_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 5 వ భాగము*_
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
*వేదాధ్యయనము*
ఉపనయనమయ్యాక వచ్చే శ్రావణ పౌర్ణమినాడు నూతన వటువుకు ఉపాకర్మ చేయడం సాంప్రదాయం. ఆ పిమ్మటే వానికి వేదాధ్యయన అధికారం లభిస్తుంది. యధావిధిగా శంకరునికి ఉపాకర్మ జరిపించింది ఆర్యాంబ. తరువాత గురువుల కప్పగించింది తనయుణ్ణి. గురువుల పెదవులు చూచే శంకరుడు అందుకుంటున్నాడు. వేదవిద్య అసమాన్య మైనది. మన భారత భూమి పలు విధాల భిన్న భిన్న సంప్రదాయాలకు ఆటపట్టు. ఆహార వ్యవహారాలలో, భాషా పద్ధతులలో వైవిధ్యం ఉన్నప్పటికీ అతిప్రాచీన మైన సంస్కృతి మనది. దానికి జీవగఱ్ఱ వేదాలు. దేశ ప్రజల నందరినీ ఏకసూత్రబద్ధులను చేసేదే వైదిక ధర్మ సంస్కృతి. అపౌరుషేయాలయిన వేదాలను పరమాత్ముని ఉచ్ఛాస నిశ్శ్వాసాలుగా వర్ణిస్తారు. ఒక్కొక్క వేదం పదిరెండేడులు చొప్పున నాలుగు వేదాలు నేర్వడానికి నలుబది ఎనిమిది సంవత్సరాలు పట్టుతుంది. ఊహింపరాని అద్భుత శక్తియుక్తుడైన శంకరునికి మాత్రం అత్యల్పకాలంలోనే స్వాధీనమయ్యాయి వేదాలు సర్వస్వమూ. పరాత్పరుడే తన శిష్యు డయ్యాడని పొంగిపోతున్నాడు శంకరుని గురుడు. బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ మధూకర వృత్తితో ఆదర్శరీతిలో గురువుల కడ విద్య నభ్యసిస్తున్నాడు.
*బంగరు ఉసిరిక పండ్ల వాన:*
దండమూ, జలపాత్ర, జోలె ధరించి కౌపీనధారియై భిక్షాటనకై బయలుదేరాడు శంకరవటుడు. వామనమూర్తి వస్తున్నా డని వీధుల్లో వ్రేళ్ళాడి చూచేవారు అతణ్ణి. ఒక ఇంటి ముందు నిలబడి 'భవతీ భిక్షాం దేహి' అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు విన్నదా పిలుపు. ప్రత్యక్షంగానైనా చూడ నోచుకోని పరిస్థితి. తలుపు సందు ద్వారా చూచింది. భిక్ష పెట్టడానికి పట్టెడన్నమైనా లేదు. ఆమెకు ఏమీ తోచక కండ్లు గిర గిర తిరిగాయి. దుఃఖ మాపుకోలేక భగవంతుని తలచుకొని ఇలా పరితపించింది: 'పరాత్పరా! కట్ట బట్టా, తిన తిండీ లేని బ్రతుకిచ్చావు. ఇటువంటి పుణ్యపురుషునికి పట్టెడు పెట్టే భాగ్యం నా కెప్పుడు వస్తుందో కదా! ఈ దీనురాలి యెడ దయతో ఏదైనా దారి చూపించవా!'. బ్రహ్మచారి నుద్దేశించి 'నాయనా! నా నాధుడు గ్రామం లోనికి వెళ్ళియున్నాడు. కనికరించి కొంచెము సేపు కూర్చుండవా' అని వేడుకొన్నది. అది విన్న శంకరుడు ఆ ఇంటి వైపుచూచాడు. ఆ యిల్లు వారి కాశ్రయమిచ్చే గృహం కాదు, చంద్రార్కుల కాపురమని గ్రహించాడు. ఆ ఇల్లాలు వైపు తిరిగి 'అమ్మా! నీ బిడ్డని చేతిలో ఒక ఉసిరిక ఫలం ఉంది. అది నాకు భిక్షగా జోలెలో పడవేయుము' అని అడిగాడు. వెంటనే తన కుమారుని చేతనున్న ఉసిరిక ఫలాన్ని శుభ్రంగా కడిగి పరమ భక్తి భావంతో బ్రహ్మచారి జోలెలో వేసి నిట్టూర్చింది.
ఆ ఇల్లాలి దీనావస్థ చూచిన శంకరబాలుని హృదయం ద్రవించి పోయింది. శ్రీ మహాలక్ష్మిని తలంచి మహాదేవికి ఆయత్తం చేసి ఈ విధంగా స్తోత్రం చేసాడు.
*"అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయన్తి, భృజాఙ్గనేన ముకులాభరణం తమాలం*
*అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా, మాఙ్గల్యదాస్తు మమ మఙ్గల దేవతాయాః ॥*
పై విధంగా మృదువుగాను, మధురంగాను శ్రీమహాలక్ష్మీ కటాక్షం కోసం చేసిన స్తోత్రాన్ని విని ఆ శశిసోదరి సాక్షాత్కరించింది. చల్లని చూపులు ప్రసరిస్తున్న ఆ దేవి వంక తిరిగి ఇలా ప్రార్థించాడు బాల శంకరుడు.
“అమ్మా! ఈ గృహిణి పుణ్యవతి కడుబీదరాలు. లేమి వెతతో బ్రదుకుటకుకష్టపడుతున్నది. జాలి వహించి ఈమెను అనుగ్రహించు”. దానికి శ్రీమహాలక్ష్మి ఈ విధంగా సెలవిచ్చింది: "శంకరా! వీరలు పేదలని కదా నీ పరితాపము? పూర్వజన్మ లో ఏ కొలది పుణ్యము చేసికొనరైరి. ఈ జన్మలో భాగ్యమెట్లు ప్రాప్తించును?” నిశ్శంకగా తేల్చి చెప్పిన ఆ మహాలక్ష్మి మాట విని శంకరుడు మరల ఈ విధంగా దేవిని వేడుకొన్నాడు. “సర్వమంగళదేవతవు. సర్వలోకాధీశుని సంతోషపెట్టగల నీ శక్తి అపారం. ఈ చిన్న పని నీకు లెక్క లేదు. సాగరసుతవు. సాగరాన్ని మించిన దయాంబురాశివి. కల్పవృక్షాన్ని మించిన భాగ్యదవు. ఈమె ముందు జన్మలో ఏ పుణ్యమూ చేసి ఎఱుగ దన్నావు. మరి ఈ జన్మలో ఇప్పుడే నాకు ఉసిరికఫలం ఇచ్చింది. తత్ఫలితం ఎప్పుడో కాక ఇప్పుడే ప్రసాదింపవా! నీ అనుగ్రహమున్న లోటేమి?” అని వేడిన ఆ అపురూపపు బ్రహ్మచారి కోరికను మన్నించి కరుణా తరంగిణియైంది. సిరుల రాశి చూపుల దయా ప్రవాహం కనక ధారాపాతమై ఆ పేదరాలి ఇల్లూ, వాకిలీ బంగారు ఉసిరిక పండ్లతో నిండి పోయింది. ఆ మహాదేవి కరుణతో సాధ్యము కానిదేది? నరుడామె అండతో ధీనిధి అగును. కులీనుడగును. వేయేల ఆ తల్లి కరుణించిన జీవి ధన్యాత్ముడగును. (యస్యాస్తి విత్తం సనరః కులీనః సపండితః సశ్రుతిమాన్ గుణజ్ఞః స యేన వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచన మాశ్రయన్తె).
ఆ నాటి నుండి నేటికీ ఆ కనకధారాస్తవం అత్యంత ప్రస్తుతి కెక్కినది.
*శంకరుని విశాలాశయము:*
పేదవారిని చూచి జాలి పడడం ఒక వంతు. కొందరు ఓదారుస్తారు శుష్కవాక్కులతో. దానివలన కలిగే ప్రయోజనం శూన్యమే కాక మానసిక దౌర్భాగ్యానికి దారి తీయవచ్చు. ఉపకారసాహాయ్యం అందించకుండా కనబరచే సానుభూతి నిష్ఫలం. శక్తి కలిగిన మేరకు ఆదుకోవాలి తమ కన్న తక్కువ స్థితిలో నున్న తోడివారిని. బాలుడు శంకరుడు తన శక్తి చూపించాడు ఆదుకున్నా డొక పేద రాలిని. ఆ నాటి మధూకరం శంకరునికి పూర్తి కాలేదు.
ప్రక్క నున్న సంపన్నగృహాన్ని చేరడమే తరువాయి ఆ యింటి యజమాని సిద్ధంగా ఉన్నాడు భిక్ష చేత్తో పట్టుకొని. ఆ పెద్ద మనిషిని చూచి నిష్కర్షగానే ఇలా చెప్పాడు. “సంఘంలో మసలుతూ తోడి వారిని ఆదరించని వారొసంగిన భిక్షాహారం భుజిస్తే న్యాయ భావం జనిస్తుందా?” మొదట ఆ మాటలు ఆ గృహస్థునికి అర్థం కాక వివరంగా శంకరుడు చెప్పాక విని పరివర్తన రాగా బాలశంకరుని కాళ్ళపై బడి "స్వామీ! నా మాట వినండి. ఈ క్షణంనుండి నా ధనాన్ని ధర్మానికి ఉపయోగిస్తాను. మీ పాదాలే సాక్షి" అని నివేదించుకొన్న భాగ్యశాలి నిజమైన భాగ్యశాలి అయ్యాడు ఆ క్షణం నుండి.
*గురుకులవాస విశిష్టత:*
ఆనాటి విద్యావిధానం నేటివలె కాక పూర్తిగా వేరుగా ఉండేది. ఎంత తరచి చూచినా పోలిక లేమీ పొడగట్టవు. నాటి పద్ధతుల వలన బాలురలోని సుషుప్తశక్తు లను వెలికితీసి వికసింప జేయగల మెలకువ లుండేవి. నిజమయిన పౌరులను తయారుచేసే విధంగా కొనసాగేవి ఆ గురుకులవాస పద్ధతులు. కేవలం ఉపన్యాసాలు విని, గ్రంధాలు చదివితే సర్వంకషంగా సాంఘిక జీవన యానానికి ఉపయుక్తమైన జ్ఞానం అలవడదు. అది సరియైన శిక్షణతోనే లభిస్తుందన్న విశ్వాసమే ఆనాటి గురుకుల విద్యారంగానికి మూలసూత్రం. ఆ శిక్షణలో మొదటిది మధూకరవృత్తి అనబడే భిక్ష.
తేనెటీగలూ, తుమ్మెదలూ పుష్పాలలోని తేనెను సంపాదించు కొనే విధానం. ఆవ్యాసంగంలో వినయము, విధేయత బలపడి దురభిమానాన్ని దూరం చేస్తుంది. నమ్రతతోడి భక్తి, శ్రద్ధ, సహపౌరులపై ప్రేమ జనింప చేస్తాయి. భవిష్యత్తుకు మంచి బాట విద్యార్థులకు పడడమే కాక, లేత ప్రాయములో ఉన్న వారిని చూచిన పెద్దలకు వాత్సల్యం పొడచూపుతుంది. గురు కులంలో గుంట ఓనమాలు నేర్పరు. అవన్నీ ముందుగా ఇంట్లోనే నేర్చుకొని ఉండాలి. గురుకుల విద్యార్థికి విత్తంతో పని లేదు. వేదాలు వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించేవారు. విద్యాపాటవానికి పేరెన్నిక గన్న నాటి భారతదేశం లోని విశ్వవిద్యాలయాలకు దేశదేశాల నుండి వచ్చి నేర్చుకొనేవారని చరిత్రలు చెప్పుచున్నాయి.
*భరద్వాజుడు, వేదాలు:*
పూర్వం భరద్వాజముని బ్రహ్మచర్య వ్రతము చేపట్టి వేదాలను నేర్చుకోవడం మొదలుపెట్టాడట. ఆయన కున్న మూడు బ్రహ్మ కల్పాల ఆయువు ఐపోవచ్చింది కాని వేదాధ్యయనం పూర్తి కాలేదు. అప్పుడు అధ్యయనం కట్టిపెట్టి ఆయువు కోసం ఘోర తపస్సు చేయగా మెచ్చిన బ్రహ్మగారు దేవేంద్రుణ్ణి పంపించి ఆయన కేమి కావాలో చూడమన్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై మరొక బ్రహ్మకల్పం ఆయుష్షు ప్రసాదిస్తూ భరద్వాజుని ఈ ఆయువుతో ఏమి చేద్దామనుకొంటున్నావని అడిగాడు. భరద్వాజుడు వేదాధ్యయనం పూర్తి చేద్దామని అనుకుంటు న్నానని చెప్పాడు. ఇంద్రుడు చూపించా వేదరాశిని. మహామేరు పర్వతాల్లాగ కోటి సూర్యుల కాంతికి మించిన ప్రకాశంతో వెలుగుచున్న వేదాలను కంటితో చూడలేకపోయాడా మహాముని. మూడు వేదాల పుంజాలను ఋషి మ్రోల పెట్టి వీటితో సరిపెట్టుకో. గృహస్థాశ్రమం చేకొని శిష్యులకు చెప్పుకొంటూ ఈ కల్పం గడుపుకో అని. మూడు గుప్పెళ్ళుగా ఇంద్రుడిచ్చిన వేదరాశులు కలగాపులగం గా ఉండి పోయాయి.
బ్రహ్మ అంశంతో అవతరిం చిన కృష్ణద్వైపాయనుడు వాటిని నాలుగుభాగాలుగా విభజించాడు. అలా వెలసిన ఋగ్వేదము సామవేదము, యజుర్వేదము, అధర్వవేదము దైవప్రసాదితములైన అనంత విజ్ఞానఖనులు. వేదవ్యాసుడు పైలునకు, వైశంపాయనునకు, జైమినికి, సుమంతునకు ఒక్కొక్కరికి ఒక్క వేదం చొప్పున ఉపదేశించాడు.
*కైలాస శంకర కాలడి శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*5 వ భాగము సమాప్తము*
🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి