🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
* ఓ కథ*
పట్టుచీర కట్టించాడు తల్లికి. ‘చూశారా ఉద్యోగం వచ్చాక గాని, పెళ్ళికి గాని నాకు ఒక మంచి పట్టుచీర పెట్టనేలేదు నా కొడుకు’ అని మధనపడుతోంటే ‘పిచ్చిదానా నీకేం లోటు. నేనున్నానుగా. నీకు ఎంత ఖరీదైన చీర కావాలో చెప్పు. క్షణాల్లో తెస్తాను’ అనేవాడు మూర్తి చాలాసార్లు.
ముఖమంతా పసుపు పూసి నుదురులో నాలుగో వంతు కుంకుమ బొట్టు పెట్టారు. కళ్ళకు కాటుక పెట్టారు. పట్టుచీర అలంకరణలో దేవకి ముఖం వెలిగిపోతోంది. సుమంగళిగా వెళ్ళిపోవడం హైందవ స్త్రీలు ఎప్పుడూ కోరుకుంటూంటారు ఇందుకేనేమో.
దేవకి ఒక్కసారి కళ్ళు తెరిస్తే చూడాలని మూర్తి మనసు ఉవ్విళ్ళూరింది.
పెద్ద పూల మండపం తయారు చేయించారు. ఘనంగా మేళం పెట్టి ఊరేగింపుతో మరుభూమికి తీసుకెళ్ళారు.
సువాసిని పూజలో ముత్తయిదువులు అందరికీ ఇత్తడి చేటలు, వెండి కుంకుమ భరిణెలు తాంబూలాల్లో పెట్టిచ్చారు. ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశారు. భోక్తలకు పంచెల చాపులు, పెద్ద రాగి చెంబులు, కర్మకాండలకు వచ్చిన వారందరికీ పెద్ద స్టీలు పళ్ళాలు ఇచ్చారు.
పత్రికల్లో సగం పేజీలలో రంగులలో అశ్రునివాళి ప్రకటనలు ప్రచురించారు. మునిసిపాలిటీలో పర్మిషన్ తీసుకొని పాలరాతి సమాధి కట్టించారు. ఈ అతి ఖరీదైన సమాధి దేవకి చూసుకుంటుందా? ఏమిటో!
ఈ తతంగమంతా కొడుకు, కోడలు కలిసే చేశారు. మూర్తి కూతురు కనీసం ఒక్క చెయ్యి కూడా వెయ్యలేదు. మరి అది తన పని కాదని భావించిందేమో!
చివరగా ఆశీర్వచనాలలో పురోహితులు ‘నాయనా ! ఇన్నాళ్ళూ మీ అమ్మ గారు, నాన్నగారు పార్వతీ, పరమేశ్వరుల లాగా కలిసిమెలిసి ఒకరి యోగక్షేమాలు మరొకరు చూసుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితి అలా కాదు. మీ నాన్నగారు ఒంటరి వారైపోయారు. మీరు ఆయన్ను తన శ్రీమతి లేదనే దిగులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక నుండి కంటికి రెప్పలాగా చూస్తామని పెద్దల ఎదుట ప్రమాణం చెయ్యండి’ అనగానే ‘అలాగే’ అన్నాడు కొడుకు.
అశుభ కార్యక్రమం కాబట్టి వచ్చిన వారందరూ చెప్పకుండానే ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
దిగాలుగా కూర్చున్న మూర్తి దగ్గరకు కూతురు వచ్చింది. ఒక క్షణం ఆగి ‘నాన్నగారు ఉన్నపళంగా ఏమిటి ఇలా అయిపోయింది మన ఇల్లు నిశ్శబ్దంగా’ అంటూ తండ్రిని ప్రేమగా దగ్గరకు పొదువుకుంది.
కూతురి ఆప్యాయతతో నిండిన ఓదార్పు మూర్తి మనసును ఎంతగానో ఉపశమింపచేసింది. ఆ మరు క్షణంలోనే ‘నాన్నగారూ ఈ విచార సమయంలో నేను ఈ మాట మాట్లాడకూడదు. కాని ఎప్పుడు మాట్లడాల్సింది అప్పుడు మాట్లాడకపోతే సమయం మించి పోతుంది’ అంటూ ఆమె వెనకాడుతోంటే ‘చెప్పు తల్లీ’ అని అడిగాడు మూర్తి.
‘ఈ ఇల్లంటే, అమ్మ తిరిగిన ఈ పరిసరాలంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. అన్నయ్యకు ఏమిస్తారో నాకు తెలీదు గాని, నాకు మాత్రం ఈ ఇల్లు బహుమానంగా ఇవ్వండి నాన్నగారు’ అంది గోముగా.
మూర్తి హృదయంలో ధమనులు, సిరలు ఒక్కసారిగా చిట్లిపోయి రక్తం ముఖంలోకి చిమ్మింది. ఇంకా తను బ్రతికే ఉన్నాడుగా అప్పుడే ఆస్తులు అడిగేస్తున్నారా?
ఒక్కక్షణం తేరుకుని మూర్తి ‘పిచ్చి తల్లీ నువ్వంటే మాకు ఎంతో ఇష్టం. నువ్వు ఈ మాట అడగకుండా ఉంటే ఎంతో బావుండేదిరా. కాని అడిగేశావ్. మీ అమ్మ కోరిక ఏమిటంటే మా తదనంతరం ఈ ఇంటిని ఒక వద్ధాశ్రమానికి ఇచ్చేద్దామని. అది పక్కన పెట్టేసెయ్. కాని అమ్మ అంతిమ సంస్కారాలు, తదితర కార్యక్రమాలు అన్నయ్య, వదిన ఎంతో డబ్బు ఖర్చు చేసి క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఒళ్ళు గుల్ల చేసుకుని నిర్వహిస్తోంటే కనీసం కొంత డబ్బు ఖర్చు చేస్తానని గాని, ఏదో ఒక పని సాయం చేస్తానని గాని ఎందుకు నువ్వు ముందుకు రాలేదు ? ఇలా అంటున్నందుకు క్షమించు తల్లీ’ అంటూ భుజం మీదున్న కండువాను ముఖం మీద కప్పుకుని భోరుమన్నాడు మూర్తి.
కూతురు నింగి, నేల చూస్తోంది అయోమయంగా. చిటికెలో తండ్రి చూపులకు అందకుండా మాయమైపోవాలనుంది ఆమెకు.
దాదాపు యాభై సంవత్సరాల అన్యోన్య దాంపత్యంలో తనను అన్ని విధాలుగా ఆదుకుని, చేదోడువాదోడుగా ఉండి, తన తలపుల నిండా కమ్ముకున్న భార్య దేవకి ఉన్నపళంగా మాయమై పోయిందే ! ఆమె లేకుండా ఎలా జీవితం కొనసాగించడమా అని ఏడుస్తూ ఉంటే కూతురు ఇల్లు కావాలంటోంది.
మనిషి తన సుఖం కోసం సంపాదించుకున్నవి తిరిగి అతన్నే వేధిస్తాయన్న మాట. ఇప్పటికే అబ్బాయికి రెండిళ్లు, అల్లుడికి ఒక మేడ, ఖాళీ స్థలం ఉన్నాయి మరి!
రెండు, మూడు రోజుల్లో పిల్లలు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు. సామాన్లు సర్దుకుంటున్నారు. తాను మోజు పడిన దేవకి చీరలు కొన్ని కూతురికి ఇచ్చేశాడు. వాటిని చూస్తోంటే మరింత వేదన కలుగుతుందనే ఆలోచనతో.
తరువాత కోడలికి ఇవ్వాలి. వీళ్ళేం చేస్తున్నారోనని కొడుకు గది వైపు వెళ్ళబోతుంటే గట్టిగా కేకలు, అరుపులు వినిపించసాగాయి మూర్తికి.
తలుపు దగ్గరే చాటుగా నిలబడి ఉండిపోయాడు.
‘ఏమిటి పిచ్చి వేషాలు వేస్తున్నావ్ ? నాన్నగారిని ఇల్లు అడిగేస్తున్నావేం?’ అంటున్నాడు చెల్లితో చాలా కోపంగా.
‘ఏం నేను అడగకూడదా ? నాకూ హక్కు ఉంది’ అంటోంది కూతురు అంతే కోపంతో.
‘లక్షలు ఖర్చుపెట్టి అమ్మకు సంస్కారాలన్నీ చేసి నాన్నగారిని సంతోషపెట్టాను. ఇంకా నాతో కూడా తీసుకెళ్ళి నాతో పాటే ఉంచుకుని ఆయన యోగక్షేమాలన్నీ చూసుకుని ఈ ఆస్తంతా నా పేరున రాయించుకుందామనుకుంటున్నాను ఆయన బ్రతికుండగానే. అర్థమైందా ? ‘ఇక్కడ్నించి వెంటనే నీ మొగుణ్ణి, పిల్లలను తీసుకుని వెళ్లిపో. పిచ్చి వేషాలు వెయ్యకుండా’ కోపంతో అరుస్తున్నాడు.
ఆమె వెంటనే ఆ గదిలోంచి బయటకు వెళ్ళకపోతే చేయి చేసుకుంటాడేమో.
కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది. మూర్తికి ఈ సంభాషణంతా విన్నాక గుండెల్లో మందుపాతరలు పేలినట్లుగా, ప్రాణం కడతేరుతున్నట్లుగా ఉంది.
‘దేవకీ నీ ముద్దుల కొడుకు, కూతురంటే ప్రేమతో పడి చచ్చేదానివి. నువ్వు బ్రతికుండగా ఈ మాటలు వినుంటే చచ్చిపోయేదానివి. కాని చచ్చిపోయి బ్రతికిపోయావ్. అదష్టవంతురాలివి. అయినా నువ్వు బ్రతికుండగా ఈ మాటలు అనే అగత్యం లేదుగా. ఇప్పుడు నేనేం చెయ్యాలి?’ అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ తమ పడకగదిలో చేరి కర్మకాండల కోసం చేయించిన దేవకి ఫొటో ఎదురుగా నిలబడ్డాడు కళ్ళ నిండా నీటి చెలమతో.
విరక్తిగా నవ్వుతోంది దేవకి ఫొటోలో ఎప్పటి లాగే. కంట్లో నీరు నిండిపోయి కనురెప్పలు మూసి తెరిచేటప్పటికి ‘ఇవన్నీ మనకెందుకండి నా దగ్గరకు వచ్చేయండి’ అన్నట్లుగా రెండు చేతులు చాపి పిలుస్తున్నట్లుగా భ్రమ చెందాడు మూర్తి.
కళ్లు నులుముకుని మళ్ళీ చూశాడు. ఎప్పటిలాగే చిద్విలాసంగా నవ్వుతోంది దేవకి. తదేకంగా చూస్తూనే ఉన్నాడు మూర్తి భార్య ఫొటోను ‘ఎప్పుడు రాగలను నీ వద్దకు’ అన్నట్లుగా.
‘ఎందరో తల్లుల ప్రేమ కలిపితే దైవం. ఎందరో దైవాల ప్రేమ కలిపితే అమ్మ’ అన్నారు ఓ కవి.
కాని అప్పుడే ఆ తల్లిని మర్చిపోయి తండ్రి బ్రతికుండగానే సంపదలపై మోహాలు కలుగుతున్నాయి సంతానానికి.
‘నాన్నగారూ మీరు ఒంటరిగా ఎలా ఉంటారు. మా దగ్గరకు వచ్చి ఉండండి’ అని అబ్బాయి గాని, అమ్మాయి గాని అన్నారా?
ఇల్లు కావాలని ఒకరు. మొత్తం అస్తి కావాలని మరొకరు. అసలు ఆస్తులు సంపాదించడం ఎందుకో? ఏమిటో?
‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. అంతా ఒక నాటకం. ఎవరు తండ్రి ? ఎవరు కొడుకు ?’ టెలివిజన్లో డాక్టర్ సి. నారాయణరెడ్డి గారికి నివాళి సమర్పిస్తున్నారు ఆయన రచించిన పాటలతో.
‘అవును ఈ జీవితమంతా ఒక నాటకం. అయితే మానవ జీవితంలో తమ పాత్రలలో కడదాకా జీవించేవారు భార్యాభర్తలు మాత్రమే అని ఎంత మందికి తెలుసు ? ఇంకా ఎన్నాళ్ళు జీవించాలి ఈ ఒంటరి జీవితం?’ మూర్తి ఆలోచనలు అవధులు దాటి ఎటో పయనిస్తున్నాయి.✍️
– కాకరపర్తి భగవాన్ కృష్ణ.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి