28, ఆగస్టు 2020, శుక్రవారం

శ్రీకామాక్షి దర్శన

శ్రీకాంచీ కామకోటి పీఠమందు పందొమ్మిదవయాచార్యులయిన వారు శ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర స్వాములవారు. వారిని సేవించి శ్రీకామాక్షి దర్శన భాగ్యము పొంది పుట్టు మూగతనము వాసి ఆ అమ్మమీద ఐదువందలశ్లోకములను మూకపంచశతి యను పేర రచించినారు శ్రీమూకకవియను ప్రసిద్ధిపొందిన మహానుభావులు. వీరు 399-489 సంవత్సరాల వరకు ఆచార్యులుగ ఆ పీఠ మధిష్ఠంచిరని వినికిడి.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా పట్టిసమువద్ద తాళ్ళపూడిజన్మస్థానమైన శ్రీకల్లూరి వేంకట సుబ్రహ్మణ్యదీక్షితులవారు ఆంధ్రీకరించిరి. 1908 లో వీరు జన్మించిరి.

*శ్రీ మహాగణాధిపతయే నమః*
*శ్రీమహాసరస్వత్యై నమః*
*శ్రీగురుభ్యో నమః*
*పాదారవిందశతకం*
*మొదటి శ్లోకము*
మాచిరాజు వేంకటరమణరావు
మాచిరాజు జయేంద్ర భరద్వాజ
9491898091
*మహిమ్నః పన్థానం మదనపరిపంథిప్రణనయిని*
*ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానో౭పి కతమః,*
*తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కో౭పి మనసో*
*విపాకస్త్వత్పాదస్తుతివిధిషు జల్పాకయతి మామ్.*

*స్మరహరుభామ! నీదుమహిమన్ సరవిన్ సరిగా గణించి యే*
*ర్పరుపగ నెంతమేటి యొకపాటియ యెంతటియత్నమున్న నీ*
*శ్వరి! ఎగయించె గాంచిపురసౌధవిహారవిశారదా! మనః*
*పరమవిపాకమేదొ నను ద్వచ్చరణస్తుతిజల్పనమ్ములన్.*

ఓ కాంచీవిహారరసికా! నీమహిమమార్గమిట్టిదని నిర్ణయించుటకు ఎంతవాడును సరికాజాలడు. ఐననూ నా మనఃపరిపాకమేమోగాని నీ పాదములను కొనియాడుటలో నన్ను వాచాలుని జేయుచున్నది.
******************

కామెంట్‌లు లేవు: