9, జులై 2021, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఖేదం..మోదం..*


"పరమాత్మా..ఈ వయసులో..ఈ మతిస్థిమితం లేని పిల్లతో నాకు ఈ క్షోభ ఎందుకు పెట్టావయ్యా..?" అంటూ బాధపడుతున్న పెద్దావిడ అంతకు రెండురోజుల ముందు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి..24 ఏళ్ల వయసున్న మనుమరాలితో సహా వచ్చింది..ఆమె దాదాపు అరవై ఏళ్ళ వయసు కలది..మనుమరాలికి గత సంవత్సర కాలంగా మానసికంగా బాగాలేదు..ఉన్నట్టుండి ఏడుస్తూ లేచి కూర్చుంటుంది..హఠాత్తుగా ఉన్మాదిలా పరుగెడుతుంది..స్థిమితం అన్న మాటే లేదు..


ఆ పెద్దావిడ పేరు లక్షమ్మ గారు..ఒంగోలు దగ్గర లోని పల్లెటూరు..ఆవిడతో వచ్చిన అమ్మాయి ఆమె కూతురి బిడ్డ..మనుమరాలు..మూడేండ్ల క్రిందట వివాహం చేసారు.. లక్షణంగా కాపురం చేసుకుంటున్నది..భర్త పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు..మొదటి రెండు సంవత్సరాల కాలం హాయిగానే కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయి ప్రవర్తన లో విపరీతపు మార్పు వచ్చింది..పిచ్చి పట్టినట్లు ప్రవర్తించసాగింది..ఒంగోలు లోని డాక్టర్లకు చూపించారు..మానసిక నిపుణులకూ చూపించారు..ఎన్నో రకాల మందులు వాడారు కానీ..ఫలితం కనబడటం లేదు..ఆ అమ్మాయి భర్త ఏమీ చేయలేక నిస్సహాయంగా చూడసాగాడు..


లక్షమ్మ గారికి మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం గురించిన అవగాహన వున్నది..ఒకసారి శ్రీ స్వామివారి మందిరం వద్దకు అమ్మాయిని తీసుకెళ్లి..అక్కడ నిద్ర చేయిస్తే తగ్గిపోతుందని నమ్మకం తో వున్నది..ముందుగా కూతురితో ఈ మాట చెప్పింది..పెద్దగా సుముఖత చూపలేదు..

ఆ అమ్మాయి భర్త కూడా.."ఇన్ని రకాల వైద్యం తో నయం కానిది..ఆ స్వామి మందిరం వద్ద తగ్గుతుందా..?" అని సందేహంగా అన్నాడు..

లక్షమ్మ గారు పట్టు వదల్లేదు.."మీరెవ్వరూ  తోడు రానక్కరలేదు..ఆ పిల్లదాన్ని తీసుకొని నేను వెళతాను..ఒక వారంపాటు ఆ స్వామి సన్నిధిలో వుంటాము..నామాట వినండి..అమ్మాయికి ఏ దయ్యామో..ఏదో పూనిందని నా అనుమానం..ఆ స్వామి వారి వద్ద ఇటువంటి గాలిచేష్ట లన్నీ పోతాయని చెప్పుకుంటారు.." అని గట్టిగా చెప్పి..పట్టుబట్టి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఆ అమ్మాయితో సహా వచ్చేసారు..


మొదటి రెండు రోజుల్లో ఆ అమ్మాయి లో ఏ మార్పూ కనబడలేదు..పైగా మరింత ఎక్కువగా రచ్చ చేయడం మొదలుపెట్టింది..లక్షమ్మ గారికి ఏమీ పాలుపోలేదు..శ్రీ స్వామివారి సమాధి ముందట సాగిలబడి...వేడుకున్నారు..మూడోరోజు మధ్యాహ్నం నాటికి అమ్మాయి లో మార్పు వచ్చింది..ఎటువంటి విపరీతపు పోకడలు పోకుండా..బుద్దిగా కూర్చున్నది..నాలుగోరోజుకు శ్రీ స్వామివారి మందిరం  శుభ్రం చేయడం..స్వామివారి పటానికి అగరుబత్తీలు వెలిగించడం..తులసికోట వద్ద దీపం పెట్టడం..చేయసాగింది..మరో రెండు రోజుల కల్లా..ఆ అమ్మాయి మామూలుగా మారిపోయింది..లక్షమ్మ గారిక్కూడా ఆశ్చర్యం వేసేటంతగా అమ్మాయిలో మార్పు వచ్చింది..తన కూతురికి..ఆ అమ్మాయి భర్తకూ ఈ వార్త చెప్పి పంపారు..వాళ్ళూ ఆఘమేఘాల మీద మొగలిచెర్ల చేరారు..భర్తనూ..తల్లినీ.. ఆ అమ్మాయి ఆప్యాయంగా పలకరించింది..వాళ్ళు నమ్మలేక పోయారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం నాడు లక్షమ్మ గారు.. శ్రీ స్వామివారికి పొంగలి నైవేద్యం పెట్టి..మనుమరాలితో సహా శ్రీ స్వామివారి సమాధి ముందు భక్తిగా నమస్కారం చేసుకున్నారు..అందరూ కలిసి సంతోషంగా వాళ్ళ వూరు చేరారు..


ఈ సంఘటన 2006 వ సంవత్సరం నాటిది..ఇప్పటికీ లక్షమ్మ గారు ఓపిక చేసుకొని..శ్రీ స్వామివారి దర్శనానికి మనుమరాలి సంసారం తో సహా  వస్తూ ఉంటారు..ఆ అమ్మాయి ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి కూడా..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అత్యంత భక్తి తో కొలుస్తూ ఉంటుంది..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చిన ప్రతిసారీ తలారా స్నానం చేసి, ముఖ మంటపం లో సాగిలపడి స్వామివారిని ప్రార్ధిస్తూ ఉంటుంది..


"పరమాత్మా! నీ దయవల్లే ఈ పిల్ల హాయిగా సంసారం చేసుకుంటున్నది స్వామీ.." అని మనస్పూర్తిగా చెప్పుకుంటారు లక్షమ్మ గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: