశ్వతం. భార్యాభర్తలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిల్లలూ ఇలా ఎవరి కోసం మనం ప్రేమించి తపన పడ్డా వాళ్ళు మన ప్రేమకు విలువ ఇవ్వకపోవచ్చు. పైగా హీనంగా చూడవచ్చు.
కానీ భగవంతుడు తనను ఎంతగా ప్రేమిస్తే అంతకు ఎక్కువగా కన్నతల్లి కంటే ఎక్కువగా కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటాడు. మనం జన్మల్లో మర్చిపోయినా తాను ఇచ్చిన మాట మాత్రం తప్పడు.
పృష్ని దంపతులు చేసిన తపస్సుకు మెచ్చిన విష్ణు భగవానుడు వరం కోరుకొమ్మంటే వాళ్ళు నీలాంటి కొడుకు కావాలి అని అడుగుతారు. నాలాంటి అంటే ఎవరూ ఉండరు కనుక నేనే మీకు మూడుసార్లు కొడుకుగా పుడతాను అని వరం ఇచ్చి, ఆ జన్మలో వారికి పృష్ని గర్భుడు అనే పేరుతో, ఆ తర్వాత వాళ్ళు అదితి,కశ్యపులుగా పుట్టినప్పుడు వారికి వామనుడిగా, వారు దేవకివసుదేవులుగా జన్మిస్తే వారికి కృష్ణ భగవానుడిగా మూడు సార్లు కొడుకుగా జన్మించాడు. వారిని తరింపజేశాడు.
అదే మనుషులకు ఏదైనా ఒక మేలు చేస్తే తెల్లవారేసరికి ఆ విషయం మర్చి పోయి, నువ్వు మాకు అన్యాయం చేసావు అనే అంటారు." అని చెప్పేది. తను అలానే బ్రతికింది.
తను కూడా మనసులో ఏ ఫీలింగ్ లేకుండా భావాతీతంగా వుందామని ఎంతో ప్రయత్నించింది. కానీ సాధ్య పడలేదు. ఎవ్వరికీ ఏ కొంచెం బాధ కలిగినా తల్లడిల్లిపోయేది మనసు.
నానమ్మ మాటలు గుర్తు తెచ్చుకుని, మానసికంగా భగవంతునికే దగ్గరగా ఉండి, ఈ బంధాలను పట్టించుకోవద్దు అని ఎంతగా అనుకున్నా పూర్తిగా వదిలించు కోలేకపోతోంది అవని. అది చెప్పినంత సాధ్యమా!...
ఇలా ఆలోచిస్తూ ఉంటే చిన్నగా కునుకు పట్టింది అవనికి. ఇంతలో పనమ్మాయి కాలింగ్ బెల్లు కొట్టింది. తలుపు తీసి ఆ పనులు అవ్వగానే టీ పెట్టి పనమ్మాయి కి ఇచ్చి, తను తెచ్చుకుని కూర్చుంది.
ఈ మధ్యే పెట్టుకుంది పనమ్మాయిని. ఇన్నేళ్ళుగా ఒంటిచేత్తో పనులు తనే చేసుకునేది. ఈ మధ్య చేయడానికి శరీరం అస్సలు సహకరించట్లేదు. అందుకే పనమ్మాయిని పెట్టుకుందామని అడిగింది భూపతిని. ఉండేది ఇద్దరమే. ఇంతోటి పనికి పనమ్మాయి ఎందుకు అన్నాడు కానీ.. మళ్ళీ ఏమనుకున్నాడో సరేనన్నాడు.
వంట తనే చేస్తుంది. మిగతా పనులకు పనమ్మాయి. రాత్రి కి చపాతీలు, కూర చేసి భూపతి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇలా ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడల్లా అమ్మ చెప్పిన సంగతి గుర్తు వస్తుంటుంది అవనికి. అమ్మ వాళ్ళ చుట్టాలమ్మాయి ఎప్పుడూ భర్త కోసం చూస్తూ అతను వచ్చేదాకా తినకుండా వుండేదిట. అతనేమో కావాలని లేటుగా బయటే ఫుల్లుగా తిని వచ్చేవాడట. ఒక్కోసారి రెండు రోజులు ఇంటికి రాకుండా పోయేవాడట. ఆ మానసిక హింస, తిండి సరిగ్గా తినకపోవడం తో పిల్లలు కూడా పుట్టకముందే చనిపోయిందట ఆ అమ్మాయి. మరి నా వంతు ఎప్పుడో?ఎలానో? అని విరక్తిగా నవ్వుకుంది.
ఇంతలో భూపతి వచ్చాడు.
@@@@@@@
అవని నుంచి కాల్ వచ్చింది భూపతికి మధ్యాహ్నం. తను లంచ్ చేస్తున్నాడు ఫ్రెండ్ తో కలిసి. కట్ చేసేసాడు విసుగ్గా. మళ్ళీ కాల్. విసుగుతో స్విచ్ ఆఫ్ లో పెట్టాడు.
ఆ ఫ్రెండ్ కి కూడా వచ్చింది కాల్. చాలా సరదాగా మాట్లాడి పెట్టేసాడు. "రోజూ కాల్ చేస్తుంది మా ఆవిడ. నా ఆరోగ్యం గురించే ఆమె బెంగ. ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంది. తను నా భార్య అవ్వడం నా అదృష్టం రా! ఈ కాలం లో భర్త గురించి నిరంతరం తపన పడేవాళ్ళు ఎంతమంది! ఇంట్లో ఒక్కతే ఉంటుంది తనకు కూడా ఏమైనా అయితే! అందుకే మధ్య మధ్యలో నేనూ కాల్ చేసి మాట్లాడుతుంటాను. ఎలాగో రిటైర్డ్ అయ్యాము. ఇప్పుడు చేసేది ఏదో కాలక్షేపానికి కదా! " అంటున్నాడు స్నేహితుడు
ఇంతలో లంచ్ అయిపోయింది. తన క్యాబిన్ కి వెళ్లి ఫోన్ ఆన్ చేసాడు. 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అవని నుంచి.
ఇందాకటి స్నేహితుడి మాటల ప్రభావమో ఏమో కాల్ చేసాడు అవనికి. అవతల నో రెస్పాన్స్. అస్థిమితం అయ్యింది మనసు ఎందుకో.
సరే ఇంటికి వెళదాం అనుకుంటుండగా పనమ్మాయి నుంచి కాల్. "సార్! అమ్మగారు తలుపు తీయట్లేదు. కిటికీ లోనుంచి చూస్తే పూజ గది ముందు పడిపోయినట్టుగా అన్పిస్తోంది. గాభరాగా అనిపించి మీకు కాల్ చేశా" అంది.
వెంటనే ఇంటికి వెళ్లి డూప్లికేట్ కీ తో తలుపు తీయించి లోపలికి వెళ్ళి చూస్తే పూజ గది ముందు పడిపోయి ఉంది అవని. ముట్టుకుని చూస్తే చేతులు చల్లగా తగిలాయి. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసాడు. తన ఫోన్ నుంచి అందరికీ కాల్ చేసినట్లుంది. ఎవ్వరూ లిఫ్ట్ చేయనట్టున్నారు. అంబులెన్స్ వచ్చింది. హడావుడి గా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్ చెక్ చేసి "సారీ! గంట క్రితమే ఆవిడ ప్రాణాలు విడిచారు హార్ట్ స్ట్రోక్ తో" చెప్పారు.
అందరికీ సమాచారం అందింది. వచ్చి ఏడ్పులు ఏడ్చారు. ఆవిడతో బంధాలు గుర్తు చేసుకున్నారు. అన్నలు, అక్కచెల్లెళ్ళు ఎంత మంచిదో ఆవని అన్నారు.
పిల్లలు "అమ్మా! మమ్మల్ని వదిలిపోయావా? నీ మనుమలు, మనుమరాళ్ళూ నిన్నే కలువరిస్తున్నారే" అంటూ ఏడ్చారు.
కానీ ఇవేవీ వినడానికి అవని దేహం నిర్జీవమై ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆమె ఫోటో తో ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టారు. కవితాత్మకంగా వ్రాసారు ఆమెను కోల్పోయిన బాధను. ఫేస్ బుక్ లో అందరి స్నేహితుల , బంధువుల చేత ఓదార్పు పొందారు. కార్యక్రమాలు ఘనంగా చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకున్నారు. వీళ్ళ బాధకు, అవనితో వీరి బాంధవ్యానికి అందరూ జేజేలు కొట్టారు. అలా అవని ఈ అవని నుంచి నిష్క్రమించింది.
మరణానంతరం వీరు చూపించే అతి ప్రేమ ను చూసి ఓ శుష్కమైన నవ్వు నవ్వుకుని, హమ్మయ్య ఇప్పటికైనా ఈ అబద్ధపు అనుబంధాల నుంచి విముక్తి కలిగిందని తనకు నిర్దేశించిన లోకానికి పయనమయ్యాడు అవని లో నుంచి వెళ్లిన జీవుడు.
అవని మరణానంతరం అయినా తన ప్రవర్తన ద్వారా అవనిని ఎంత క్షోభ పెట్టాడో తెలుసు కుంటాడా భూపతి? ఆ కాలమే నిర్ణయించాలి
అందుకే ఈ జీవితం మిధ్య అనే విషయం తెలుసుకుని జీవన్ముక్తులుగా పూర్తిగా మారలేకపోయినా కనీసం ప్రయత్నించాలి. అప్పుడే ఈ జీవుడు తేలికగా శరీరం నుండి బయట పడతాడు.
ఇటువంటి అవని లు ఎందరో మన సమాజంలో...
ఈ కథ అవనిలాంటి వారికి మేలు చేస్తుందనే భావనతో పంపడమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి