22, ఏప్రిల్ 2022, శుక్రవారం

ప్రకృతి హితమే ప్రజాహితం

 హరిఃఓం   ,                           -                                               -                                                  -        ప్రకృతి హితమే ప్రజాహితం


సృష్టిలో మనిషి మాత్రమేకాక అతడి చుట్టూ విస్తారమైన ప్రకృతి ఉంది. ఈ ప్రకృతికి మనిషికి పరస్పరం సంబంధం ఉంది. 

         ఈ అనుబంధాన్ని విస్మరిస్తే మనిషికే ప్రమాదం.

         కాళిదాస మహాకవి 'అభిజ్ఞాన శాకున్తలమ్' నాటకంలో 'భరతవాక్యంగా' దుష్యంతునిచే పలికించిన వాక్యాలలో మొదటి వాక్యం. 

          "ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః" 'పాలకులు ప్రకృతి హితం కోసమే ప్రవర్తించాలి' అని ఈ వాక్యార్థం. ప్రపంచ దేశాలన్నీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పాలించేవారు కేవలం ప్రజల హితాన్నే కాదు, ప్రకృతి హితాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రకృతి హితం పైనే ప్రజాహితం ఆధారపడి ఉంది.

           అంతేగానీ ప్రకృతిని క్షోభపెడితే క్రమంగా అది మనిషి మనుగడనే దెబ్బతీస్తుందని మహర్షులు పలువిధాల బోధించారు. ప్రకృతిలో మనం అంతర్భాగం. అంతేగానీ ఆధిపత్యం వహించేవారం కాదు. ప్రకృతిని (జగన్మాతగా) మాతృ భావనతో ఆరాధించే సంప్రదాయం మనది.

            ఉదయాన్నే నిద్రలేస్తూనే- భూమికి నమస్కరించి పక్క దిగమన్నారు పూర్వీకులు.

           సముద్రవసనే దేవి! పర్వతస్తన మండలే 

          విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే||

          "అమ్మా! భూదేవి! సముద్రాన్నే వస్త్రంగా పర్వతాలను వక్షస్థలంగా కలిగిన తల్లీ! విశ్వవ్యాపకుడైన భగవంతుని శక్తివి నీవు! నా పాదాలతాకిడిని క్షమించుమమ్మా" అని ప్రార్థించి అడుగువేస్తాం. ప్రకృతితో ఇంత సున్నితమైన సంబంధాన్నీ ఆత్మీయతనీ అభివృద్ధి చేసుకున్న గొప్పనాగరికత మనది.

           ఉదయించే సూర్యతేజాన్ని జడపదార్థంగా కాక 'శక్తి ప్రదాత' అయిన భగవంతునిగా అర్చిస్తాం. ప్రవహించే నదులను దేవతామాతృకలుగా పూజించి, ఆ జలాలను పవిత్రంగా పానం చేస్తాం, అందులో స్నానం చేస్తాం.

          నలుగురూ వాడే తటాకాలను, నదులను బావులను ఏమాత్రమూ కలుషితం చేయవద్దని వేద మంత్రాలు శాసించాయి. 

           "న నిష్టీవనం కుర్యాత్ న మూత్రపురీషం కుర్యాత్" - నీటిలో ఉమ్మరాదు. మలమూత్రాలను విడువ రాదు... అది మహాపాతకం అని హెచ్చరించాయి. కానీ మనం పెడచెవిన పెడుతున్నాం. పవిత్రనదీ స్నానఘట్టాలలో అన్ని కాలుష్యాలనూ నింపుతున్నాం. దానికి తోడు పరిశ్రమలు విషతుల్యమైన నిలవల్ని వదులుతున్నాయి.

           వృక్షాలను కూడా దేవతలుగా ఆరాధించే పరంపర మనది. వృక్ష సూక్తాలు వేదవాఙ్మయంలో దర్శనమిస్తాయి. యజ్ఞానికి వాడే సమిధల్ని సైతం ఎండిన వాటినే వాడాలిగానీ, పచ్చిగా ఉన్న వాటిని ఖండించరాదని శాసించారు. పూజకి తులసీదళాలనీ, మారేడు దళాలనీ, పువ్వుల్నీ కోసేటపుడు కూడా కొన్ని నియమాలు చెప్పారు. ముందుగా వృక్షాన్ని నమస్కరించి, దేవతాప్రీతికై దళాలను, కుసుమాలను ప్రసాదించవలసిందిగా ప్రార్థించాలి. ఆపై గోరు తగలకుండా వేలి కొసలతో మాత్రమే వాటిని (కోయాలి) తీయాలి. 

          దళాలనైతే ఏకాదశి, పూర్ణిమ, శుక్రవారం, అమావాస్య వంటి తిథులలో దినాలలో కోయరాదు. ఆ కోసేటప్పుడు కూడా కొమ్మలు విరగకుండా ఏరు కోవాలి అంటూ చాలా పద్ధతుల్ని పెట్టారు. దీని ద్వారా కూడా ప్రకృతి పరిరక్షణలో ఎంతటి బాధ్యతను గుర్తుచేశారో గమనించాలి. మన అవసరార్థం ప్రకృతిని వినియోగించుకున్నా ఏమాత్రం నాశనం లేకుండా ఎంతో అనుబంధంతో వ్యవహరించడం ఈ సంస్కృతి ప్రత్యేకత.

          పంట పండించేముందు భూమినీ, పండిన తరువాత పంటనీ కూడా గౌరవిస్తాం. ప్రకృతిలో ప్రతి పదార్థాన్నీ ప్రాణవంతంగా చూసే దృష్టి ఇది. అంతేగానీ ప్రకృతిని జడపదార్థంగా భావించరాదు. అలాగే ప్రాణికోటిని ప్రేమించే స్వభావం.

        'శాకున్తలమ్'లో శకున్తల వృక్షాలను పెంచిన తీరు, కణ్వుడు అమ్మాయిని అత్తవారింటికి పంపుతూ వన దేవతలను నమస్కరించిన విధం గమనిస్తే అవి కేవలం కవితాకల్పనలుగా కాక, మనిషి బాధ్యతలను బోధిస్తాయి.

           రామాయణంలో శ్రీరాముడు, సీత జాడకోసం చెట్టునీ, పుట్టలనీ పలకరించడం, భాషించడం కనిపిస్తుంది. 

           సీతమ్మ గంగనీ, గోదావరినీ నమస్కరించి మొక్కులు సమర్పించుకుంటుంది. పురాణాల్లో వనదేవతల గురించి చెబుతారు. ఒక వృక్షాన్ని నరికితే వనదేవత ఆగ్రహిస్తుందని, అనవసరంగా వృక్షాలు నరకరాదని హెచ్చరించారు. తప్పనిసరై చెట్టుని నరకవలసివస్తే చాలా ప్రాయశ్చిత్తాలు చెప్పారు.

           వనదేవతలూ, జలదేవతలూ, భూదేవతలూ.... ఇలా ఆరాధించే మనవారి ఔన్నత్యాన్ని అర్థం చేసుకొంటే జోహరులర్పిస్తాం. ఆ ఈ లోతును గ్రహించకుండా వీటిని మూఢనమ్మకాల కింద జమకట్టడం ఒక మూఢత్వం. ప్రకృతితో కలిసి బతకడం, ఆత్మీయతాబంధం ఏర్పరచుకోవడం తద్వారా ప్రకృతికీ ఒక ఆత్మఉందనీ, ఆ ఆత్మ మన మనసును గమనించి ఒక తల్లిలా మనల్ని కాపాడుతుందని భావించడం అసలైన మానవత్వానికి నిదర్శనం.

           నేల పచ్చదనంలో, నీటి చల్లదనంలో భగవానుని కరుణని దర్శించిన ధర్మస్పృహలో ఎంత ఉదాత్తత ఉంది!

          ఈ వారసత్వాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే భారతీయ భావనావైభవం సాక్షాత్కరిస్తుంది. పాలకులు, ప్రజలు కూడా ప్రకృతి హితాన్ని పాటించినప్పుడు ఈ కరవు కాటకాలు అసలు తలెత్తుతాయా? ..........             🙏.....

కామెంట్‌లు లేవు: