🍁🍁🍁🍁🍁🍁🍁🍁
రాముడు అగస్త్యునితో 'ఓ మహర్షీ! రావణుడు, వాలి ఇద్దరూ మహాశక్తమంతులైన వీరులనటంలో సందేహం లేదు. కానీ హనుమంతుని బలపరాక్రమాలు వారినిద్దరిని అధిగమించినవని నాకు అనిపిస్తోంది. నిజానికి నా లంకా విజయం సందర్భంగా అతనొక్కడే నాకు ఘనవిజయాన్ని చేకూర్చపెట్టి నేను సీతను తిరిగి పొందగోరేటట్లు చేశాడు. నా అనన్యసేవకులలో సర్వోత్తముడు అయిన హనుమంతునికి నేను ఎంత ఋణపడి ఉన్నానో సముచితంగా నేను వ్యక్తం చేయలేను. ఓ మహార్షీ! ఇప్పటికీ నాలో ఉన్న ఒక సందేహాన్ని తీర్చవలసిందిగా నిన్ను ప్రార్ధిస్తున్నాను. వాలి, సుగ్రీవుల మధ్య వైరము ఉన్నప్పుడు హనుమంతుడు వాలిని నిర్జించకుండా ఉండటానికి కారణం ఏమిటి? హనుమంతునికి స్వీయ బలపరాక్రమాలు గురిఓచిన యెఱుక లేదనుకుంటాను, లేకుంటే సుగ్రీవుడు వెతలు పడుతుంటే అతను నిష్క్రియునిగా ప్రక్కనే నిలిచి చూస్తూ ఎలా ఉండిపోయాడు? ఓ ఋషీశ్వరా! నిగూఢ సత్యాలన్నీ ఎరిగినవాడవు కనుక దయచేసి హనుమంతుని యొక్క దివ్యలీలను వివరించి నా సందేహాన్ని నివారించగలవు'అన్నాడు శ్రీరామచంద్రమూర్తి.
ఆ సమావేశంలో హనుమంతుడు కూడా ఉపస్థితుడై సంభాషణను ఆలకిస్తూ ఉన్నాడు. రాముని మాటలను వినటంతోనే అమితమైన దివ్యానందాన్ని అనుభవించాడు. అంతట అగస్త్య మహార్షీ ఇలా సమాధానం ఇచ్చారు.' శక్తిలోగానీ, వేగంలో గానీ, మేదస్సులోగానీ మారుతికి సాటిరాగలవారు ఎవరూ లేరనేది యథార్థం. అయితే తన వాస్తవికమైన బలపరాక్రమాలు గురించి అతను విస్మరించటం జరుగుతుంది. దీనికి కారణం వివరించటానికై అతని జీవిత కథను తెలియజేస్తాను.
మేరు పర్వతాన నివసిస్తూ ఉండే ఒక వానర ముఖ్యుడైన కేసరి యొక్క పత్నియైన అంజనకు వాయుదేవుని వలన జన్మించినవాడు హనుమంతుడు. బిడ్డను ప్రసవించిన మీదట అంజన అతని కోసం కొన్ని ఫలాలను సేకరించుకొని రావటానికి వెళ్ళింది. అయితే ఆమె లేచి సమయంలో ఆకలిగొన్న శిశువు రోధించనారంభించాడు. ఆ సమయంలో సూర్యుడు ఉదయించసాగాడు. కాంతివంతమైన ఆ అరుణ గోళాన్ని చూచిన వానరశిశువు దానినొక ఫలంగా భావించి దానిని అందుకోవటానికై ఆకస్మికంగా పైకెగిరాడు.
వాయునందనుడు గాలిలో అమితవేగంగా ఎగురుతుండటం చూచిన దేవతలు ఆశ్చర్యచకితులై 'మనస్సు లేదా గరుడుడు కూడా అంత వేగంగా పోలేరు. శిశువుగా ఉండగానే ఈ వానరుడు ఇంత సామర్థ్యం ప్రదర్శిస్తే అతను పెద్దవాడైన తర్వాత ఇంకెలా ఉంటాడో అన్నారు.
మండిపోతున్న సూర్యుని తాపాన్ని తన పుత్రుడు ని రక్చించటానికై వాయుదేవుడు అతని వెంట వెళ్ళాడు. అంతట వానర శిశువు తనను సమీపించగా సూర్యుడు అతని శైశవపు అమాయకత్వం ను భవిష్యత్తులో రాముని తరపున అతను నిర్వహించనున్న మహాకార్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని అతనిని దగ్ధం చేయకుండా ఊరుకున్నాడు. అందువలన వాయునందనుడు రథ మీద సూర్యుని ప్రక్కనే ఆశీనుడు కాగలిగాడు.
సరిగ్గా అదే సమయంలో సూర్యభగవానునిపై దాడి చేయటానికి రాహువు రావటం తటస్ధించింది. వెంటనే ఆ వానర శిశువు రాహువు ని దొరకబుచ్చుకున్నాడు. కానీ గ్రహ నియంత్రకులందరిలో అధముడైన రాహువు మరుక్షణంలోనే అతని పట్టునుంచి జారుకున్నాడు. రాహువు భయంతో ఇంద్రుణ్ణి సమీపించి 'నా క్చుద్బాధను తీర్చుకునే సాధనంగా సూర్యచంద్రులు ని నాకు కేటాయించినప్పటికీ, నాకు దక్కవలసిన భాగాన్ని వేరొకరు వశం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నేను సూర్యుణ్ని సమీపించినపుడు వేరొక రాహువు అతనిమీద దాడి చేస్తుండటాన్ని చూచాను' అంటూ ఆరోపణ చేశాడు.
ఈ విషయం విని ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. అందువల్ల ఐరావతాన్ని అధిరోహించి సూర్యుని దిశగా బయలుదేరాడు. రాహువు ముందుగా వెళ్ళాడు. అతని రాకను గమనించిన వాయునందనుడు అతణ్ణి ఒక బ్రుహత్ ఫలంగా భావించి అతనిని పట్టుకోవటానికై సూర్యుని రథం మీద నుంచి ఎగిరాడు. రాహువు తక్షణమే ఇంద్రుని రక్షణ కోసం ఆర్తనాదం చేస్తూ పారిపోసాగాడు. ఆ సమీపానికి స్వర్గాధిపతి అతనికి అభయమిచ్చాడు.
అంతట ఆకలిగొన్న శిశువు ఐరావతాన్ని చూడగానే ఆ గజాన్ని ఒక బ్రుహత్ శ్వేతఫలంగా భావించి దానివైపు దూసుకువెళ్ళాడు. వాయునందనుడు సమీపిస్తుండటాన్ని చూచిన ఇంద్రుడు తక్షణమే తన వజ్రాయుధం ను వదిలాడు. దాని దెబ్బకు వానరశిశువు ఒక పర్వతంపై కూలిపడి దవడవిరిగి ప్రాణం విడిచాడు. దీనితో క్రుద్దుడైన వాయుదేవుడు తన తనయుడుని తీసుకుని ఒక పర్వత గుహలోకి వెళ్లిపోయాడు. శ్వాస వాయువుగా తన క్రియాకలాపాలను వాయుదేవుడు నిలిపివేయడంతో సకల ప్రాణులు ఊపిరాడకపోవటం వల్లను, మలమూత్రబంధనం వల్లనూ విలవిల్లాడసాగారు. కడుపుబ్బరంతో దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఆత్రుతగా తమ దైన్యస్థితిని ఆయనకు విన్నవించుకున్నారు. అంతట బ్రహ్మ దేవుడు 'ఓ దివ్య లారా! వాయుదేవుని వాయుదేవునికి ఆగ్రహం కలగటం చేతనే మీరిపుడు వేదన చెందుతున్నారు. వాయుదేవుని ప్రాముఖ్యత ఎలాంటిదో కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ద్రుగ్గోచరమైన భౌతిక దేహమంటూ ఆయనకు లేనప్పటికీ స్రుష్టిలోని సకల ప్రాణుల దేహాల్లోను అంతర్గతంగా ఆయన సంచరిస్తూ ఉంటాడు. వాస్తవానికి వాయువు లేకుంటే భౌతిక దేహం ఒక కాష్టమే అవుతుంది తప్ప అంతకు మించి మరేమీ కాదు. అందువల్ల సకల జగత్తుయొక్క శ్రేయస్సు నిమిత్తం వాయుదేవుని వద్దకు వెళ్లి ఆయనను శాంతింపచేద్దాం సరేనా? అన్నాడు. (ఇంకా ఉంది) ఇది సేకరణ మాత్రమే 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి