*పరోపకారం*
భగవంతనికి ఇన్ని అవతార స్వీకారాలు ఎందుకు చేస్తాడన్నది ప్రశ్న. ఆయనకేమి అవసరం..?అంటే.. ధర్మ స్థాపన మరియు పరోపకారం కోసమే భగవంతుడు అవతారాలు స్వీకరిం చాడు. తాను స్వీకరించిన అన్ని అవతారాలలో దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించాడు. ఇదంతా దేనికి అంటే? లోకానుగ్రహం కోసమే. భగవంతునికి వేరే ఏమీ సాధించవలసిన అవసరంలేదు. భగవంతుడే పరోపకారానికి ఇంత ప్రాధాన్యతనిస్తే మనమెంత ప్రాధాన్యమివ్వాలి? మన పూర్వీకులు దీనిగురించి ఉదాహరణగా చిన్న శ్లోకంలో చెప్పారు.
*परोपकृतिकैवल्ये तोलयित्वा जनार्दनः* |
*गुर्वीं उपकृतिं मत्वा अवतरान् दश अग्रहीत्* ||
పరోపకారం చేయటం ఉత్తమమా? లేక ఊరికే ఉండటం ఉత్తమమా? అని తులనాత్మకంగా పరిశీలించి భగవంతుడు పరోపకారమే ఉత్తమమని భావించి అవతారాలు స్వీకరించాడు. అలా భగవంతుడే పరోపకారానికి ప్రాముఖ్యత నిచ్చాడు. పరోపకారం పరమోత్తమం, పరపీడనం నికృష్ణం. రాక్షసులు పరపీడనంలో గడిపేవారు. అందువలననే వారిని భగవంతుడు సంహరించాడు.
మానవులు రాక్షసుల గుణగణాలను అలవరచకోకూడదు. ఇతరులకు ఎప్పుడూ సహాయపడే లక్షణం కలిగియుండాలి. మనకు వీలైనంత సహాయం చేయాలే తప్ప పరులకు అపకారం తలపెట్టకూడదు. అట్టి పరోపకార స్వభావం ఏర్పడితే మన జీవితం ధర్మబద్దంగా ఉంటుంది. మనం ధర్మానుయాయులం అవుతాం.
జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు కూడ అధర్మాన్ని నాశనంచేసి ధర్మాన్ని రక్షించి లోకోపకారం చేయటానికే అవతరించారు. అందువలన మన పూర్వ జన్మ పుణ్యంగా లభించిన మానవజన్మ సార్ధకతకై ధర్మాచరణ చేద్దాం. ధర్మాచరణ అంటే విచక్షణతో కూడిన పరోపకారమే. ప్రతియొక్కరూ ఈవిషయాన్ని గ్రహించి తమ జీవితాలను పవిత్రవంతం చేసుకోవాలి.
|| हर नमः पार्वती पतये हरहर महादेव ||
--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి