*🌷"బస్సెళ్ళిపోతోంది"🌷* *శ్రీ కొచ్చెర్లకోట జగదీశ్ గారి కథనం*
🌷🌷🌷
చిన్నప్పుడు మాటిమాటికీ వర్షం పడేదని అనిపిస్తూ ఉంటుంది. నిజమేనా? అప్పుడంతా చిన్నచిన్న ఇళ్లలో కాపురం ఉండటంవల్ల ప్రకృతితో పరిచయం ఎక్కువగా ఉండేది.
వీధిలో పిల్లలతో కలిసి కలక్టరాఫీసు గ్రౌండ్‌లో గోళీలు, గూటీబిళ్లా ఆడేటప్పుడు ఎండ....
నాన్నగారి రెవెన్యూ ఫారాలన్నీ మడతలుపెట్టి కత్తిపడవలు చేసి అక్కాచెల్లీ, అన్నయ్యలతో కలిసి వర్షంనీటిలో వదిలేటప్పుడు వాన....
పదిరోజుల ముందునుంచే కర్రలన్నీ ఎండబెట్టి, చెక్కతలుపులు, చెదపట్టిన గుమ్మాలు పోగేసి భోగిమంట కోసం ఎదురుచూసేటప్పుడు చలీ.....
అవును.
కాలాలన్నీ మనతోనే మారేవి. అప్పుడిలా చలికోట్లు, వానకోట్లంటూ వేరే ఆచ్ఛాదనల కోసం పరుగెత్తిన జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఆ కాలాలన్నీ మనకోసం వచ్చినవి. తప్పించుకుపోతే ఎలా?
బళ్లో ఆఖరిగంట కొట్టడానికి అరగంటముందు మబ్బులేసేశాయంటే ఆ గంట ముందే మోగేది. పాపం, పిల్లలంతా వానలో తడుస్తూ ఇళ్లకెలా వెళ్తారంటూ మేష్టారు ముందే కొట్టించేసేవారు. అయినా దారిలో ఉండగానే చినుకులు మొదలైపోయేవి. ఆనక పుస్తకాలే గొడుగయ్యేవి. తల తడవకపోతే జలుబు చెయ్యదంటూ అమ్మ చెప్పిన మాట వేదం.
రాత్రంతా ఒకే దుప్పటిని అటూఇటూ లాక్కుంటూ వెర్రినిద్దర పోయినా భోగిమంట కోసం మాత్రం తప్పకుండా లేచేవాళ్లం.
ఎందుకంటే....
అది చలిని దూరం చేస్తుందని కాదు. వీధిని దగ్గరచేస్తుందని!
అందరూ కలిస్తే చూడాలన్న తపన నీ రక్తంలోనే ఉంటుంది. ఇప్పుడంతా దానికి క్యాంప్ ఫైరంటూ నువ్వు పేరు మార్చినా అంతరార్ధం మాత్రం అదే!
ఆమూలనించి ఈమూలదాకా అన్నిళ్లవాళ్లూ బయటికొచ్చి కబుర్లాడుకోవడం నీ కళ్లలో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగుల ముందు మంటా వెలవెలబోతుంది, వేకువసూర్యుడూ తెలతెలబోతాడు.
ఎర్రటి ఎండ ఎంతలా ఏడిపించినా ఏదో ఒకమూల వేసవంటే మల్లెలంత మమకారం, మావిడిపండంత ఇష్టమూనూ! పక్కింటావిడ బయట ఎండబెట్టే రేగువడియం చూస్తే నీలోని దొంగబుద్ధి చెలరేగుతుంది. అమ్మానాన్నలు చిన్నతనం నుంచీ పుండరీకుడి కథా, అజామీళుడి వృత్తాంతమూ దోసకాయపచ్చడిలా నూరిపోసి పెంచినవాడివే అయినా ఆ సగ్గుబియ్యం వడియాల్ని చూస్తే నీకు సిగ్గూ, బిడియం మాయమవుతాయి.
ఒకటనుకుని రెండు తీస్తావు. తీరా తినేశాక మళ్లీ వస్తావు. అదంతా ఇప్పుడు తలుచుకుంటే... ఇప్పుడు కూడా మళ్లీ దొంగతనం చెయ్యాలనే అనిపిస్తుంది తప్ప, అప్పుడు చేసింది తప్పనిపించదు.
బడికి సెలవులంటూ ఇచ్చేశాక పూర్తిగా వదిలేస్తే బడితెలా తయారవుతాడని ఏదో ఒకదాంట్లో ఇరికించే కుట్రలనుంచి తప్పించుకోవడంలో ఉండే మజా భలే బావుండేది. ఫలానా బళ్లో ఇంగ్లీషు గ్రామరు, ఆ లాయరుగారి మేడమీద సంగీతమూ అంటూ పిల్లల మీద ఏవో అదనపు ఆశల్ని పెట్టుకునే అమ్మానాన్నలకి పిల్లల కళ్లలో గోళీలు కనబడేవి. ఆడపిల్లలైతే అయిష్టంతో లక్కపిడతల్లాంటి నోళ్లని మరింత బుంగల్లా ముడిచేసేవారు. సర్లే పొండని అనగానే విఠలాచార్య సినిమాలో చిలకలా వాడు తక్షణం ఎగిరిపోయేవాడు. వీధరుగుమీద తాడాటలో ఆ పిల్ల మునిగిపోయేది.
వేసవనేది పిల్లలకోసం. ఈ విశాల ప్రపంచంలో మైదానాలు, ఆటస్థలాలు, చెరువుగట్లు, చింతచెట్లు ఇవన్నీ ఆ దేవుడే సహజంగా ఏర్పరచిన వేసవి విడుదులు.
మనలోని భావుకుడు బయటపడాలంటే ముందు మనం బయటపడాలి.
చుక్కలన్నీ కిందకి రాలుతోంటే మనకోసం కన్నీరుకార్చే మేఘాల మీద మమకారం కలగాలి. పంట కోసమో, గుక్కెడు నీళ్లకోసమో, లేక కత్తిపడవల కోసమో వాన పడాలని కోరుకోవాలి.
అదిగో, ఆ ఊడలమర్రిని పలకరించేవారెవరు? తనలో తానే ఐక్యమైపోతూ తరతరాల కథల్ని కబుర్లుగా రాత్రీ పగలూ చెప్పుకుంటుంది.
ఆ నేలంతా రాలిన ఆకులు నీ పాదాల తాకిడికి పరవశమవుతాయి. అది సవ్వడిలా ఉంటుందే తప్ప చప్పుడనిపించదు.
పొడవైన కొమ్మల్ని తప్పించుకుని నేలను తాకాలని జారుతున్న చినుకులన్నీ కనురెప్పల్ని తాకి కాసేపటికి పెదాలపై పడుతూ అంతలోనే సిగ్గుపడి నేలను చేరతాయి.
ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మొన్ననేగా, ఈ చెట్టు నాకు నచ్చలేదంటూ మొత్తం కొట్టేస్తే రెండు వానలకే మళ్లీ నాలుగాకులు ఎక్కువేసింది? చిగురించాలన్న ఆశ బలంగా ఉంటే గొడ్డలికి భయపడుతూ బాధతో తలవంచదు. ఆర్తిగా ఆకాశాన్ని చూస్తుంది.
మనం మాత్రం ఇప్పుడంతా మూసిన తలుపుల మధ్య మహరాజా మంచంమీద నిద్ర. పీల్చే గాలిమీద సైతం వత్తిడి తెచ్చి బలవంతంగా చల్లబరిచి, బయట కురుస్తున్న వాన గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం.
అవును. ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మన బాల్యమే మనల్ని వదిలేసి బస్సెక్కి వెళిపోతోంది.
.............జగదీశ్ కొచ్చెర్లకోట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి