30, మార్చి 2022, బుధవారం

నేను, నాది, నాకు

 నేను, నాది, నాకు అనే ఈ మూడు పదాలు మనం సర్వసాధారణంగా ప్రతి రోజు అనేక సందర్భాలలో ఉపయోగిస్తున్నాము. ఈ పదాలు వాడేటప్పుడు కొన్ని సార్లు సంతోషం, ఆనందం,కలుగుతుంది అలాగే కొన్ని సందర్భాలలో విచారం, దుఃఖం కూడా కలగటం కద్దు. ఈ వాడుకల గూర్చి ఒక చిన్న పరిశీలన చేద్దాం. 

నేను: ఇంతమంచి ఇల్లు ఎవరు కట్టించారండి.  నేను కట్టించానండి ఆ జవాబు చెప్పేటప్పుడు ఒక రకపు గర్వం  తొణికిసలాడుతుంది . అంతటితో ఆగి పోడు మా అన్నదమ్ములల్లో ఇంతపెద్ద ఇల్లు నా ఒక్కడికే వుంది.  మా అన్నయ్య రెవెన్యూ డిపార్టుమెంటులో పెద్ద ఉద్యోగం చేసాడు కానీ ఇప్పటివరకు ఒక గుడిశ కూడా కొనలేక పోయాడు, ఇక మా తమ్ముడు ఇటీవలే ఒక చిన్న ఇల్లు కొన్నాడు. నిజానికి నీవు అతని అన్నదమ్ముగూర్చి ఏమి అడగలేదు కానీ చెప్పాడు ఎందుకంటె ఆలా చెప్పటంలో తన ఉన్నతస్థితిని చెప్పటానికి. నిజానికి అతని అన్నగారు నిజాయితిగా యుద్యోగం చేయటం వలన ఎక్కువగా సంపాదించలేక పోయాడు అందుకే ఇల్లు సమకూర్చుకోలేక పోయాడు. మరి తాను అడ్డమైన గడ్డి తిని అందరిని ముంచి బాగా సంపాదించి ఇంతపెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ప్రజలకి నీవు ఎలా జీవిస్తున్నావు అన్నది అవసరంలేదు నీవు యెంత సంపాదించావు అన్నది ఉంటే చాలు. తమ్ముడు పొదుపుగా జీవనం చేస్తూ తన ఆర్జనకు తగినట్లుగా అప్పులు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నాడు.  ఇప్పుడు సమాజంలో నీతి, నిజాయితీకి విలువలు రోజు రోజుకు సన్నగిలుతున్నాయి. 

నాది: సమాజంలో పలుకుబడి, ఉన్నత స్తానం నాది అని ప్రతివారు ఏంటో సంతోషంగా చెప్పుకోవటం మనం చూస్తున్నాం. 

నాకు: ఎక్కడ ఎది వున్న కూడా అది నాకే దక్కాలి అనే ఆలోచనలు ప్రతివారిలో ఉంటున్నాయి. 

ఇలా మనం రోజు వాడే ఈ పదాలే కాక వీటికి అనుబంధంగా మాకు, మనం, మాది లాంటివికూడా వీటి కోవకే చందుతాయి. ఇంతకూ ఈ నేను, నాది, నాకు అనే పాదాలను ఎవరికి ఉపయోగిస్తున్నాము అంటే వెంటనే నాకే ఉపయోగిస్తున్నాం అని సమాధానం చెపుతాము. ఇంతకూ ఆ నేను ఎవరు అంటే అది నా దేహం అని మనం అందరమూ ముక్తకంట్టంగా చెపుతాము అందులో సందేహం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దేహం అని చెప్పే నా దేహం నిజంగా నాదేనా లేక వేరే ఎవరిదైనన. దీనికి .వివరణ క్రింద చుడండి. 

దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోపి వా. ఏవం సాధారణం దేహమవ్యక్త ప్రభవాప్యయమ్ కో విద్వానాత్మసాత్ కృత్వా హన్తి జన్తూనృతే సతః. 

(భాగవతము 10-10-11,12)

ఈ దేహము ఎవరిది? అన్నము పెట్టి పోషించువానిదా? పుట్టించిన తండ్రిదా? తొమ్మిది నెలలు మోసిన తల్లిదా? తల్లిని కనినట్టి తాత అమ్ముమ్మలదా? దీనిచేత పనిచేయించు బలవంతునిదా? శ్మశానములో దీనిని కాల్చివేయు అగ్నిదా? రుధ్ర భూమియందు దీనిని కొరికి కొరికి తినివేయు కుక్కలదా? అని భాగవత కారుడు నిలదీసి ప్రశ్నించెను. భాగవతము దశమస్కంధములో నారదుడు నలికూబర, మణిగ్రీవులను దేవపుత్రులకు గావించిన హితోపదేశ సందర్భమున ఈప్రశ్న గావింపబడెను. ఆ ప్రశ్నకు నారదులే ఈ ప్రకారముగ సమాధానము ఒసంగివైచిరి –

'నాయనలారా! ఈ దేహము ఎవరిదీ కాదు. ఇది యొక సామాన్యమైన జడవస్తువు. మృత్తికానిర్మిత మగు ఘటమువంటిది. ప్రకృతి నుండి పుట్టి ప్రకృతిలో లయమైపోవుచున్నది. ఇట్టి అల్పవస్తువును 'నేను' అని తలంచి ఇతరులకు కీడు చేయదలంచువారు ఎంత అవివేకులు?' కావున నశ్వరమై, పాంచభౌతిక మైనట్టి ఈ శరీరము తాను కాదనియు, శాశ్వతమగు చిన్మయ ఆత్మయే తాననియు బాగుగ నిశ్చయించుకొని, సర్వప్రాణులు తన స్వరూపమే యని భావించు కొని, ఎవరికిని అపకారము చేయక జీవితమును గడుపవలయును.

మానవునికి కలుగుచున్న దుఃఖమంతటికిని కారణము ఈ దేహాభిమానమే. దేహముపైనను, దేహమునకు బయట గల పదార్థములపైనను గల మమత్వమే దుఃఖమునకు హేతువు. జీవుడు ఉపాధిని ధరించి లోకమున వ్యవహరించు ఉపాధి వస్తువుగా మాత్రమే ఈ దేహమును తెలుసుకొనవలెను. అంతేకాని నశ్వరము, అనిశ్చితము క్షయము అగునట్టి ఈ దేహము మీద వ్యామోహము కల్పించుకొన వలదు.. ప్రతి మానవుడు నిత్యమూ దేహసౌందర్యముకొరకు, దేహాభిమానము కొరకు, దేహవృద్ది కొరకు మాత్రమే తమ అమూల్య మైన కాలాన్ని వెచ్చిస్తున్నాడు. నిజానికి కాలప్రవాహంలో పుట్టి కాలప్రవాహంలో కలిసిపోయే ఈ దేహము నాది కాదని కేవలము సాధకుడు మాత్రమే తెలుసుకొనగలడు. ఈ దేహము జరామరణాలకు లోబడి వున్నది కాబట్టి శరీరములో సత్తువ ఉన్నపుడే శరీరాన్ని అంటిపెట్టుకొన్న ఆ జీవుడిని (ఆత్మ) ఉద్ధరింపచేయ వలెను నిత్యము తప్పసును చేసి మోక్ష ప్రాప్తిని పొందవలెను. సమయము నీచేతిలో లేదు ఈ క్షణమే మేలుకో జీవన్ముక్తికి సాధన ఆరంభించు. 

ప్రపంచం: ఈ ప్రపంచము చాలా విచిత్రమైనది ప్రతివారు ఈ ప్రపంచము తనగూర్చి తలచిస్తుందని అనుకుంటారు.  నిజానికి ప్రపంచానికి నీవు ఎలా వున్నావు అనేది సంబంధము కలిగి ఉండదు. ఎప్పుడు ప్రపంచం కోసం బ్రతకకు నీకోసం మాత్రమే బ్రతకటం అలవాటు చేసుకో. 

ధర్మం: ధర్మ బద్దంగా జీవిస్తూ భగవంతుడు నీకిచ్చిన దానితో తృప్తి చెంది దినములో అధిక కాలము భగవంతుని చింతన చేయటమే సాధకుని పని. మానవులుగా మనం కేవలము సాధన చేయటము మాత్రమే ఫలితాన్ని ఇవ్వటం భగవదానుగ్రహం. 

దేహము మీద యెంత మమకారము పెంచుకొనినను ఇది ఏదో ఒక రోజున రాలిపోక  తప్పదు. కాబట్టి దేహాన్ని సరైన పద్దతిలో వాడుకొని మోక్ష ప్రాప్తి పొందటమే మానవుని కర్తవ్యము. 

దీపమున్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకో: 

దేహమనే ఇంట్లో జీవుడు అనే దీపం ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కదిద్దుకో ఎప్పుడైతే దీపం ఆరి పోతుందే అప్పుడు దేహమనే నీ ఇల్లు దేనికి పనికి రాదు కేవలం కట్టెలలో కాల్చి బూడిద అవ్వటం తప్ప.  ఎవరో నన్ను చూసి ఏమనుకుంటారో అనే భావనను విడనాడి ఇప్పుడే మన మహర్షులు నిర్దేశించిన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించు. 

ఓం తత్సత్

శాంతి శాంతి శాంతిః 

కామెంట్‌లు లేవు: