28, జూన్ 2023, బుధవారం

అద్వైత సత్యం

 అద్వైత సత్యం


ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం. జ్ఞానం వచ్చేంత వరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది.


నిద్రలో కల కంటున్నంతసేపు అది కల అని తెలియదు. బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిథ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. కాబట్టి ఏ సిద్దాంతం ఆచరిస్తున్నా చివరికి అద్వైతానికి చేరుకోవాల్సిందే.


ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే. కానీ రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యరూపం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా లేదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువు కుడా అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలు అదే విధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.


మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుణ్ణి, ఇలా ఏ పర్వదినానికి తగ్గట్టు ఆ దేవుడుని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడు, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు.

కామెంట్‌లు లేవు: