11, జులై 2022, సోమవారం

భారతంలో లేకపోయినా

 వ్యాస భారతంలో లేకపోయినా, ప్రచారంలో ఉండి అందరూ నమ్మే మహాభారత విషయాలు ఏమిటి?


వ్యాస భారతంలో లేకపోయినా సినిమాలు, సీరియళ్ళ వలనో, మరొక రకంగానో, పాత్రల ఔచిత్యాన్ని ఇష్టమొచ్చినట్టు దిగజార్చేసి, అవే నిజాలు అనుకునేలా చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. విన్నవి విన్నట్టు, చూసినవి చూసినట్టు నమ్మేస్తామే కానీ, మూల గ్రంథాలు చదవము. అలాంటి కల్పిత మహాభారత విషయాల జాబితా, నాకు తెలిసినంత మేరలో చెబుతాను -


దానవీరశూర కర్ణ మొదలగు సినిమాలలో చూపించినట్టుగా ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా కోరుకుంది అనేది తప్పు. తన పరాభవానికి కారణమైన వాడిని, జారస్త్రీ అని తూలనాడిన వాడిని ఆవిడ ఎన్నటికీ వరించదు. కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాలని కోరుకుంది.


ద్రౌపది పుట్టడం ద్రుపదుడికి నచ్చలేదు, ఆవిడని దుఃఖాలనుభవించమని శపించాడు అనేది తప్పు. ద్రుపదుడికి ద్రౌపది అంటే ఎనలేని ప్రేమ, ఆమెని అర్జునుడికిచ్చి వివాహం చేయాలని ఆయన కోరిక.


కర్ణుడు మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోయాడని భారతంలో స్పష్టంగా ఉంది.


కర్ణుడు పాండవుల వైపు యుద్ధం చేస్తే ద్రౌపదిని కర్ణుడికిచ్చి కట్టబెడతానని కృష్ణుడు అనలేదు.


ద్రౌపదీ దేవి మయసభలో దుర్యోధనుడిని చూసి నవ్వలేదు. అసలు ఆ సందర్భంలో ఆవిడక్కడ లేనే లేదు.


పాండవుల ఇతర భార్యలు ఇంద్రప్రస్థంలో ఉండరాదని ద్రౌపది షరతు విధించలేదు.


ద్రౌపదీ దేవి యుద్ధం అయ్యేంతవరకు జుట్టు విరబోసుకుని ఉండటం, దుశ్శాసనుడి రక్తంతో ఆమె కురులను తడపటమనేది వ్యాసభారతంలో లేదు.


కృష్ణుడి వేలు తెగి రక్తం కారితే ద్రౌపది వస్త్రం చించి కట్టింది అన్న కథ వ్యాసభారతంలో లేదు.


ద్రౌపదికి కృష్ణుడికి మధ్య స్వచ్ఛమైన స్నేహం తప్ప ఇంక ఏ సంబంధం లేదు. కృష్ణుడితో విడదీయరాని అనుబంధం ఉన్న అర్జునుడి ద్వారానే (పెళ్ళైన తర్వాత) ఆమె కృష్ణుడి గురించి తెలుసుకున్నది.


సహదేవుడికి భవిష్యత్తు సంఘటనలు తెలుసు కానీ తన సోదరులకు చెప్పలేదని, అటువంటి శక్తులు పాండు రాజు మెదడో, చిటికిన వేలో తినటం వలన వచ్చాయన్న కథ కల్పితం. 


పాండు రాజు చనిపోయినప్పుడు, సహదేవుడు చంటి పిల్లాడు. సహదేవుడికి అటువంటి శక్తులు లేవు.


ఐదు గ్రామాలు అడగమని సహదేవుడు ధర్మరాజుకు సూచించలేదు. అది ధర్మజుని ఆలోచనే.


నకుల సహదేవులకు ఎటువంటి దివ్య శక్తులు లేవు, అశ్వినీ దేవతలలా వైద్యం తెలియవు.


ద్రోణాచార్యుడు కర్ణుడిని శిష్యునిగా చేర్చుకోవటానికి నిరాకరించాడన్నది తప్పు కథ. కర్ణుడు కృపుడు, ద్రోణుడు నుండి నేర్చుకుని తరువాత వారి ఆశ్రమం వదిలి బ్రహ్మాస్త్రం కోసం పరశురాముడిని ఆశ్రయించాడని భారతంలో స్పష్టంగా ఉంది. అంతే కాదు, ద్రోణుడికి గురుదక్షిణ ఇవ్వటం కోసం ద్రుపదుడి మీద సలిపిన పోరులో కర్ణుడు కూడా పాల్గొన్నాడు.


కర్ణుడికి, దుర్యోధనుడికి స్నేహం గురుకుల వాసం నుండే ఉంది. రంగభూమిలోనే వారిద్దరి స్నేహం ఏర్పడటం అన్నది కట్టు కథ.


గాంధారి వ్రత సమయంలో శరీరం బలం చేయటానికి దుర్యోధనుడిని నగ్నంగా రమ్మని అనలేదు.


శకుని కౌరవ వంశాన్ని నాశనం చేయాలని ఏనాడూ అనుకోలేదు.

ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహాన్ని శకుని వ్యతిరేకించలేదు. తానే హస్తినాపురానికి వెళ్ళి గాంధారినిచ్చి పెళ్ళి చేసాడు.


సినిమాలలో, సీరియళ్ళలో చూపించినట్టు శకుని ఎప్పటికీ హస్తినాపురంలోనే ఉండిపోలేదు. ధృతరాష్ట్రునికి బహుమతులు ఇచ్చిన తరువాత తన గాంధార రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు.


భీష్మునితో శకునికి ఎటువంటి శత్రుత్వము లేదు. ఏనాడూ వారిద్దరు వాదించుకోలేదు.


కృష్ణుడు మరియు శకుని మధ్య ఇతిహాసంలో ఏ విధమైన సంభాషణ లేదు, ఆఖరికి శ్రీ కృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వచ్చినప్పుడు కూడా లేదు.


కురుసభలో మాట్లాడటానికి శకుని ఎన్నడూ సాహసించలేదు. ఎప్పుడూ భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాత్రమే మాట్లాడేవారు. అలా కురు సభలో ఇష్టానుసారంగా మాట్లాడింది కర్ణుడు ఒక్కడే. శకుని ధృతరాష్ట్ర, దుర్యోధనులు ముందు మాత్రమే మాట్లాడేవాడు.


పాండవులపై అన్ని కుట్రలలో శకుని భాగమే తప్ప, వాటి వెనుక సూత్రధారి శకుని కాదు.


భీముడికి విషం పెట్టి చంపటం, లాక్షా గృహ దహనం అనేవి దుర్యోధనుడి ఆలోచన, శకునిది కాదు. మేనల్లుడి పై మమకారంతో అందులో భాగం పంచుకున్నాడు శకుని.


దుర్యోధనుడు రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని చూసి అసూయపడగా, శకుని అతనికి ఉన్నదానితో సంతృప్తి చెందమని సలహా ఇచ్చాడు.


దుర్యోధనుడు ఆ సలహాను అంగీకరించకపోగా, పాండవులతో యుద్ధం చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు. అప్పుడు శకుని పాండవుల పరాక్రమాన్ని వివరించి, దుర్యోధనుడికి వాస్తవాలు చెప్పి కళ్ళు తెరిపించటానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు.


అల్లుడి మీద మమకారంతో, దుర్యోధనుడి మొండి పట్టుదల కారణంగా మాత్రమే, శకుని పాచికల ఆటలో పాండవుల రాజ్యాన్ని గెలుస్తానని అతనికి వాగ్దానం చేశాడు.


ద్రౌపదికి జరిగిన అవమానంలో శకుని ఎలాంటి పాత్ర పోషించలేదు. ద్రౌపది వస్త్రాపహరణంలో కీలక పాత్రలు కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాత్రమే.


ధర్మరాజుపై శకుని విజయంలో ఎలాంటి మాయాజాలం లేదు. జూదంలో శకుని నేర్పరి, అంతే.


శకుని ఉపయోగించిన పాచికలు అతని తండ్రి బూడిద లేదా ఎముకలతో తయారు చేయబడలేదు. ఇది ఎలాంటి ప్రామాణికమైన ఆధారం లేని కల్పిత కథ.


దుర్యోధనుడి భార్య భానుమతితో కర్ణుడు ఆట ఆడాడని, ఆ ఆటలో తాళం గుత్తి తీసాడన్న కథ నిజం కాదు. అసలు ఆమె పేరు భానుమతి అని ఎక్కడా చెప్పబడలేదు.


దుర్యోధనుడికి ఇద్దరు భార్యలు, ఒకరు కాశీరాజు కుమార్తె, మరోకరు కళింగ రాజు కుమార్తె. వారిద్దరి పేర్లు వ్యాస భారతంలో ఇవ్వబడలేదు.


అర్జునుడికి చిత్రాంగదకి మధ్య ప్రేమకథ నడవలేదు. ఆమెనిచ్చి వివాహం చేయమని అర్జునుడు నేరుగా ఆమె తండ్రిని అడిగాడు.


ఖాండవ వన దహనం సమయంలో కృష్ణార్జునులతో పాటుగా సత్యభామ, ద్రౌపది, సుభద్ర కూడా అక్కడే ఉన్నారు.


అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండగా పద్మవ్యూహం నేర్చుకున్నాడని భారతంలో లేదు.


పద్మవ్యూహ ప్రవేశం అభిమన్యుడికి (వయస్సొచ్చాక) అర్జునుడే నేర్పాడు, శ్రీకృష్ణుడు కాదు.


బార్బరీకుడు అనేవాడు అసలు లేనే లేడు.


అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తప్పించుకుని బయటకు వచ్చివుంటే అతడిని సంహరించడానికి తాను మరొక అవతారం ఎత్తవలసి వస్తుందని కృష్ణుడు అన్నట్టు ఎక్కడా లేదు.


కృష్ణుడు మహాభారతం జరిగిన 18 రోజులూ కేవలం వేరుసెనగ గుళ్ళే తిన్నాడని భారతంలో లేదు.


కురుక్షేత్ర యుద్ధం ముహూర్త సమయాన్ని నిర్దేశించింది శ్రీకృష్ణుడు. ముహూర్తం నిర్ణయించమని దుర్యోధనుడు సహదేవుడిని అడగలేదు, సహదేవుడు నిర్ణయించలేదు.


అభిమన్యుడు పూర్వ జన్మలో రాక్షసుడనేది తప్పు. ఆయన చంద్రుని కుమారుడి అంశతో జన్మించాడని స్పష్టంగా చెప్పబడింది.


అభిమన్యుడికి యుద్ధవిద్యనంతటినీ నేర్పింది అర్జునుడే, శ్రీకృష్ణుడు కాదు.


శిశుపాలుడి నుండి ద్రౌపదిని కర్ణుడు కాపాడినట్టు భారతంలో లేదు. అది నిజం కాదు.


ద్రౌపది వస్త్రాలు తీయమని దుశ్శాసనుడిని ప్రేరేపించింది కర్ణుడే.


కర్ణుడు చేతిలో ఏ ఆయుధం లేకపోయినా అర్జునుడు చంపాడన్నది తప్పు. ఆఖరి క్షణం వరకు కర్ణుడు ఆయుధాలతో పోరాడుతూనే ఉన్నాడు.


కర్ణుడు ఆఖరి నిమిషంలో బంగారు పన్ను దానం చేసాడని వ్యాస భారతంలో లేదు.


కర్ణుడు తనదేం తప్పని శ్రీకృష్ణుడిని అడగలేదు. శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో కర్ణుడు చేసిన తప్పిదాలన్నీ గుర్తుచేస్తే కర్ణుడు తన తప్పులకు మౌనంగా తలదించుకున్నాడు అని భారతంలో ఉంది.


కర్ణుడి చేతిలో అర్జునుడు ఒక్కసారైనా ఓడిపోయినట్టు భారతంలో లేదు.


కర్ణుడికి పరశురాముని శాపం కేవలం బ్రహ్మాస్త్రం గుర్తుకురాదని మాత్రమే. దాని ప్రకారమే అది అతనికి గుర్తురాలేదు. అయితే, అతను మళ్ళీ గుర్తు తెచ్చుకుని బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి మీదికి ప్రయోగించగా, అర్జునుడు తిరిగి దానిని శమింపజేసాడని భారతంలో ఉంది.


యుద్ధంలో శల్యుడితో వాదులాడుతున్నప్పుడే కర్ణుడు తనకన్నా అర్జునుడి ఆధిపత్యాన్ని, ఉత్తర గోగ్రహణంలో తన ఓటమిని అంగీకరిస్తాడు.


అర్జునుడు పాశుపతాన్ని జయద్రథుడి మీదనే కాదు, అసలు ఎవరిమీద కూడా వాడలేదు.


శిఖండి చాటునుండి అర్జునుడు భీష్ముడిపై బాణం వేసాడనేది కూడా తప్పు. అసలు అర్జునుడు, శిఖండి ఒక రథంలో నిలబడినట్టు లేనే లేదు.


శిఖండిని చూసి భీష్ముడు విల్లంబులు వదిలి పెట్టాడన్నది కూడా నిజం కాదు. శిఖండితో యుద్ధం మాత్రమే చేయకుండా అర్జునుడితో యుద్ధం చేసాడు.


శిఖండిని పట్టించుకోకుండా అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు శిఖండి వేసిన బాణాలు భీష్ముడికి ఏ మాత్రం ఆనలేదు.


భీష్ముడు అస్త్ర సన్యాసం చేయలేదు. ఆఖరి క్షణం వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం పదవరోజు కూడా పదివేల మంది సైన్యాన్ని భీష్ముడు చంపాడు.


కర్ణుడు అర్జునుడి రథాన్ని ఎత్తాడన్నది ఎక్కడా లేదు.


హనుమంతుడు, అర్జునుడు కలిసినట్టు భారతంలో లేదు.


జయద్రథుని వధలో శ్రీకృష్ణుడు సూర్యుడికి చక్రాన్ని అడ్డుపెట్టలేదు.


తనకి తెలిస్తే, ఆహ్వానం లేకపోయినా వచ్చి జూదం ఆడటం వల్ల వచ్చే అనర్థాలు, మనిషి ఎలా ఒక్క పూటలో తన సర్వస్వం కోల్పోగలడో చెప్పి ఆట ఆడనించేవాడు కాదని, అందుకోసం ధృతరాష్ట్రుడిని ఒప్పించటానికి భీష్మ, ద్రోణ, కృపాదుల సహాయం తీసుకునేవాడిననిf TV శ్రీకృష్ణుడు అన్నాడు. ఆయనే అక్కడ ఉండుంటే, ఆ ఆట ఆడనిచ్చేవాడు కాదు.


ఇప్పటికింతే. ఇంకేమైనా గుర్తొస్తే చేరుస్తాను.


సవరణలు:


కర్ణుడు బంగారు పన్ను దానము చేసే కథ భాసకవి ప్రణీతమైన కర్ణభారము[1] అనే నాటకము లోనిది...


భీముడు ద్రౌపది కురులను దుశ్శాసనుడి రక్తంతో తడపటమనే కథ భట్టనారాయణ ప్రణీతమైన వేణీసంహారము అనే సంస్కృత నాటకము లోనిది..


*రాయ పెద్ది అప్పా శాస్త్రి*

కామెంట్‌లు లేవు: