9, జులై 2021, శుక్రవారం

నారాయణీయము

 *నారాయణీయము* 


*(మొదటి భాగము.)*


 విష్ణు భక్తులందరూ ఎంతో ఆదరంతో పఠించే పుస్తకం నారాయణీయము. ఇది భాగవతం లో భక్తి వేదాంత విషయాలకు సంక్షిప్త వర్ణనము. ఇందులో ఉన్న శ్లోకాలలో బీజాక్షరాలూ, తత్వ సంబంధమైన రహస్యాలూ కొల్లలుగా ఉన్నాయి.  ఈ పుస్తక పఠనం ఆధ్యాత్మిక ఉన్నతి కే కాక ఆయురారోగ్యాలను శారీరక సౌఖ్యాన్ని కలుగజేస్తుందని  నమ్మి చాలామంది ఈ పుస్తక పఠనాన్ని నియమ పూర్వకంగా చేస్తుంటారు. ఈ పుస్తక రచన జరగడానికి పూర్వ రంగమైన  కథ ఒకటున్నది.


 కేరళ దేశంలో గురువాయుర్ దగ్గర *నారాయణ భట్టతిరి (భట్టాత్రి)* అనే విద్వాంసుడుండేవాడు. ఆయన నంబూద్రి బ్రాహ్మణులు. పురాణాలు వేద వేదాంగాలు సంస్కృత వ్యాకరణము బాగా చదువు కున్నారు. ఆయన గురువు గారికి వాత రోగం వచ్చింది. గురువు గారు చాలా తీవ్రంగా బాధ పడేవారు. నారాయణ భట్టతిరి గారు గురువుగారి బాధను చూసి తల్లడిల్లి పోయాడు. తన యోగబలంతో ను సంకల్పబలంతో ను ప్రయత్నించి ఆ వ్యాధిని గురువుగారి శరీరంనుంచి తన శరీరం లోనికి మార్పు చేసుకున్నారు. తనకున్న యోగబలంతో ఆ వ్యాధిని నియంత్రి ద్దామని  చూసారు గాని అది వీలు పడలేదు. పైగా ఆ అనారోగ్యం తిరగ బెట్టి ఈయనను పూర్తిగా మంచానపడేసే టట్లు చేసింది. ఊరికే మంచాన పడ్డా పర్వాలేదు శరీరమంతా ఓర్చుకోలేనంతగా బాధ పెట్టడం మొదలు పెట్టింది. వైద్య శాస్త్రం లో ఉన్న  ఔషధాల న్నీ ప్రయోగించినా ఆ బాధ తగ్గలేదు. బాధ భరించలేని స్థితికి వచ్చింది.


తుంజత్ ఎళుతచ్చన్  అనే మహా యోగి విష్ణు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చారట. భట్ట తిరిగారు తన కథంతా ఆయనకు చెప్పుకొని ఈ వ్యాధిని గురువుగారి శరీరంనుంచి తన శరీరం లోకి తెచ్చుకునే దాకా యోగశక్తి బాగానే పనిచేసింది తర్వాత నుంచి పని చేయడం మానేసింది  ఎందుకు ఇలా జరిగింది ప్రస్తుతం ఈ జబ్బు నాకు ఎలా తగ్గుతుంది నేనేం పుచ్చుకోవాలి అని అడిగారట. ఆయన నవ్వి భగవంతుని లీలలు అలాగే ఉంటాయి.  ఏదో ప్రయోజనం లేకుండా ఇలా జరగదు.  నీకు ఈ జబ్బు తగ్గాలంటే మొదట "చేప తో మొదలు పెట్టు తర్వాత తాబేలు" ఇలా చేస్తే గుణం ఇస్తుంది అక్కడి నుంచి క్రమక్రమంగా ముందుకు వెళ్ళు అన్నారట. ఆ సంభాషణ మొత్తమూ సంస్కృత భాషలో నే జరిగింది. ఆ ఉపదేశాన్ని ఇచ్చినాయన చాలా మితభాషి. మౌనంగా ఉండేవాడు. ఆ మాత్రం చెప్పడం కూడా ఎక్కువ. భట్టతిరి గారికి ముందు అర్ధం కాలేదు. చేపలు  కోడిగుడ్లు తినడం భట్టతిరి గారి ఆచార ప్రకారం నిషేధము. గురువు గారికి భట్టతిరి గారి ఆచారాలన్ని బాగా తెలుసు. మరి ఎందుకు ఇలా చెప్పారు. చాలా రోజులు అర్థం కాలేదట.


పాండిత్యం ఉంది కానీ మాయ వ్యామోహము మనసుని కప్పి ఉన్నందువల్ల స్పష్టంగా చెప్పిన మాటలకు కూడా "మందు, పధ్యము, అనుపానము" మొదలైన అర్థాలనే భట్ట తిరిగారు అన్వయించు కున్నారు.  తర్వాత చాలా రోజులు ఆలోచిస్తూ కూర్చున్నారట.  ఆయనకు తెలియని శ్లోకం కాదు. కానీ కొంతకాలానికి ఆయనకే  తట్టింది. ఆ శ్లోకం ఇది. 


*శరీరే జర్జరీ భూతే*

*వ్యాధి గ్రేస్తే కళేబరే* 

*ఔషధం జాహ్నవీ తో్యం*

*వైద్యో నారాయణో హరిః*


 *మనకు ఏదైనా జబ్బు రాగానే అల్లోపతి హోమియోపతి చప్పును గుర్తొస్తాయి. మూడోది పై శ్లోకంలో చెప్పినట్టు అల్లోపతి హోమియోపతి వాటి కంటే ముఖ్య మైనది  "తిరుపతి" ( దైవానుగ్రహం) అనేది కూడా ఒకటుంది.*

 ఎందుకో అది ఎవరికి అంతగా గుర్తు రాదు. భట్టతిరి గారి అదృష్టం కొద్దీ మన అదృష్టం కొద్దీ ఆయనకది ఎట్టకేలకు గుర్తు కొచ్చింది. ఆ గురువు గారు మత్యం తో ఆరంభించు  అన్న మాటకు " జబ్బు తగ్గడానికి, మందుగా  చేపలు తినమనే" అర్థం కాదని, నీ పాండిత్యాన్ని ఉపయోగించి మత్స్యావతారం దగ్గర నుంచి మొదలుపెట్టి దశావతారాల వర్ణనను చెయ్యమని అంటే నారాయణ స్తుతి చెయ్యమని గురువుల అసలు సూచన అని అర్థమైంది. విషయం అర్థం అయిన తర్వాత హమ్మయ్య అనుకున్నారట. అప్పటినుంచి వైద్యుల దగ్గరికి పోకుండా భగవంతుడి వైపుకు తిరిగిపోయాడు.


భట్ట తిరిగారు తన 27వ ఏట కావ్యాన్ని మొదలుపెట్టి నూరు రోజుల్లో రోజుకొక దశకం చొప్పున పూర్తి చేసి నారాయణునికి అంకిత ఇచ్చారు.  కావ్యం మాత్రం కేవలం దశావ తారాలు మాత్రమే కాకుండా వ్యాస భాగవత సారాన్నీ అందులోని  ఘట్టాలనీ క్లుప్తంగా  రాశారు.  కావ్యం చేప తో మొదలు కాదు కానీ దశావతారాల వర్ణన కూడా అందులో భాగవతంలో ఉన్నట్టుగానే వస్తుంది.


అపరిమితమైన పాండిత్యాన్ని సంపాదించి యోగమార్గంలో సిద్ధులు కూడా సంపాదించి మోక్ష మార్గాన్ని చూసుకోకుండా ఇంకా సంసారం లో ఉంటూ గురువుల కష్టాలు తన శారీరక కష్టాలు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్న భట్ట తిరి గారికి భగవంతుడు మార్గాన్ని లక్ష్యాన్ని నిర్ణయించ డానికే తన లీలను చూపించాడు. పైన భగవంతుడు నిర్ణయము ఇక్కడ గురువు గారి సూచన రెండూ పనిచేసి పండితుడు భక్తుడయ్యాడు.  పాండిత్యం అత్యంత ఉన్నత స్థాయికి చెందిన కవిత్వం గా పరిణమించింది. భక్తుల కష్టాలు తీర్చడానికి నారాయణీయము అనే కావ్యం రూపు దిద్దుకున్నది. 


 ఈ కావ్యంలో ప్రతి దశకానికి చివర్లో నా వ్యాధిని తగ్గించు అనే మాట తప్పకుండా ఉంటుంది. కావ్యం మొదలుపెట్టగానే భట్టతిరి గారి శారీరక బాధ కొద్దికొద్దిగా తగ్గుతూ కావ్యం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా ఉపశమించింది. తర్వాత ఆయన దాదాపు 96 సంవత్సరాల వయసు వరకు జీవించి చాలా గ్రంథాలు రాసి భగవంతునిలో లీనమైనారు.


భట్టతిరి వంటి జ్ఞాని మహా భక్తుడు మోక్షాన్ని కోరకుండా ప్రధానంగా ఆరోగ్యాన్ని ఎందుకు కోరుకున్నాడు అనే ప్రశ్నకు జవాబు నాలుగో దశకంలో లభిస్తుంది. శారీరకమైన ఆరోగ్యాన్ని మానవులు ఎందుకు కోరుకోవాలో పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో కూడా అవే కారణాలను చూపిస్తారు. మోక్ష పురుషార్ధం తో పాటు మిగతా ఏ పురుషార్ధం సాధించుకోవాలి అన్నా శరీరం ఉండాలి. మోక్షం కోసం ప్రయత్నించడానికి కూడా శరీరమే ప్రధానము. అది పోతే మళ్లీ ఇంకో జన్మ ఎత్తాలి. అందుకే ఆయన ఆరోగ్యాన్ని కోరుకున్నాను అంటాడు.


భట్టతిరి గారి నారాయణీయానికి సంబంధించిన ఇంకొన్ని వివరాలను విశేషాలను తెలుసుకుందాము.


ఇంకా వుంది.......

*నారాయణీయము* 


*(రెండవ భాగము.)*


 నారాయణీయము లోపల వర్ణించిన కథను వ్యాసులవారు భాగవతంలో 18 వేల శ్లోకాలలో విపులంగా వర్ణించారు. అదే కథను భట్ట తిరిగారు వెయ్యి శ్లోకాలలో సంగ్రహంగా రాశారు. 10 శ్లోకాలకు దశకము అని పేరు. అట్లాంటివి ఈ పుస్తకంలో నూరు దశకాలు ఉన్నాయి. కొన్ని దశకాలలో 10 కంటే ఎక్కువ శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆ   శ్లోకాలన్నీ కలుపుకుంటే 1034 అవుతాయి.


 ఈ కావ్యానికి నారాయణీయము అనే పేరు ఎందుకు పెట్టారు అనేదానికి కవి స్వయంగా నూరవ దశకంలోని ఆఖరి శ్లోకంలో కారణం చెప్పుకున్నారు. నారాయణ భట్ట తిరి పేరులో నారాయణ శబ్దం ఉన్నది. ఈ కావ్యం అంకితం ఇచ్చింది కూడా నారాయణుడికే. ఇచ్చిన వాళ్లు తీసుకున్నవాళ్లు ఇద్దరూ నారాయణులే. కాబట్టి ఈ కావ్యం పేరు రెండు విధాల ( ద్వేధా ) నారాయణీయ మవుతుంది అంటాడాయన. సంస్కృత భాషలో కావ్యం అనేది స్త్రీ లింగ పదము. కావ్యం రాసిన వాడిని తండ్రి అని కావ్యం పుచ్చుకున్న వాడిని భర్త అని వ్యవహరిస్తారు. ఈ కావ్య కన్యకకు పుట్టింట్లో పేరు నారాయణుడి కి సంబంధించినది అని, మెట్టినింట్లో పేరు కూడా నారాయణుడి కి సంబంధించినది అనేది ఆ చమత్కారం. 


గురువాయుర్ క్షేత్రం లో ఉన్న విష్ణుమూర్తిని శ్రోత గా ఊహించుకొని ఆయన తన ఎదురుగా కూర్చుని వింటున్నాడని భావిస్తూ,  ఆయనను సంబోధిస్తూ ( ప్రధమ పురుషలో) కవిత్వం నడుస్తుంది. అప్పుడు నువ్వు ఇలా చేశావు అప్పుడు అలా అన్నావు అన్న విధంగా ఆ శ్లోకాలు ఉంటాయి.


 *ఆ శ్లోకాలు భగవంతుడు వినడం అనేది భట్టతిరి గారి బ్రాంతి కాదు ఊహ అంతకంటే కాదు.*


 శ్రీకృష్ణుని బాల్య లీలలను వర్ణించేటప్పుడు భట్టతిరి గారు ఒక వర్ణన చేశారు. ఇది వ్యాసులవారి భాగవతం లో ఉన్న కథనే. యశోద ఒక రోజు పాలు పొయ్యిమీద పెట్టి పెరుగు చిలుకుతూ కూర్చున్నదట. బాలకృష్ణుడు బయటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆకలవుతుందని పాలివ్వమని గొడవ మొదలు పెట్టాడు. ఆవిడ కూడా ఆ కవ్వం చిలుకుతూనే కృష్ణుడి ని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలివ్వడం మొదలు పెట్టింది. ఈ లోపల పొయ్యి మీద పాలు పొంగడం మొదలు పెట్టాయి. యశోద హడావుడి పడుతూ కృష్ణుడిని కిందకు దించి పాల కుండ దగ్గరికి పరిగెత్తిందిట.  పాలిచ్చే మధ్యలో అలా దించి పోయినందుకు కృష్ణుడి కి చాలా కోపం వచ్చింది. పెరుగు కుండ కదలకుండా ఉండడానికి పెట్టిన నాలుగైదు రాళ్ళల్లో నుంచి ఒక గుండ్రాయి పుచ్చుకొని ఆ పెరుగుకుండను పగలగొట్టాడు. ఇది ఆ కథ. భట్టతిరి గారు ఈ కథ రాసేటప్పుడు ఆ కుండను శ్రీకృష్ణుడు కవ్వం తో పగలగొట్టాడు అని రాశాడు. ఆ శ్లోకం ఇది.

 

 *సామి పీత రస భంగ సంగత*

 *క్రోధ భార పరి భూత చేతసా*

 *మంధ దండ ముప గృహ్య పాటితం*

 *హంత దేవ దధి భాజనం త్వయా*  47/3.


*సామి అంటే సగము. మంధ దండ అంటే కవ్వము. పాటితం అంటే పగలగొట్టడము. దధి భాజనం అంటే పెరుగు కుండ అని అర్థాలు.  అమ్మ ఒడిలో హాయిగా పాలు తాగుతూ కాళ్లు ఊపుకుంటూ ఉన్నవాడిని హఠాత్తుగా దించి పక్కనపెట్టే సరికి రసభంగం అయ్యి కృష్ణుడికి చాలా కోపం వచ్చిందట. ఇది ఈ శ్లోక భావం.*

 

ఊర్లో పండితులు ఉంటారు కదా వాళ్లు వెంటనే అభ్యంతర పెట్టారట ఈ వర్ణన వ్యాసభారతాని కి వ్యతిరేకంగా ఉంది అని. "నేను శ్లోకాలు రాసేటప్పుడు ఆ ఘట్టం నాకు కళ్లముందు కనిపిస్తుంది. నాకు కనిపించే ప్రకారం నేను శ్లోకాలు రాస్తుంటాను.." అని భట్ట తిరిగారు వివరణ ఇచ్చారు. ఊర్లో పండితులు ఒప్పుకోలేదట. భట్టతిరి గారు మనస్సు చాలా కష్ట పెట్టుకున్నారు. ఆ శ్లోకాన్ని మార్చి రాద్దామని కూడా నిర్ణయించుకున్నారు. ఈ అభ్యంతరం పెట్టిన పండితులంతా  గుడికి వెళ్లి విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే ఆ గుడిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం తాలూకు అభయ హస్తం కవ్వం పట్టుకొని దర్శనం ఇచ్చిందట. "ఆ సంఘటన అలా రెండు సార్లు జరిగింది. నేను రెండుసార్లు పెరుగు కుండ పగలగొట్టాను. ఒకసారి రాతితో ఒకసారి కవ్వంతో. వ్యాసులవారు ఒక సందర్భాన్ని మాత్రమే భాగవతంలో రాశారు" అని విష్ణుమూర్తి అందరికీ తెలియజేశారు. అందరూ చెంపలేసుకుని మళ్లీ భట్టతిరి గారి దగ్గరికి వచ్చి ఈ భగవంతుడి లీల గురించి చెప్పి ఆ శ్లోకాన్ని మార్చవద్దని అదేవిధంగా ఉంచమని వేడుకున్నారట.


ఇంకా వుంది.......


*నారాయణీయము* 


*(మూడవ భాగము.)*


ఒరిస్సాలో జయదేవుడు రాసిన గీత గోవిందానికి విపరీతమైన ఆదరణ ఉంది. జయదేవుడు వాళ్ళ కవి అని వాళ్లకు చాలా ఎక్కువ గౌరవము. అష్టపదిని ప్రయోగించకుండా ఒడిస్సీ నాట్య ప్రదర్శన ఉండనే ఉండదు. ఉత్తరాదిన తులసీదాసు రచించిన రామచరిత మానస్ అలాగ ఆదరణ పొందిన గ్రంథము. అలాగే నారాయణ భట్టతిరి రాసిన నారాయణీయము కేరళ ప్రాంతంలో ఇంచుమించు ప్రతి హిందువు ఇంట్లోనూ ఉంటుంది. వాళ్లకది నిత్య పారాయణ గ్రంధము. గురువాయూరు క్షేత్రం లో ఈ గ్రంథ పారాయణ నిత్యం జరుగుతుంది. కేరళ వాళ్ల సొంత నాట్య రీతి అయినటువంటి మోహినీ ఆట్టం లో ఎప్పుడూ ప్రార్ధన శ్లోకాలు నారాయణీయం నుంచి వాడతారు. నారాయణీయం లో భట్టతిరి వాడిన విష్ణుమూర్తి కి సంబంధించిన పేర్లన్నీ అదే క్రమంలో సహస్రనామం గా ఏర్పాటు చేసి నారాయణీయ సహస్రనామము అనే పేరుతో గురువాయూర్ లో పారాయణ చేస్తుంటారు. వాళ్లకు నారాయణీయం మీద ఉన్న భక్తికి అది పరాకాష్ట. 


ఈ కావ్యంలో ఉన్న భాష చాలా మధురంగా నూ గంభీరమైన భావాలతోనూ కావ్య పద్ధతిలో ఉంటుంది. ఏమాత్రము కాఠిన్యం ఉండదు. భక్తులను ఈ కావ్యం చాలా ఆనందింప చేస్తుంది. కథ క్లుప్తంగా ఉన్నప్పటికీ వ్యాస భాగవతంలో ఉండే రహస్యమైన వేదాంత విషయాలను స్పష్టంగా విడమరిచి చెబుతూ వర్ణనలు సాగుతాయి. గోవర్ధన పర్వతం కథ దగ్గర ఇంద్రుడు తన అధికార మదం తో శ్రీకృష్ణుడిని అవమానించడానికి పూనుకున్నాడని, అలాగే శిశుపాలుడు అసూయతో శ్రీకృష్ణుడిని అవమానించడానికి పూనుకున్నాడు అని ఇలా ప్రతి పాత్ర మనసులో ఉన్న దుర్గుణాలను స్పష్టంగా చెప్తూ పాఠకులకు ఊహించుకోవడానికి ఏమీ మిగలకుండా కథ నడిపిస్తాడు. సందేహాలు ఏర్పడే ప్రతి ఘట్టం లోనూ ఆ సందేహాలకు సమాధానం చెప్తూ ముందుకు వెళతాడు. ఇది భట్టతిరి గారు కథ చెప్పే పద్ధతి. మూల భాగవతం లో ఉండే భక్తి వేదాంత విషయాల సారాన్ని స్వీకరించి మిగిలిన విషయాన్ని వదిలిపెట్టి క్లుప్తంగా చేసిన రచన ఇది. భాగవతంలోని ఈ విషయాలన్నీ ఏమాత్రం పునరుక్తి లేకుండా సూటిగా స్పష్టంగాఈ పుస్తకంలో వివరించారు. సాధారణంగా నారాయణీయానికి తాత్పర్యం తో కలిసిన ప్రతులు దొరుకుతున్నాయి. కాస్త మనసు పెట్టి చదివితే ఈ విశేషాలన్నీ తెలుస్తాయి. 


తులసీదాసు తాను రచించిన రామచరిత మానస్ లో శ్రీరామచంద్రుడు సాధారణ మానవుడు అనే విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన పరమాత్మ పరబ్రహ్మము అని చెబుతూ ఉంటాడు. అందువల్ల వాల్మీకి రామాయణం లో ఉన్నట్లుగా రామచరిత మానస్ లో కథకు సంబంధించిన రక్తి ఏమాత్రము దొరకదు. భక్తి మాత్రమే ఉంటుంది. నారాయణీయము లో కూడా భట్టతిరి ఇదే పద్ధతిని అనుసరించాడు. ప్రతి దశకం లోనూ అవసరం ఉన్నా లేకున్నా నువ్వు పరబ్రహ్మానివి పరమాత్మవు అని పదేపదే చెబుతుంటారు. అందువల్ల ఈ పుస్తకం భక్తులకు తమ భక్తిని గట్టి చేసుకోడానికి పనికి వస్తుందే కానీ రక్తికి, లౌకికమైన కావ్యానందం పొందడానికి, మాత్రం పనికిరాదు.  


*ప్రధానంగా ఆయురారోగ్యాలను మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఈ పుస్తకాన్ని పారాయణ చెయ్యాలి..* 


ఇంకా వుంది.......


*పవని నాగ ప్రదీప్.*


*పవని నాగ ప్రదీప్.*

.*

కామెంట్‌లు లేవు: