2, ఏప్రిల్ 2021, శుక్రవారం

ఒజ్జకజ్జికాయ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*నాకు నచ్చిన శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.*

              🌷🌷🌷

          *ఒజ్జకజ్జికాయ* 


    *విశ్వనాథవారి ప్రతిభ!* 

                🌷🌷🌷

నేను వారింటిలోనే దిగబడియుండగా నాకన్న సుమారు పదేండ్లు పెద్దవాడు గానుగపాటి వారబ్బాయి హరనాథ్ నాకు సహాధ్యాయిగా విశ్వనాథ వారింటికి వచ్చెడివాడు.  గురువుగారు కొద్దిసేపు భాష, వ్యాకరణము, ఛందస్సు తెలుగుపద్యములోని ప్రాణభూతములైన రహస్యములను ప్రస్తావించి ఒకటి రెండు పూర్వకవి ప్రయోగము లిచ్చి పద్యము వ్రాసి చూపించుమని తనపని తాను చూచుకొనెడివారు.  నాసహాధ్యాయి అప్పటికే నోటిచొరవ గలవాడు.(ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు) నిర్భయముగా పెద్దలతోనైన చనువుగా మాటలాడుట ఆయన స్వభావము.

ఒకనాడు 'పాతప్రయోగాలు కాపీ కొట్టటం ఎందుకండీ' అని

సూటిగా నడిగెను.  అప్పుడు గురువు ఒక మహా రహస్యమును సోదాహరణముగా చాలసేపిట్లు చెప్పిరి.

-మంచిప్రశ్నఅడిగావు.  బడుల్లో పిల్లలచేత చూచివ్రాత ఎందుకువ్రాయిస్తున్నారు?దస్తూరి గుండ్రంగా కుదరటానికి, మాటల మధ్య దూరాలు, తేడాలు, కొన్ని అరుదైనవి చిన్నతనంలోనే దృఢపడాలి.  కొన్ని అక్షరాల ఒత్తులు, పొట్టలో చుక్కలు, దంత్యాక్షరలేఖనం, గుర్తింపు, ఉచ్చారణ స్పష్టంగా తెలియటానికి పలికిస్తూ రాయిస్తారు. దానికి 'కాపీ' అనేదిదిక్కుమాలినపేరు. వాళ్ళు మన నెత్తిన రుద్దారు. 'ఒౙ్జబంతి' దాని అసలు పేరు. ఒౙ్జ అంటే ఉపాధ్యాయుడు. ఆయన గుండ్రంగా రాసిచ్చినదాన్ని అలాగే పిల్లలు నోటితో పలుకుతూ రాయాలి. అప్పుడు త్రికరణశుద్ధిగా జ్ఞానం, ఉచ్చారణ, రాత సరిఅవుతాయి. 'అక్షరజ్ఞాన మెరుగదో ఆంధ్రజాతి, నేర్చుకొన్నది పూర్ణిమానిశలయందు 'ఇదంతా దాంట్లో చెప్పాను. తెలుగుబాససొగసు, ప్రాణం కళ్ళతో చదవటంలో పావలా వంతు ఉంటే నోటితో పలకటం, చెవులతో వినటంలో ముప్పావలా వంతుంది.  తెలుగు నవరసాలను ధ్వనితో, కాకువుతో పుట్టిస్తుంది. అందుకే మీకు ఈపని. పూర్వమహాకవులు మనకు ఒౙ్జలు.  కాలాన్నిబట్టి భాషాస్వరూపం కొంతమారినా భాషాస్వభావం తెగిపోకుండా ఉండాలంటే పూర్వకవుల రచనలను గొంతెత్తి ఆలపించాలి.

   ఇట్లింకను చెప్పిరిగాని వారికి కొంత విడుపు నిత్తుము.🙏🏻

 *పాలపర్తి* 

*రసజ్ఙభారతి సౌజన్యంతో*

కామెంట్‌లు లేవు: