30, డిసెంబర్ 2024, సోమవారం

బామ్డ మూల్యం న యాచితే

 

బాండ   మూల్యం న యాచితే  

పూర్వం కౌసల్య రాజ్యంలో వింద్యానగరి అనే పట్టణంలో ఆదిత్య శర్మ అనే పండితోత్తముడు వుండే వాడు. యెర్రని వడలుతో చక్కగా  నుదుట భస్మం దిద్దుకొని పట్టు పీతాంబరాలను ధరించి పుర వీధులలో తిరుగాడుతుంటే సాక్షాత్తు మన్మధుడే భువిపైకే దిగి వచ్చాడా అనిపించే విధంగా ఆతని రూప లావణ్యం ఉండేది. . ఆబాల గోపాలం అతనిని పరికించి చేసేవారు. నారిహృదయ చోరుడు అనదగును అతని సౌందర్యం,. చూసేవారు చూపులను ప్రక్కకు తిప్పుకొనజాలరు అది అతని సుందరరూపం.  చక్కటి భాషతో చలోక్తులను జోడించి పండితులతో ముచ్చటిస్తుంటే సురగురువు బృహస్పతి ఎదుట వున్నాడా అని అనిపించే వాడు. ఆదిత్య శర్మ సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన ద్రష్టుడు. సంస్కృతం అతనికి వెన్నతోపెట్టిన విద్య చక్కగా ఆశువుగా కవిత్వం చెప్పగల దిట్ట పండితులు ఇచ్చే సమస్యలను అతి సునాయాసంగా తన కవిత్వంతో మంత్రముగ్దుల్ని చేసే వాడు. ఆయన కవిత్వం వింటూవుంటే ప్రతి శ్లోకం కాళిదాసు కుమార సంభవం లోదా అనిపించేది  ఇక నీతి శాస్త్రానికి సంబందించిన కవిత్వాలు  భతృహరి సుభాషిత శ్లోకాలను తలపించేవి.  నగరంలో ఎక్కడ పండితగోష్ఠి జరిగిన ఆదిత్య శర్మ వుండవలసిందే. శర్మ లేని సభ ఏదో వెలితిగా ఉన్నట్లు తోచేది. పుర ప్రముఖులు అందరు ఆదిత్య శర్మ ఔచిత్యాన్ని, సమయస్ఫూర్తిని, కవిత్వ పాఠవాన్ని, సౌశీల్యతను వేనోళ్ళ పొగిడేవారు. నగర స్త్రీజనులు సహితము వారికి ఏ సందేహాలు వచ్చిన నిస్సంకోచంగా ఆదిత్య శర్మ వద్దకు వచ్చి నివృతి చేసుకొనే వారు పరస్త్రీలకు తోబుట్టువులా ఒప్పాడేవాడు. పట్టణంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తనదిగా భావించి వారి చెంతకు వెళ్లి దాని పరిష్కారాన్ని తన బుద్ధికుశలతతో తెలిపేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వింద్యానగరిలో ఆదిత్య శర్మ లేకుండా ఏ ఒక్కరికి ఒక్క రోజు గడచేది కాదు,

ఒకరోజు ఆదిత్య శర్మ పట్టణ వీధులలో నడచి వెళ్లుచుండగా సాలంకార శోభితమైన ఒక పల్లకి ఎదురు పడ్డది పల్లకిలో ఎవరో ప్రముఖులు వెళుతున్నారని ఆదిత్య శర్మ తలంచినాడు,  ఇంతలో పల్లకిలో వ్యక్తి ఆదిత్య శర్మ అని పిలిచాడు. అప్పుడు వెనుతికకు తిరిగి చూడ తన గురుదేవులు విద్యాధరులు. వెంటనే ఆగి గురువుగారికి పాదాభివందనం చేసి తన గృహముకు అరుదెంచామని సాదరంగా ఆహ్వానించాడు ఆదిత్య శర్మ. బహుకాలం తరువాత కలిసిన శిష్యుని కుశలప్రశ్నలు వేసి కౌగిలించుకొన్నారు గురువుగారు..శిష్యుని అభ్యర్థన మేరకు గురువుగారు ఆదిత్య శర్మ గృహంకు వచ్చారు. గురువు గారికి అర్గ్య పాద్యాదులను ఇచ్చి సాదరంగా గృహంలోకి ఆహ్వానించాడు ఆదిత్య శర్మ. . గురువు గారు స్నానసంధ్యాదులను పూర్తిచేసుకొనుచుండగా ఆదిత్య శర్మ తన భార్య సుగుణవతితో గురువుగారికి ఇష్టా  భోజనము సమకూర్చవలసిందిగా చెప్పాడు. ఆదిత్య శర్మ గృహిణి సుగుణవతి పేరుకు తగ్గట్టుగానే సుగుణాల రాసి తన పుట్టింటివారికి. ఆదిత్య శర్మ మీద ఎప్పుడు కస్సు బుస్సులాడటంలో ఆమె సిద్దహస్తురాలు. గురువుగారి ముందు తన పరువు పోకుండా వుండాలని ఆదిత్య శర్మ భార్యను బ్రతిమిలాడుకొనగా దయతో సుగుణవతి  ఒక ఒప్పందానికి వచ్చింది.  అదేమిటంటే తాను గురువు గారిముందు గొప్పలు పోవటానికి ఆమెను తిట్టినా ఆమె నోరు మెదపకుండా వుండాలని.  కాగా సుగుణవతి ఒక షరతు పెట్టింది అదేమిటంటే కేవలం ఒక నూరు తిట్లవరకే సహిస్తానని తరువాత సహించనని ఆమె పేర్కొన్నది. బ్రతుకు జీవుడా అని ఆమె షరతుకు ఆదిత్య శర్మ వప్పుకున్నాడు. గురువుగారు సంధ్యావందనం ముగించిన పిదప ఇరువురు  కొంత తడువు ఇష్టాగోష్టి జరిపారు. శిష్యుని కవితా నైపుణ్యం, శాస్త్ర విచారాలను పరికించిన గురువుగారు అనేక విధముల ప్రశంసలను చేశారు. తన గురువుగారు చేసే ప్రశంసలకు ఆదిత్య శర్మకు ఐరావతం ఎక్కినంత  ఆనందమైనది. పాపం ఆ అభాగ్యునికి ముందు జరగపోయే విపత్తు తెలియదు. అదే కదా దైవలీల అన. . భగవంతుడు ఒకక్షణం ఆనందాన్ని చవిచూపిస్తాడు మరుక్షణం విచారాన్ని విరజిమ్ముతాడు. రెండిటి సిద్దపడి చెలించని వాడే స్థితప్రజ్ఞుడని కదా శ్రీ కృష్ణ భగవానులవారు భగవత్ గీతలో నుడివారు. గురుశిషులు ప్రియసంభాషణలు ఆడుతూ చక్కగా నవ్వుతు ఉండగా తలుపు ప్రక్కనుంచి ఆదిత్య శర్మ శ్రీమతి సుగుణవతి ఏమండీ భోజనం సిద్ధం అని అన్నది. వెంటనే శర్మ గురువుగారు రండి అని వంట గదిలోకి ఆహ్వానించాడు. 

ఇరువురు వంటగదిలోకి ప్రేవేశించగానే రెండు అరిటి ఆకులలో చక్కగా షడ్రుచులతో అలరారే నవకాయ పిండివంటలతో భోజనం వడ్డించి వున్నది. ఎదురుగా విశాలమైన పీటలు వేసి వున్నాయి. గురువుగారికి ఒక పీట్ చూపించి తానూ ఒక పీటమీద కూర్చున్నాడు. తన భార్య ఇచ్చిన భరోసాతో మన కధానాయకుడు ఆదిత్య శర్మ భార్య మీద పెట్రేగి పోవటం మొదలు పెట్టాడు. సహజంగా పురుషులకు ఇంటికి వచ్చిన అతిధులముందు భార్యమీద పెత్తనం చూపాలనే భావన ఉండటం సహజం. ఆదిత్య శర్మ ఎంతటి పండితోత్తముడైన ఈ విషయంలో మాత్రం మినహాయింపు లేదు. అందునా ముందే భార్యతో వప్పందం చేసుకున్నాడాయే.  ఏమిటే ఈ పప్పు ఇందులో ఉప్పు అస్సలు లేనే లేదు అని మొదలు పెట్టాడు. అదేమిటి శర్మ పప్పు రుచికరంగా వున్నదిగా అని గురువు గారు అన్నారు లేదు గురువుగారు దీనికి అట్లా చెపితేనే కానీ వంట సరిగా చేస్తుంది అని ధీమాగా అన్నాడు. పులిహోరలో జీడిపప్పు వేయమన్నాను పల్లీలు వేసావేమిటి అని, అయిన దానికి కానిదానికీ ఇల్లాలిని విసుక్కోవటం చేస్తున్నాడు. ఒక దశలో భోజనం చేస్తున్న గురువుగారికి శిష్యుని ప్రవర్తన జుగుప్సాకరంగా తోచినది . ఏదైనా శృతి మించి రాగాన పడకూడదు అంటారు పెద్దలు. ముఖ్యంగా ఇల్లలుతో ప్రవర్తించే విషయంలో వళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చాలామంది భర్తలు ఈ నగ్న సత్యం తెలియక జీవితంలో శృంగభంగాలకు లోనవడం కద్దు.   

ఈ విషయంలో శతకకారుడు ఏమన్నాడో ఒకసారి పరికిద్దాం.

కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

భర్త ఎంతటి యోగ్యుడైనను భార్యను అకారణంగా తప్పు పట్టరాదు అని కదా అర్ధం. 

విద్యావంతుడు, గుణవంతుడు, సౌశీల్యుడు అయిన మన ఆదిత్య శర్మను  కూడా అహంభావం, గర్వము మత్తు పొరలులాగా కమ్మేసినాయి. ఆ విషయం గుర్తించలేక పోయాడు మన శర్మ. భోజనం పూర్తికావస్తుండగా పెరుగు వేసి చావు అని భార్యతో విసురుగా అన్నాడు. వెంటనే సుగుణవతి పెరుగు బాండాని తీసుకొచ్చి అతని నెత్తిమీద గట్టిగ కొట్టింది దానితో భాండము (మట్టి పాత్ర) ముక్కలై పెరుగు మొత్తం అతని శిరస్సు మీద చెల్లా చెదురుగా పడ్డది . అది చూసిన గురువు గారు ఉత్తరావపోశన కూడా పట్టకుండా లేచి దొడ్లోకీ వెళ్లారు. ఇందాకనే అయ్యాయి వంద నీ బొంద ఈ భణ్డాఖరీదు వంద రూపాయలు ఇయ్యి అని సుగుణవతి భర్తతో గట్టిగ అన్నది.  దొడ్లో చేతులు కడుకుంటున్న గురువుగారికి ఆ మాటలు స్పష్టంగా వినపడ్డాయి. అప్పుడు గురువుగారికి భార్యాభర్తల మధ్య వున్న విషయం పూర్తిగా అవగతమైనది. . 

గురు శిష్యులు ఇద్దరు వరండాలో బల్లమీద కూర్చున్నారు. శర్మ గురువుగారికి ముఖం చూపించలేక  పోయాడు. అప్పుడు గురువుగారు నాయనా ఎందుకు విచారిస్తావు ఇది అందరి ఇండ్లలో ఉండేదే మీ గురుపత్ని నాకు ఇటువంటి సన్మానాలు అనేక పర్యాయాలు చేసింది చూడు అని తన తలమీద వున్న  పాగా తీసి శిరస్సు చూపించాడు. అక్కడ అనేక బొడిపెలు వున్నాయి.  గురువుగారు వెంటనే అన్నారు . కాక పొతే మీ గురుపత్ని  వెంటనే బాండ మూల్యం మాత్రం నీ భార్య లాగ అడగదు. ఆ రకంగా నేను కొంత మెరుగుగా వున్నానని గురువుగారు ఆదిత్య శర్మతో అన్నారు. అప్పటి నుంచి ' భండ మూల్యం నా యాచతే" అనే నానుడి వచ్చిందని ప్రాజ్ఞులు చెపుతారు. కొన్ని అనుభవాలు మనకు గుణ పాటలు చెపుతాయి.


కామెంట్‌లు లేవు: