27, ఏప్రిల్ 2023, గురువారం

వైశాఖ పురాణం - 5 వ అధ్యాయము

వైశాఖ పురాణం - 5 వ అధ్యాయము🚩*_


🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷


*వైశాఖమాస విశిష్టత*


🌹🪷🌹🪷🌹🪷🌹🪷


నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము యితర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను.


మహారాజా! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను.జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన యుదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన యుదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని మర్యాదలను రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.


ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.


సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ  ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు. సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు. స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును. సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకలమున సర్వవస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.


అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను లతాతరువులను, జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను, తుష్టి, పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు, యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను, కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై, అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ, దానధర్మములను, భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.


ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు, అన్ని వర్ణములవారిని, అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై యింద్రాది సర్వదేవతా పరివేష్టితుడై, చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కరికలను మించి వరముల నిత్తురు.


శ్రీహరి వైశాఖమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని, గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని, పరమేశ్వరునిగాని, యితర దైవతములను సజ్జనులను పూజించినను, వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానినవారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు. సపరివారముగ వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ! తమయేలుబదిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను, అతిధులను, అభాగ్యతులను, దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాస వ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు సిక్షింతురు. కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు  వైశాఖ మాస విశిష్టతను వివరించెను.


            🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

          *న్యాయపతి*

      *నరసింహా రావు*


వైశాఖ పురాణం - 6 వ అధ్యాయము🚩*_


🕉🌷🕉️🌹🕉️🌷🕉️🌹


_*జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ*_


🌹🌷🌹🌷🌹🌷🌹🌷


నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా !  వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.


పూర్వము ఇక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట , నీటిబొట్టులను గణించుట , ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము , భూదానము , తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను , దరిద్రులను , ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను , పండితులను , సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను , ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు , విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు , దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు ? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.


ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను , కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.


మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికోవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి ? ఇట్లేల అరచుచున్నావు ? నీవు దేవజాతివాడవా , రాజువా , బ్రాహ్మణుడవా ? నీవెవరవు ? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.


శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా ! నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో , నీటియందు జలబిందువు లెన్నియుండునో , ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను , ముమ్మారు చాతక పక్షిగను , గ్రద్దగను , యేడుమార్లు కుక్కగను , ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను ఇరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా ! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును ? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా ! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను , సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు ? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి ? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును , తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా ? అట్టి పూజలవలన ఫలితముండునా ? అనాధలు , అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ , జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము , జ్ఞ్ఞానము , వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు , సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ , వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు , అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా ? గ్రుడ్డివానికేమి కనిపించును ? అతడేమి చెప్పగలడు ? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను , వారిని సేవించినను అవి నిష్ఫలములు , నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను , దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును ?


తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము , సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు. ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా ! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.


ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు , శ్రుతదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు , జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందు చేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును , వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷


🙏🌷🙏🌹🙏🌷🙏🌷

కామెంట్‌లు లేవు: