31, డిసెంబర్ 2023, ఆదివారం

కోపం, అహంభావంట!😜

 ‘కరెక్ట్‌గా ఏవన్నా ఫంక్షన్ల ముందే వెళ్ళి డిప్ప కటింగ్ చేయించుకొస్తావు. కొంచెవేఁ కట్ చెయ్యమని చెప్పు. లేకపోతే ఫొటోలన్నింట్లోనూ ఆర్మీ రిక్రూట్‌మెంటుకి వచ్చినవాడిలా వుంటావు!’  


తనందని కాదుగానీ ఏవిఁటో నాకెప్పుడూ అలాంటప్పుడే ఖాళీ దొరుకుతుంది హెయిర్‌కట్‌కి.


ఆవేళ ఆదివారం. చాలామంది వచ్చేసుంటారు ఈపాటికే! ఈమధ్యే కొత్తగా పెట్టాడు బ్రాండెడ్ సెలూనొకటి. దర్శనం చేసుకుందామని లోపలికెళ్ళాను. ఓ ఆరుగురు మాసిన గెడ్డాల్తో, ట్రాక్ పేంట్లేసుకుని, సోఫాల్లో కూచుని తెగ చదివేస్తున్నారు పేపర్లన్నీ! 


రిసెప్షన్లో పదిహేడేళ్ళ పిల్ల సూటేసుకుని కూర్చునుంది. పేద్ద బౌండు బుక్కొకటి తీసి అపాయింట్‌మెంట్లవీ చూసి ‘ఎల్లుండి సాయంత్రం వస్తారా?’ అనడిగింది. 


నేను కటింగ్ కోసం వస్తే నాకు కటింగిస్తే ఎలా?? ‘కుదరదమ్మాయ్!’ అంటూ నిలయవిద్వాంసుడి దగ్గరకే బయల్దేరాను.


అక్కడా తమిళ హీరోల్లా గెడ్డాలేసుకుని చాలామందే వున్నారు. కానీ రవణ అదేం కాదన్నట్టే వుంటాడెప్పుడూ! ఒట్టి కబుర్లపోగు. అసలు నేనెప్పుడూ ఈ సెలూనుకే రావడానికి బలమైన కారణమేమిటంటే... బండి పెట్టుకోడానికి కాస్త చోటుంటుందని! 


ఆమాత్రం కటింగ్ ఎవరైనా చేసేస్తారు. అందులోనూ మనకి జుట్టు ఒత్తెక్కువ. సుళువుగా పట్టు చిక్కుతుంది. గుప్పిళ్ళతో పట్టుకుని తనివితీరా కత్తిరిస్తోంటే ఒకరకమైన ప్రొఫెషనల్ సాటిస్ఫేక్షన్ అతని మొహంలో! ఏదో మోహంలో వున్నట్టుంటాడు. 


ఆ తన్మయత్వంలో ఒకటికి బదులు రెండుగుప్పెళ్ళు ఏస్సాడంటే సేతు సినిమాలో విక్రమ్‌లా మారిపోతాను. అలాగని మరీ వదిలేస్తే పదిరోజులకే అపరిచితుడి గెటప్పులోకి దిగిపోతాను.


‘సార్! పదినిమిసాలంతే! రెండే సేవింగులు. కూచోండి. రేయ్! సితారివ్వరా డాట్రగారికీ!’ అంటూ తెగ హడావిడి చేస్సేడు. 


సితార చదివి చాలారోజులైంది.


‘ఆ రెండూ వదిలేస్తేనే పరిశ్రమలో  నిలదొక్కుకోగలం’ అని కింద తమన్నా బొమ్మ వేశాడు. చచ్చేలా మొత్తం చదివాను ఏంటొదిలెయ్యాలా అని...

...............

...............

...............

...............


కోపం, అహంభావంట!😜  


ఆ పుస్తకంతోనే నుదుటిమీద కొట్టుకుని పక్కనబడేశాను. 


‘హోమ్ దియేట్ర్ ఫైవ్ పాయింట్ వన్ తీస్కున్నాం సార్ మొన్నే!’ అన్నాడు పైకి కత్తెర చూపిస్తూ.


పైన నాలుగు మూలలా నా అంత స్పీకర్లు నాలుగున్నాయి. వాటిల్లోంచి కిరకిరలాడే ట్రెబల్‌తో  ‘మౌనమేలనోయీ’ పాటొస్తోంది. 


‘ఓర్నీ! ఈపాట ఇలా వినకూడదురా బాబూ! ఆ రిమోటిలా ఇవ్వు! బేస్ పెంచాలి. వూఫర్ జీరోకి సెట్ చేశారా ఏంటీ?’ అంటూ చెయ్యి చాచాను.


‘నాకవేటీ తెలీవు సార్! ఆ రిమోట్లో బేట్రీల్లేవు!’ అన్నాడు షేవింగ్‌క్రీమ్ రాస్తూ! అలాంటి వార్తని అంత ఉత్సాహంగా ఎలా చెప్తాడు ఎవడైనా? 


పోనీ మాన్యువల్‌గా పాట మారుద్దామంటే బుర్జ్ ఖలీఫ్‌లా పైనెక్కడో వుంది డొక్కు... సారీ... డెక్కు!


ఇక నాకు మొదలైంది హింస. వాడి కళాదృష్టెలా వుందంటే... అన్నీ సూపర్ మెలొడీసే! ఓంనమః, మాటే మంత్రము, కురిసేను విరిజల్లులే... ఇవన్నీ డబ్బాలో జంతికలేసి ఆడించిన సౌండ్‌లో వినాల్సొచ్చింది.


అదుగో ఆక్షణం మధురాతిమధురం! సడన్‌గా కరెంట్ పోయింది. ఒక్కసారిగా మా ఆవిడా, వాళ్ళ డిపార్టుమెంటూ ముద్దొచ్చేశారు. భలే కాపాడేస్తారబ్బా ఒక్కోసారి.


ఎంతసేపురా బాబూ? 


పక్కనెవరో ఇరవయ్యేళ్ళ కుర్రాడు క్షవరానికొచ్చాడు. ఏదో పుస్తకం ఇచ్చి ఏ నెంబరో అడిగాడు రవణ. అది కటింగ్ మోడళ్ళ పుస్తకంట! ఆ కుర్రాడు ‘ఇరవైరెండు’ అన్నాడు. ఆ పుస్తకం తీసుకుని ఇరవైరెండేవిఁటో అని చూశాను. 


గంటస్థంభం దగ్గర అనాసపళ్ళని ఒక డిజైన్లో చెక్కి అందర్నీ ఆకర్షిస్తూ అమ్ముతుంటాడొకడు. అచ్చం అలావుంది ఆ ఇరవైరెండు. వాడి కటింగయ్యేలోపు నాకళ్ళు పోతే బావుణ్ణు. ఆ దరిద్రాలన్నీ చూళ్ళేక ఏడుపొస్తోంది. మొన్నొకణ్ణి చూశాను రోడ్డుమీద. కెటిఎమ్ బండిమీద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా పక్కనే ఆగాడు. మొత్తం గుండు చేయించేసుకుని స్వస్తిక్, సిలువ, ఉర్దూ అక్షరాలూ చెక్కించుకున్నాడు కొత్తెం మీద. వీడెవడో పెక్యులియర్ సెక్యులర్ అనుకున్నాను.


ఈలోగా ముగ్గురు కుర్రాళ్ళు జబర్దస్తీగా లోపలికొచ్చి దువ్వెన్నలతో దువ్వేసుకుని, పౌడర్లవీ రాసేసుకుని, ‘పవన్ కళ్యాణ్‌లా వున్నానా లేదా?’ అని అద్దంలో చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని వెళిపోయారు.


‘క్యూటికురా పౌడ్రు ఫ్రీ అనుకుంటన్నావేటి బే! కొంటే తెలుస్తాది. ప్రతివోడూ వొచ్చీసి తెగరాసేత్తారు పౌడర్లు. వారానికే డబ్బా ఖాళీ సార్ ఈ ఎదవల వల్ల!’ అంటూ ఆవేదనగా పలికాడు రవణ.


పక్క కుర్చీలో నాలుగేళ్ళ పిల్లాడొకడు కూర్చున్నాడు. వాణ్ణి క్షవరానికి తీసుకొచ్చిన వాళ్ళ నాన్న ప్రపంచంతో ప్లగ్ తీసేసుకుని కేండీక్రష్ ఆడుకుంటున్నాడు. ఆ పిల్లాడేమో ప్లగ్గుల్లో వేళ్ళు పెడుతున్నాడు.


వాడి అల్లరి మరీ రాక్షసంగా వుంది. కత్తెర్లు తియ్యద్దని రవణ అప్పటికి నాలుగుసార్లు చెప్పినా అదే తీస్తున్నాడు. పెదాలమీద పెట్టుకుని కటింగ్ చేసుకుంటున్నట్టు ఆడిస్తున్నాడు. గట్టిగా అరిచి కత్తెర లాక్కున్నాడు రవణ. వాళ్ళ నాన్న ఒకసారి తలపైకెత్తి చిరునవ్వు నవ్వి, ‘బంగార్తండ్రి!’ అని కొత్తెం మీద మెల్లిగా కొట్టి, మళ్ళీ తొంభైరెండో లెవెల్‌కి వెళిపోయాడు. 


ఇహ లాభంలేదని వెంకటిని పిలిచి వాడికి డిప్పకొట్టి పంపించెయ్యమన్నాడు. ఆక్షణంనించి వెంకటిగాడికి సంకటం మొదలయింది. 


వాడు కదలకుండా కూచోడు, వాళ్ళనాన్న కూచున్నచోటునించి కదలడు. ఏదో అయిందనిపించి ఇద్దర్నీ బయటకి గెంటేశాడు వెంకటి.


మొత్తానికి అందరి క్షవరాలూ అయ్యి నాదగ్గరకొచ్చాడు రవణ. 


‘సెల్ ఫోన్లయీ జోబీలోంచి తీసీండి సార్! మళ్ళీ కప్పేస్తే తియ్యడం ప్రోబ్లం!’ అన్నాడు స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో భాగంగా!


నేను మరింత ముందు జాగ్రత్తతో గోక్కోవలసిన చోటల్లా అప్పుడే గోకేసుకుని అప్పుడు కప్పమన్నాను. 


‘ఫోర్‌జీ ఫోన్లేనేటి సార్ రెండూనూ?’ అన్నాడు తలంతా పూరీలపిండిలా తడుపుతూ! 


‘ఆ! ఇవాళ్రేపన్నీ ఫోర్‌జీ ఫోన్లేకదా! నీకూ వుందిగా?’ అన్నా.


‘ఆ! మొన్నే కొన్నాన్సార్. అత్తమ్మ డబ్బులిచ్చింది ఫోను కొనుక్కోమని. జియో సిమ్మేసాను అందులో. హేపీగుంది సార్!’ వాడి స్వల్ప ఆనందాలకి ఆలంబనగా నిలిచిన అంబానీని పొగడ్డం మొదలెట్టాడు.


‘సినిమాలేం బావున్నాయి రవణా?’ అన్నాను టాపిక్ డైవర్ట్‌ చేద్దావఁని.


‘న్యూపూర్ణా చూడండ్సార్! బావుంది. ఫేమిలీ సినిమా. ఫైట్లు గట్రా లేవు!’ అని ముగించాడు.


ఇప్పుడా న్యూపూర్ణాలో ఏంసినిమా ఆడుతోందో తెలుసుకోవాలి. వీడెప్పుడూ ఇంతే! థియేటర్ల పేర్లే చెప్తాడు. 


ఉత్సాహంగా కట్ చేసేస్తోంటే ఉద్రేకంతో కిందడిపోతోంది జుట్టంతా. సడన్‌గా మొత్తం జుట్టు నుదుటిమీదకి దువ్వేసి, కట్ చేసేసి నన్ను మాస్టర్ రాములా తయారుచేసేసాడు.


‘మరీ వెర్రివెధవలా వున్నట్టున్నానూ?’ అని మనసులో అనుకుంటూండగానే


‘సార్! గోద్రెజ్జా? హెన్నానా?’ అన్నాడు క్లాత్ మారుస్తూ! కాటికాపరి గొంగళిలాంటి నల్లదుప్పటి ఒకటి తీశాడు బయటికి. 


‘ఏదోవొకటి. కానీ పదిహేన్రోజులకే అసలురంగు బయటపడిపోతోందీ మధ్య! మనస్ఫూర్తిగా వెయ్యట్లేదు నువ్వు!’ అన్నాను గోముగా.


‘సార్!’ అంటూ రెండడుగులు వెనక్కెళిపోయాడు. హడిలిపోయాను ఏమయ్యిందా అని! 


‘ఊళ్ళో ఇద్దరవేఁ టాపు సార్! అలాటిది నన్నేటి సార్ అలాగనీసేరు?’ ఆశ్చర్యంలో ఏంచేసేస్తాడో వెధవఖర్మ! వాడిష్టానికే వదిలేద్దాం అని డిసైడైపోయాను.


ఆపరేషన్ కి ముందు సర్జన్‌తోను, కటింగుకి ముందు బార్బర్‌తోను గొడవపెట్టుకోకూడదు😜


తలమీద నిమ్మకాయ రాసి మృదంగం వాయించడం మొదలెట్టాడు. చెవుల వెనకనించి బొటనవేళ్ళతో బలంగా లాగుతోంటే నిద్దరొచ్చేస్తోంది. 


నేనారోజు డ్యూటీలో వున్నాను. మత్తివ్వాల్సింది పోయి మత్తులోకెళిపోయాను.


‘రవణా! ఏడీ మీ ఓనరూ?’ అన్న అరుపుకి మెలకువొచ్చింది. బయట టీవీఎస్ ఫిఫ్టీ మీంచే అడిగాడు ఫైనాన్స్ బుజ్జి. అందరికీ అప్పులిచ్చి రోజూ కలెక్షన్ కోసం షాపులంట తిరుగుతాడు. 


‘ఆదివారం కద్సార్! ఆళ్ళింటికెళ్ళాడు! సాయంత్రం వచ్చేత్తాడు!’ అన్నాడు నన్నొదిలేసి బయటికెళిపోయి. 


‘ఊరంతా అప్పులెట్టీసి రెండేసి ఫేమిలీలెందుకు మీవోడికి? ఎప్పుడడుగు.. షాపులో లేడు, రాడు! మరేదగా తెచ్చిచ్చీమను. రేపుగ్గాని ఇవ్వకపోతే జవానొస్తాడు. ఆతరవాత ఆడిష్టం!’ అంటూ కొంత పాండిత్యం కూడా ప్రదర్శించాడు.


దాంతో వీడిక్కోపమొచ్చేసింది. మాటామాటా పెరిగింది. లోపలికొచ్చి ఫిలిప్స్ షేవరొకటి పట్టుకుపోయాడు. 


తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్నాడు రవణ. 

ఆ కోపం అంతా నామీద చూపించాడు. 


ఏంచేస్తున్నాడో నాక్కనబడలేదు. అంతా అయిపోయి బయటికొచ్చేటప్పటికి సేతులాగా లేను, అపరిచితుళ్ళాగా లేను....


చెల్లెలికాపురంలో శోభన్‌బాబులా వున్నాను! 


వాడు నాకంత ‘డై హార్డ్’ ఫ్యానని తెలీదు!😜 


               


............జగదీశ్ కొచ్చెర్లకోట

కామెంట్‌లు లేవు: