28, జూన్ 2023, బుధవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 104*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 104*


శరదృతువు ప్రవేశించింది. ఆనాడు పౌర్ణమి. 


పాటలీపుత్రవాసులు ప్రతి సంవత్సరమూ ఆ పున్నమినాడు కౌముదీ మహోత్సవమును జరుపుకుంటారు. బ్రహ్మసృష్టి ప్రారంభించిన అనంతరం వేల సంవత్సరాల తర్వాత తానే పురుషుడు - ప్రకృతిగా రూపాంతరం చెంది మైథున కార్యం ద్వారా మానవజాతిని సృష్టించాడు. ఆనాటి నుంచే ఆడా-మగా కలయికతో సృష్టి మొదలైంది. బ్రహ్మ నుంచి అవతరించిన రతీమన్మథులు కామమునకు అధిదేవతలై జీవులను తమ మథనబాణ ప్రయోగాలతో మోహపరవశులను గావిస్తూ జీవుల అభివృద్ధికి కారకులవుతున్నారు. 


ఆ విధంగా మానవజాతి వృద్ధి చెందడానికి, తమ తమ వంశాలు అభివృద్ధి చెందడానికి కారణాభూతులైన కామదేవతలు రతీమన్మథుల ప్రీత్యర్థం సంవత్సరాని కొకసారి జరిపే పండగే కౌముదీ మహోత్సవం. దీనినే 'కాముని పున్నమ' అని కూడా అంటారు. పాటలీ పుత్రవాసులు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 


ఆనవాయితీ ప్రకారం ఈ యేడాది కౌముదీ మహోత్సవం మరింత ఘనంగా జరుపుకోవాల్సిందిగా చంద్రగుప్తుడు చాటింపు ద్వారా నగరప్రజలకు తెలియపరిచాడు. 


చక్రవర్తి స్వయంగా చాటింపు వేయించేసరికి నగరపౌరులు మరింత ఉత్సాహంతో ఆనాడు 'కాముని పున్నమీ' పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని ప్రతి ఇంటినీ పూలమాలలతో, రంగురంగుల ముగ్గులతో శోభాస్కరంగా అలంకరించుకున్నారు. అరటి బోదెలతో, మామిడి తోరణాలతో నగరమంతటా అలంకరణలు చేశారు. స్త్రీలు, పురుషులు కొత్త బట్టలు ధరించి వయసు తారతమ్యాలను పాటించకుండా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ, పన్నీరు చిలకరించుకుంటూ ఆటలూ, పాటలతో ఆ రోజంతా సంతోషంతో పరవాళ్ళు తొక్కారు. 


చంద్రగుప్తునికి ఎప్పటికప్పుడు చారులవలన వార్తలు అందుతున్నాయి. ప్రజలు మహాసంబరంగా ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతగానో ఆనందించాడతను. 


కౌముదీ దీపమహోత్సవంలో అత్యంత ముఖ్యమైన వేడుక దీపోత్సవం. సాయం సంధ్యావేళలో నగరం అంతటా దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటినీ దీపాలతో అలంకరిస్తారు. అంతేగాక శోణనదీతీరంలో ఆకుదొప్పలతో వేలాది దీపాలు వెలిగించి వాటిని నదీ ప్రవాహంలో విడిచిపెడతారు. ఆ విధంగా దీపకాంతులతో మెరిసిపోయే నగర వైభవాన్ని చూడడానికి దేవేంద్రుడికి ఉన్న వెయ్యి కళ్ళయినా చాలవని ప్రతీతి. రాజభవనమైన సుగాంగ ప్రాసాదము కూడా ప్రత్యేక దీపాలంకరణతో ఇంద్రభవనాన్ని తలపింపజేస్తుంది. అంతట మహోన్నతమైన దీపోత్సవంలో రాజు-ప్రజలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటారు. అది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. 


ఆ సంవత్సరము ఆ ఆనవాయితీకి గండిపడింది. 


ఆ సాయంత్రంవేళ దీపోత్సవాన్ని నిషేధిస్తూ నగరమంతటా చాటింపు వేయించాడు చాణక్యుడు. ఆ ఆదేశాన్ని దిక్కరించిన వారికి దేశబహిష్కార శిక్ష విధించబడుతుందని హెచ్చరిక జారీ అయింది. ఆ శాసనానికి భయపడిన ప్రజలు దీపోత్సవాన్ని మానుకున్నారు. ఒక్క ఇంట్లో కూడా నిత్యవసరానికి మించి ఒక్క దీపం కూడా అదనంగా వెలిగించబడలేదు. దీపాలు వెలిగించనందుకు నగరవీధులన్నీ వెలవెలబోయాయి. 


ఆ విషయాలేవీ తెలియని చంద్రగుప్తుడు ఆ దీపోత్సవాన్ని కళ్లారా తిలకించి ఆనందించాలన్న ఆకాంక్షతో ఆ రాత్రి ప్రథమఝాము వేళ సుగాంగ ప్రాసాదము పైభాగము మీదికి చేరుకుని అక్కడినుంచీ నగరాన్ని పరిశీలించాడు. 


'ఏముందక్కడ ? ఒక్క దీపం కూడా లేక నగరం బోసిపోయి కనిపిస్తోంది. తానీ దీపోత్సవాన్ని జరుపుకోమని ప్రజలను ఆదేశిస్తే, ప్రజలు దీపాలెందుకు వెలిగించలేదు ? ఏమిటి కారణం ? రాజాధిక్కారమా ?' అని ఆలోచిస్తూ చంద్రగుప్తుడు బిగ్గరగా "ప్రతీహారీ....." అని పిలిచాడు. మరుక్షణం ద్వారపాలకుడు వచ్చి నమస్కరించాడు. 


"ఈనాడు కౌముదీ దీపమహోత్సవం, దీపోత్సవం ఘనంగా జరుపుకోవాలని మేము ప్రజలను ఆదేశించాము కదా ! నగరంలో ఎవ్వరూ దీపాలు ఎందుకు వెలిగించలేదు ?" అసహనంగా ప్రశ్నించాడు చంద్రుడు. 


"చిత్తం. ప్రభువుల ఆదేశాన్ని యీ సాయంత్రం వరకు ప్రజలు పాటించారు. ఆ తర్వాతే... దీపోత్సవం నిషేధించబడింది. ఈ నిషేధాన్ని పాటించని వారికి శిక్ష .... దేశ బహిష్కారం...." చెప్పాడు ప్రతీహారి. 


చక్రవర్తి విస్తుబోతూ "నిషేధమా ? చక్రవర్తులమైన మాకు తెలియకుండా నిషేధమా ? ఎవరు ? ఇంతటి దుస్సహాసానికి ఒడిగట్టినe వారెవరు ?" గద్దించాడు ఆగ్రహంతో. 


"ఆర్య చాణక్యుల వారు...." చెప్పారు ప్రతీహారి. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: