28, ఆగస్టు 2020, శుక్రవారం

తేనెటీగ కూడాగురువే

దత్తాత్రేయుడనే అవధూత తేనెటీగనే తన గురువుగా  ఎన్నుకున్నాడు. ఆ విషయాన్ని యదు మహారాజు వద్ద  వివరించసాగాడు. " యదు మహారాజా! .. ఒక వనం నన్ను పిలుస్తున్నట్టు
భావించాను.   అప్రయత్నంగా ఒక అపూర్వశక్తి  ప్రేరణతో  ఒక్కొక్క చోటుకు రాగలిగాను.
విరులతో అలరారుతున్న
ఉద్యానవనాన్ని చూసి
పరవశించి పోయాను.
సంధ్యా సమయం ,  విరిసిన పుష్పాలు మెల్లిగా
ముడుచుకున్నాయి.  అప్పుడు నా దృష్టి ఒక తేనెటీగ మీద పడింది.
నా ధ్యానానికి లక్ష్యంగా
 నా దృష్టిని ఆ తేనెటీగ మీదే కేంద్రీకృతమయింది. 
తేనెటీగ తప్ప మరేది నా దృష్టికి మరేదీ కనపడలేదు. తేనెటీగ ఎగిరే మార్గంలో పరిభ్రమిస్తూ అడ్డదిడ్డంగా
పరిగెట్టాను. రేకులు ముడుచుకోని పుష్పం దగ్గరకు వెళ్ళింది. ముక్కు తో వాసన చూసింది. కన్నులు మూసుకుని తేనెను గ్రోలింది.  కొద్ది  క్షణాలలోనే తేనెటీగ మైకంలో పడింది. పుష్ప రేకులు మెల్లగా తేనెటీగను  తమ రెక్కలలో మూసి వేశాయి.  తేనెటీగ కొంచెం సేపు  బయటికి రావడానికి పోరాడింది.
పుష్పం అటూ ఇటూ వూగింది.  నేను అక్కడ ఒక సాక్షి గా మాత్రమే నిలబడ్డాను. నాలో చూడు అన్న ఆనతి భావం తప్ప మరే భావం కలుగ లేదు. అక్కడే కూర్చుండి పోయాను.
నేత్రాలు మూసుకున్నాను.
తేనెటీగ, పుష్పం  నాలో
పెద్ద ప్రశ్నలు కలుగ చేశాయి.

ఎందుకు తేనెటీగ తనుగా వెళ్ళి చిక్కుకుంది. అందులో ఎలాంటి సుఖం పొందింది?   ఇలా నాలో వంద ప్రశ్నలు తేనెటీగల్లా ముసిరి
కల్లోల పెట్టాయి.  కార్యా కారణాలు లోక సహజం అని తెలిసినా , నిత్యం
తన  ప్రాణలు కోల్పోయే
తేనెటీగను చూసి వ్యధ చెందడం లో అర్ధం తెలీక కలవరపడ్డాను.  హఠాత్తుగా నా బుధ్ధికి మెరుపులా ఒక విషయం తట్టింది.  తేనెటీగకు  తన
ముక్కుని , నాలికను 
అణచుకోవడం తెలియలేదు. తేనె వాసనకి,  దాని రుచికి బానిస అయిపోయింది.  తేనె  గ్రోలి గ్రోలి తేనె పట్టులో దాస్తుంది.  ఆ తేనె పట్టును కొట్టి ఎవరో ఆ తేనెను పట్టుకుపోతారని కూడా దానికి తెలియదు.
ఈ విషయంలో  మనిషి, తేనెటీగ ఒకటే అన్న జ్ఞానం  బోధపడినది.

ఎంతవరకు అవసరమో అనే విషయాన్ని అర్ధం చేసుకోకుండా మనిషి యంత్రంలా సంపాదిస్తూ పోతున్నాడు. తను ఆర్జన తాను సక్రమంగా అనుభవించకుండా  సంపాదించడంలోనే కాలం  గడుపుతున్నాడు. తను జన్మించినది అందుకేనా.  తేనె పట్టు కదిలిపోయినట్టు అంతిమకాలంలో మరణం తనని తీసుకుని పోతుందనే సంగతి  కూడా గుర్తించకుండానే జీవితం
ముగిసిపోతుంది.  ఎందుకు పుట్టామనే చిన్న ప్రశ్న వేసుకోకముందే
మనిషి మరణిస్తున్నాడు.
మరణం అంటే ఏమిటి ? అని తెలుసుకోవాలనే కాంక్ష కూడా లేదు.
ఆ జనన మరణాల నుండి ఎలా విముక్తి పొందాలనే
విషయాలను తెలుసుకునే ఆసక్తి అసలే లేదు.  వివేకంగా ఆలోచించి
ముక్తి మార్గం అన్వేషించకుండానే తేనెటీగలా బ్రతుకును
అంతం చేసుకుంటున్నాడు.

తేనెటీగ ఆశ్చర్యకరం.
నేను దాని దగ్గర నేర్చుకొన్న మంచి విషయం నీకు చెప్తాను.

తేనెటీగ
పుష్పాన్నుండి తేనెను గ్రోలినప్పుడు, పుష్పానికి
కొంచెం కూడా కష్టాన్ని కలగనివ్వదు. ఆ విషయంలో ఒక యోగి లా వుంటుంది. ఎంత ఆహారం  యీ దేహానికి ఆవసరమో అంతే ఆహారాన్ని యోగి తీసుకుంటాడు.  ఆవిధంగా తేనెటీగ పుష్పం నుండి తేనె మాత్రమె తీసుకుంటుంది.
తను జీవించడానికి ఎంత అవసరమో అంతే  తీసుకుంటుంది.  అదే విధంగా యోగులు మునులు, ఆధ్యాత్మిక సాధకులు అన్ని శాస్త్రాలు నేర్చుకొనినా , అందులోని సారాంశం మాత్రమే తీసుకొని మిగతావి వదలివేస్తారు.

శాస్త్రాలలో చెప్పిన విషయాలనన్నిటిని
ఆచరించలేము.  ఒక్కొక్కరికి  ఒక్కొక్కటి ప్రత్యేకం అన్నట్టుగా వుంటాయి.
శాస్త్రం యొక్క మూల సారాంశాన్ని మాత్రమే
యోగి గ్రహిస్తున్నాడు.
గ్రహించిన విషయాలను
ఆచరిస్తూ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాడు.
అదే విధంగా ముక్తి పొందడానికి  ఏం చెయ్యాలో తెలుసుకుని
మహాత్ము‌లు, శాస్త్రాలు
ఏం చెప్తున్నాయోఅర్ధం చేసుకొని  అవి మాత్రమే
ఆచరించాలి.
ఈ శాస్త్రం గొప్పదా..ఈయన సిధ్ధ పురుషుడా..లేక ఆయన
మహా పురుషుడా ,లేక ఆయన కంటె ఈయన గొప్పా.. యీ రకమైన అనవసర పరిశోధనలన్ని మనసుని కలవర పరుస్తాయి.
జ్ఞానాన్ని పొందాలి, భగవంతుని దర్శించాలి
అనే జ్ఞాన మార్గంలో సాగిపోవాలే తప్ప సగంలో   మార్గాన్ని మార్చుకుంటే అహంభావమనే చిక్కులో పడతాము.

మనమంతా మాయ అనే సంసారపు గోతిలో పడ్డాము.  మొదట అందులోనుండి బయటికి రావడానికి ప్రయత్నించాలి.
కేవలం శాస్త్ర పరిజ్ఞానాన్ని మాత్రమే కలిగి వుండడం వలన
ప్రయోజనం లేదు.
శాస్త్రం తెలుసుకోవడంలోనే మునిగి తేలుతూ అది ఆచరించలేనివాడు
పువ్వులో చిక్కిన తేనెటీగ వలె   బంధాలలో
చిక్కుకుంటున్నాడు.

బయట ప్రపంచానికి ఆయన మహాపురుషునిగా గోచరించ వచ్చును.
కానీ తన వరకూ దేన్ని తెలుసుకోవాలో  అది తెలుసుకోకుండా కల్లోలావస్తలోనే వుంటాడు.
అర్ధంలేని సిధ్ధాంతాలతో,వాటిగురించి ఇతరులతో వాదనలు చేయడంలోనే జీవితం వ్యర్ధం
చేసుకుంటాడు.

తేనెటీగ వలె  తేనె సేకరించుకొని ఎగిరి పోవాలి.
*********************

కామెంట్‌లు లేవు: