31, డిసెంబర్ 2023, ఆదివారం

రాజర్షి -బ్రహ్మర్షి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*రాజర్షి -బ్రహ్మర్షి*

హిందూ ధర్మచక్రం.

లోక ప్రసిద్ధుడయిన విశ్వామిత్రుడు 

ఒకసారి వశిష్టుడి గృహానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు తన ఇంటికి రావడం చూసి వశిష్టుడు “రాజర్షీ....రండి.... రండి 

మీకిదే నా స్వాగతం" అంటూ లోనికి ఆహ్వానించాడు.  


వశిష్టుడు తనను "బ్రహ్మర్షీ" అనకుండా “రాజర్షి" అని సంబోధించినందుకు విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే "నీ పెద్దకుమారుడు మరణించుగాక" అంటూ శపించి తపస్పుకై తిరిగి అడవులకు వెళ్ళిపోయాడు. వశిష్టుడి నూరుగురు కొడుకులలో పెద్దవాడు ప్రాణాలు విడిచాడు.


కొంతకాలానికి మళ్ళీ విశ్వామిత్రుడు వశిష్టుని ఇంటికి వచ్చాడు. “రాజర్షి .... రండి...." అంటూ వశిష్టుడు విశ్వా మిత్రుడిని ఆహ్వానించాడు. ఆ మాట విన్న విశ్వామిత్రుడు కోపంతో...  


"ఓయీ, నీ అహంకారం ఇంకా అణగ లేదా! నీ రెండో కుమారుడు కూడా మరిణించుగాక!" అంటూ శపించి వెను తిరిగి వెళ్ళిపోయాడు.


ఆ విధంగా వశిష్టుడి కుమారులలో తొంభై తొమ్మండుగురు విశ్వామిత్రుని కోపానికి గురై చనిపోయారు.


తరువాత నూరవసారి వెళ్ళినా విశ్వామిత్రుడిని “రాజర్షీ..” అనే సంభోధిస్తూ వశిష్టుడు అతడికి స్వాగతమిచ్చాడు. ఈసారి విశ్వామిత్రుడికి వశిష్టుడి పై జాలి కలిగింది. అతడు తననెలా సంబోధించినా అతడి ఆఖరి కొడుకును కాపాడాలి అనుకొని, తన కోపాన్నంతా బలవంతంగా దిగమింగుకొంటూ వెనుతిరిగాడు.


అంతలోనే "బ్రహ్మర్షీ" అన్న పిలుపు మెల్లగా వినిపించింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో వెనుతిరిగి చూశాడు. విశ్వామిత్రుడు వశిష్టుడిని సమీపించి "నువ్వు ముందే నన్ను బ్రహ్మర్షి అని పిలిచి వుంటే నీ తొంభయి తొమ్మండుగురు కొడుకులూ నీకు దక్కేవారు కదా? ఎప్పుడూ లేనిది ఇవాళ నాలో ఏ గొప్పతనం వుందని అలా పిలిచావు" అని ప్రశ్నించాడు. 


"అయ్యా! తమను పరీక్షించడానికే ఇన్నాళ్లు రాజర్షి అని పిలిచాను. నూరవసారి మాత్రమే మీరు మానవ సహజమైన కోపాన్ని దిగమింగుకొని దైవత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మీలోని శాంతమే నాచేత బ్రహ్మర్షీ అని పిలిపించింది" అని జవాబిచ్చాడు వశిష్టుడు.


వశిష్టుడి మాటలకు విశ్వామిత్రుడు సిగ్గు పడ్డాడు. తన తప్పిదాన్ని తెలుసుకున్నా డు. తన తపశక్తిచే వశిష్టుడి కొడుకులం దరిని తిరిగి బ్రతికించాడు.

మనిషి సర్వోన్నత స్థితిని పొందాలి అంటే దేహంలోని వికారాలను విడిచి పెట్టాలి. అప్పుడే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు.

.✍️ హిందూ ధర్మచక్రం.

🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩


 *సేకరణ:- సీమనపల్లి బదరీనారాయణ.* 

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: