28, జూన్ 2023, బుధవారం

మార్కెట్ కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము*

 *మార్కెట్ కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము*


ఈ రెండు న్యాయాలు భక్తుడికి భగవంతుడికి మధ్య సంబంధ బాంధవ్యాలను తెలుపుతుంది. 


ముందుగా మర్కట కిశోర న్యాయము:


మర్కటము అంటే కోతి అని మీకందరికీ తెలిసియుండగలదు. ఈ వానరాలు చెట్ల మీద గెంతుతూ ఉంటాయి. అవి చిటారు కొమ్మకు వెళ్లి ఒక కొమ్మ నుండి మరో కొమ్మ మీదకు ఎగిరి దూకుతూ ఉంటాయి. ఒక్కోసారి తల్లి కోతి కడుపుకు అతుక్కుని పిల్ల కోతి ఉంటే భీతి అన్నదే లేకుండా తల్లి కోతి ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగిరి దూకుతుంది. గోడల మీద దాటుతుంది. తన తల్లి కోతిని ఆ పిల్ల కోతి ఎట్టి భయము లేకుండా అలాగే అతుక్కుని ఉంటుంది. మా అమ్మ కిందపడితే నేను కూడా కింద పడిపోతానేమో అనే సందేహము దానికి ఏ కోశానా ఉండదు.


అలాగే మనము భగవంతుని ఒక కోతి పిల్ల తన తల్లి మీద ఎటువంటి సంకోచం లేకుండా తన తల్లి ఉంది తనకు ఏమీ కాదని భావిస్తుందో అలా భగవంతుని మీద మనము అనన్య ఏకాగ్రతతో ఎటువంటి సంకోచం లేకుండా స్థిర చిత్తముతో నమ్మాలి.


అంటే భక్తి భావనలో భక్తుడు కూడా భగవంతుని ఎల్లప్పుడు అట్టి  పట్టుకొని ఉండాలి. అలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోను భగవంతుడు కాపాడగలడన్న పూర్తి నమ్మకంతో వ్యవహరించాలి. ఏ కోశానా అపనమ్మకం ఉండకూడదన్నట్టు. 


మార్జాల కిశోర న్యాయం :


మార్జాల మంటే పిల్లి. మీరందరు పిల్లలను పెట్టిన పిల్లిని చూసే ఉందురు. 


ఒక్క రెండు రోజులు ఇక్కడ ఉన్న పిల్లి అక్కడ తన పిల్లలకు రక్షణ లేదు అనిపించిందా లేదా ఏ కుక్క శబ్దమో మరేదైనా విని పసిగట్టిందా వెంటనే తన పిల్లలను నోట గరచుకుని సురక్షితం అనిపించే మరో చోటుకు మార్చివేస్తుంది. 


అంటే ఇక్కడ పిల్లలను కాపాడే పని పిల్లిది. 


మనము నమ్మిన భగవంతుడు ఒక పిల్లి తన పిల్లలను రక్షించడానికి ఎన్ని ఇళ్ళు మారుస్తుందో అలాగే దైవము మన వెంట ఉండి అన్నీ తానై నడిపిస్తాడన్న భావన. దీనినే మార్జాల కిశోర న్యాయము అంటారు

కామెంట్‌లు లేవు: