"నమస్కారం గురువు గారు .... "
"ఆయుష్మాన్ భవ, చిరంజీవ, సుఖీభవ"
"ఏఁవి దీవెనలో కానీ గురువు గారు, ఉయ్యాలకోసం గొలుసు వేస్తే ఉన్న గొళ్ళెం ఊడిందట .... అలా ఉంది నా పరిస్థితి"
"అదేం దిక్కుమాలిన సామెత నాయనా? ఎప్పుడు వినలేదే .... ?"
"అన్నీ మనం వినాలని లేదుగా గురువు గారు. నాకు తోచిన సామెత చెప్పాను".
"మంచిది .... కానీ నువ్వు చెప్పిన సామెతకు నా దీవెనకు సంబంధం ఏమిటి?"
"అలా అడిగారు బాగుంది .... మీకు తెలుసుగా గురువు గారు, నాకు ఆ మధ్య గుండె ఆగిందన్న విషయం ....?"
"ఆగలేదు నాయనా. ఒక జర్క్ ఇచ్చిందంతే"
"అదేలెండి .... దానికి మందులు వాడటం వల్ల గ్యాసు సమస్య వచ్చింది .... "
"మళ్ళీ బుక్ చేసుకో నాయనా, రెండు రోజుల్లో వచ్చేస్తోందిప్పుడు .... "
"ఆ గ్యాసు కాదు గురువు గారు. కడుపులో గ్యాసు .... "
"ఓహో ,,,, మరి దానిక్కూడా మందులు ఇస్తారుగా డాక్టర్లు?"
"ఇచ్చారండి .... మనకు బి.పి., సుగరు ఉన్నాయి కదా .... ?"
"మనకు కాదు నాయనా, నీకు".
"అదేలెండి .... నాకే .... వాటికి మందులు వాడటం .... ఇలా రోజుకి పదకొండు మందులు వేయవలసి వస్తోంది".
"అన్ని వాడితే సిలిండరు పేలిపోతుంది నాయనా".
"ఏ సిలిండరు గురువు గారు?"
"నీ కడుపులో గ్యాసు ఉందన్నావు కదా! ఆ సిలిండరు".
"ఓహో .... మరి ఆ సిలిండరు పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి గురువు గారు?".
"నడవాలి నాయనా .... "
"ఆయాసం వస్తోంది గురువు గారు"
"ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయన్నమాట .... "
"దడ వస్తోంది గురువు గారు"
"గుండె బలహీనంగా ఉందన్నమాట"
"కాళ్ళు వాస్తున్నాయి గురువు గారు"
"మూత్రపిండాల సమస్య .... "
"ఇన్ని సమస్యలతో నేనెందుకు బతికుండాలి అనిపిస్తోంది గురువు గారు"
"అదే పొరపాటు నాయనా .... "
"ఎందుకని గురువు గారు?"
"నువ్వు ఒక ఇంట్లో అద్దెకి ఉంటున్నావనుకో, ఆ ఇంటికి రిపేరొస్తే ఏం చేస్తావ్?"
"ఓనరుకి చెప్పి రిపేరు చేయించమంటాను"
"కానీ ఆ ఓనరు ఆ ఇల్లు నువ్వు బతికున్నంత కాలం అనుభవించేందుకు అనుమతిచ్చాడనుకో .... అద్దె లేకుండా, అప్పుడేం చేస్తావ్?"
"అద్దె లేకుండానా? అలాంటి వాళ్ళెక్కడ దొరుకుతారు గురువు గారు ఈ రోజుల్లో?"
"దొరికాడనుకో .... ఏం చేస్తావ్?"
"నేనే రిపేరు చేయించుకుంటాను"
"అసలు రిపేరు ఎందుకు రావాలి?"
"ఎందుకంటే .... వాడకంలో కొంచెం అటూ ఇటూ అవుతుంది కదా గురువు గారు?"
"అలా అవకుండా జాగ్రత్త పడితే ఇలా రిపేర్ల ఖర్చు ఉండదు కదా?"
"కాస్త అర్ధం అయేలా చెప్పండి గురువు గారు ....".
"అలా అడిగావు, బాగుంది. ఈ శరీరం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన అద్దె కొంపలాంటిది. ఆయన ఆ కొంపను మనకు జీవితాంతం ఉచితంగా వాడుకోమని ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా ఖాళీ చెయ్యమని అడగొచ్చు. నీవిలాగ దానికి రిపేర్లు చేయించి, పై పూతలు పూసి, మసి పూసి మాయ చేస్తే ఆయన ఒప్పుకుంటాడా?"
"ఒప్పుకోడు .... "
"మరి ఆ కొంపను జాగ్రత్తగా చూసుకోవాలి కదా?"
"అందులో నా నిర్లక్ష్యం ఏముంది గురువు గారు?"
"నువ్వు పుట్టినప్పుడు ఈ రోగాలన్నీ ఉన్నాయా?"
"లేవు .... "
"మధ్యలో ఎందుకొచ్చాయ్?"
"అంటే .... అది .... సమస్యలు వస్తే ఏం చెయ్యాలో అనే ఆలోచనల వల్ల .... "
"కదా? కానీ సమస్య ఉందంటే పరిష్కారం ఉన్నట్లే .... "
"అదేంటి గురువు గారు? పరిష్కారం లేని సమస్యలు ఉండవా లోకంలో?"
"ఉండనే ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండా చూసుకోవాలి .... "
"నా ఉద్యోగం అలాంటిది గురువు గారు. రెవిన్యూలో ఉద్యోగం అంటే మీకు తెలియనిదేముంది చెప్పండి?"
"పైగా నువ్వు మడి కట్టుక్కూచుంటావు కూడా .... "
"అదే పెద్ద సమస్య గురువు గారు"
"సమస్య అది కాదు నాయనా. అన్ని సమస్యలకు అదే పరిష్కారం .... "
"ఇదేం ఫిట్టింగు గురువు గారు? నేను అలా మడి కట్టుక్కూచోడం వల్లే నా మీద విపరీతమైన వత్తిడి, బెదిరింపులు, బదిలీలు .... వీటన్నిటవల్ల ఆరోగ్య సమస్యలొస్తున్నాయి .... "
"వాటివల్ల రాలేదు .... "
"మరి ....?"
"వాటిని నువ్వు సమస్యలుగా భావించడం వల్ల వచ్చాయి"
"అదేంటి గురువు గారూ, అవి సమస్యలు కావా?"
"కానే కావు. నువ్వు రూలు ప్రకారం పని చేసుకెళ్తావు. ఏ వత్తిడికి లొంగవు. బెదిరింపులకు భయపడవు. బదిలీలంటావా, ఉద్యోగంలో అదొక భాగం. ఇప్పుడు చెప్పు నీకు వీటిలో సమస్య ఎక్కడుంది?"
"అలా ఆలోచిస్తే సమస్యల్లాగా కనపడవు. కానీ అలా ఆలోచించలేం కదా గురువు గారు?"
"అలాగే ఆలోచించాలి నాయనా. సమస్య అనుకుంటే సమస్య .... కాదనుకుంటే కాదు"
"మరి మందులు ఆపేయమంటారా?"
"అది పరిష్కారం కాదు. ఇప్పటికే రిపేరుకు వచ్చింది కాబట్టి మందులు వాడు. వ్యాయామం చెయ్యి. కనీసం రోజూ అరగంటైనా నడక అలవాటు చేసుకో .... పిల్లలు సెటిలయ్యారు కదా?"
"అయ్యారండి .... "
"హాయిగా నీకు నచ్చినట్లు బతుకు. ముఖ్యంగా మీ ఆవిడ మాటను పట్టించుకో. కనీసం పట్టించుకున్నట్లుండు. అప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి".
"అంటే భార్య చెప్పింది వినమంటారా? వద్దంటారా?"
"చూడు నాయనా .... జీవితం అనేది ఒక రైలు ప్రయాణంలాంటిది. అందులో మధ్యలో వచ్చి రైలెక్కేది భార్య. ఆమె ముందుగానే దిగొచ్చు లేదా నీ తరువాత దిగొచ్చు. అంటే తోటి ప్రయాణీకురాలు. అలాగే పిల్లల్లున్నూ .... "
"అదేంటి గురువు గారు, భార్య, పిల్లలు తోటి ప్రయాణీకులా?"
"అలా అనుకుంటేనే నీకు సమస్యలు రాకుండా ఉంటాయి .... "
"మరి పిల్లల్ని జాగ్రత్తగా పెంచకుండా, తోటి ప్రయాణీకులుగా భావించి వదిలేయలేం కదండీ?"
"రైల్లో బెర్తు కన్ఫమ్ అయ్యేదాకా నీ పక్కన కూర్చునే ప్రయాణీకులనుకో .... "
"ఓహో .... "
"ఇప్పుడు వాళ్ళ బెర్తులు కన్ఫమ్ అయినాయి కదా, ఇంక వాళ్ళ గురించి నీకెందుకు బెంగ?"
"మరి వాళ్ళకు ఏదైనా సమస్యలొస్తే?"
"టి.టి.ఈ. ఉన్నాడు కదా?"
"టి.టి.ఈ ఉన్నాడా? అంటే?"
"రైలు అనే జీవితానికి భగవంతుడే టిటిఈ. ఏవైనా సమస్యలొస్తే ఆయన్నే అడగాలి. అంతే కానీ రైలు చైన్ లాగి నువ్వేమన్నా చేద్దామనుకుంటే .... ఇదుగో .... ఇలాగే అవుతుంది .... "
"ఆహా .... శరీరాన్ని అద్దె కొంపతోను, జీవితాన్ని రైలు ప్రయాణంతోను పోల్చి చెప్పారు చూడండి గురువు గారు .... అద్భుతం. కానీ ఒక అనుమానం కొడుతోంది, అడగమంటారా?"
"అడుగు నాయనా?"
"ఇన్ని ఆలోచించే మీకు మీ గుండె ఎందుకు జర్క్ ఇచ్చిందంటారు?"
"జర్క్ ఇచ్చిన తరువాతే ఇవన్నీ తెలిసాయి నాయనా .... ఇక ఉంటా నాయనా .... మా ఆవిడ పెసరట్లు వేస్తోంది. చల్లారితే బాగుండవ్ .... "
"మరి అది మీకు సమస్యేగా?"
"అందుకే వేడిగా తినాలన్నది .... అదే పరిష్కారం .... "
*
పండిత పామరావధానులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి