🌹 *రామాయణానుభవం_ 111*
జాంబవంతుని మాటలతో నిజబలాన్ని గుర్తించిన హనుమ తన రూపాన్ని అంతకంతకు అధికం చేసికోసాగాడు. మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచిన త్రివిక్రముని ఆనాడు సురులు, భూసురులు ప్రస్తుతించినట్లు సముద్రాన్ని లంఘించడానికి పెరిగి పోతున్న హనుమ మహారూపాన్ని చూచి వానరులు సంభ్రమాశ్చర్యాలతో
స్తుతింప సాగారు.
గిరి గుహలో కేసరి తన శరీరాన్ని విస్తరింపజేసినట్లు హనుమ విజృంభింపసాగాడు. ఆయన ముఖము కాలిన పెనమువలె ఎఱ్ఱ బడింది. ఉత్సాహంతో ఆయన దేహంలోని వెంట్రుకలు నిక్కబొడుచుకొన్నాయి.
హనుమ ఒక్కసారి లేచి వానర వీరులకు నమస్కరించి నిలుచున్నాడు. ఆయన తన శక్తి సామర్ధ్యాల గురించి వారికి వివరింపసాగాడు.
అప్రమేయ బలసంపన్నుడు, అగ్నిహోత్ర మిత్రుడైన మా తండ్రి వాయుదేవుడు తన వేగంతో మహా పర్వత శిఖరాలను బంతులవలె ఎగర గొట్టగల్గుతాడు. గమనం లో ఆయనకు సాటి లేరు.
నేను వాయుదేవుని ఔరసపుత్రుడను. ఆయన ప్రసాదమువలన నేను కూడ మహావిస్తీర్ణమైన ఆకాశము యొక్క ఆద్యంతాలను స్పృశింపగలను. మేరు పర్వతాన్ని - ఆగకుండా మూడు మారులు పరిక్రమించగలను. నా బాహుబలానికి సముద్రము అల్లకల్లోలమై సమస్త పృథివీతలాన్ని జలమయం చేస్తుంది. జలచరాలన్ని నా తొడల పిక్కల రాపిడికి ఉవ్వెత్తుగా ఎగిరి పడుతాయి.
మహానుభావుడు, అమిత సత్వ సంపన్నుడైన గరుత్మంతునికి నేను వేలసార్లు ప్రదక్షిణం చేయగలను. సూర్య భగవానుడు ఉదయాద్రి నుండి బయలుదేరి అస్తమయాద్రికి పయనించేలోపు నేను ఆయనకంటే ముందుగా పయనించి తిరిగి వచ్చి ఉదయాచలాన్ని చేరగలను.
నా పరాక్రమంతో సముద్ర జలాన్ని ఎండింపగలను. భూమిని బ్రద్దలు చేస్తాను. మేఘాలను చిందరవందర చేస్తాను. నేను ఆకాశంలో ఎగిరేవేళ పర్వతాలపై ఉన్న వృక్షాలు లతలు, పుష్పాలు తమ నాయకుని అనుసరించే అనుచరులలాగా నన్ను అనుసరిస్తాయి. ఆకాశాన్ని మ్రింగేలా వెళ్లుతున్న నన్ను చూచి సకల భూతాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోతాయి.
ప్రశస్తమైన నా బుద్ధిబలంతో లంకలో ప్రవేశించి సీతాదేవిని తప్పక చూచి రాగలను. వజ్రాయుధుడైన మహేంద్రుని ఎదిరించి అమృతాన్ని లాగుకొని రాగలను. లంకను పెకిలించి తీసికవచ్చి రాముని పాదాలముందు ఉంచగలను". ఈ విధంగా వానర వీరులు భయాందోళనలు తొలిగి పోయేలా పరాక్రమ సంపన్నుడై గర్జిస్తున్న హనుమను చూచి వానర వీరులు హర్షపరవశులయ్యారు.
వృద్ధుడు, బుద్ధిమదగ్రేసరుడైన జాంబవంతుడు హనుమ ఉత్సాహపరాక్రమాలకు సంతోష భరితుడయ్యాడు.
ఆయన హనుమకు కార్య సిద్ధి కలిగేలా శుభాశీర్వచనాలను పలికాడు. తదితర వానర వీరులకు ప్రణమిల్లి వారి మంగళాశాసనాలతో ముందడుగు వేయుమని ఉపదేశించాడు.
హనుమ తన సముద్రలంఘన వేగాన్ని భూమి భరింపజాలక బద్దలవుతుందని అందువలన సుస్థిరములైన మహేంద్ర పర్వత శిఖరాలనుండి సముద్ర లంఘనం చేస్తానని తెలిపి, ఆగిరి శిఖరాన్ని అధిరోహించాడు.
ఆ పర్వత శిఖరాన్ని తన పాద బలంతో అదిమి పట్టాడు. అప్పుడు ఆ పీడనానికి మృగాలు, మాతంగాలు భయపడ సాగాయి. కన్నముల నుండి సగము పైకి వచ్చిన భుజంగాలు విజయ పతకాలవలె శోభిల్లాయి.
మనస్సులో మహోత్సాహాన్ని, శరీరంలో మహావేగాన్ని నింపుకొన్న శత్రుహంత అయిన హనుమ సముద్రాన్ని దాటి లంకలో చేరడానికి సన్నద్ధుడయ్యాడు.
*స వేగవాన్ వేగసమాహితాత్మా హరిప్రవీరః పరవీరహంతా,*
*మన స్సమాధాయ మహానుభావో జగామ లంకాం మనసా మనస్వీ.*
మహావేగము కలవాడు, అట్లు వేగముగ పోవుటయం దాసక్తి కలవాడు, శత్రువీరులను సంహరించువాడు, వానరులలో మేటి, కార్యసాధనకై దృఢ నిశ్చయము కల ఉత్తమ మనస్సుతో కూడిన హనుమంతుడు మనస్సులో సముద్రము దాట నిశ్చయించి, మనస్సుచే అప్పుడే లంకను చేరెను.
ఆయన కంటే ముందే ఆయన మనస్సు లంకవైపు పరుగులు తీసింది.
_కిష్కింధా కాండ సమాప్తం._
*జై శ్రీ రామ్*
**
*సుందరకాండ ప్రారంభం*
శ్రీమద్రామాయణంలో ఇది వరకు గడచిన "బాలకాండ" శ్రీరామచంద్ర స్వామి బాల్యాన్ని సీతాకల్యాణం వరకు తెలిపింది. “అయోధ్య”, “అరణ్య”, “కిష్కింధ” కాండలు స్వామి నివసించిన స్థలాలను వివరిస్తున్నాయి.
అలాగే రాబోయే "యుద్ధకాండ” ప్రధానంగా “రామరావణయుద్ధాన్ని” వివరిస్తుంది. “ఉత్తరకాండ” శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేకానంతరము (ఉత్తర = పట్టభిషేకము తరువాత) జరిగిన సీతావనవాసము, లవకుశ జననము, అశ్వమేధయాగము, సీతాదేవి భూప్రవేశము మొదలైన సంఘటనలను తెలుపుతుంది. ఇందులో "సీతాయాశ్చరితం మహత్" అని సీతాదేవి చరిత్ర అధికంగా ఉంటుంది.
ఈ సుందరకాండ మిగిలిన అన్ని కాండలకంటే విలక్షణమైంది. నిజంగా ఇందులో శ్రీరామునికి సూటిగా సంబంధము కల చరిత్ర చాల తక్కువ. సీతాదేవి చరిత్ర కొంత ఎక్కువ. అయితే వీరి ఇద్దరి కంటే ఆద్యంతములలో కూడ హనుమకు సంబంధించిన చరిత్ర నిండుగా ఉంటుంది.
అటువంటప్పుడు ఈ కాండకు “హనుమత్కాండ” అని పేరు పెట్టవచ్చు కదా! మరి వాల్మీకి కవీంద్రుడు హనుమ పేరును ఈ కాండకు ఎందుకు పెట్టలేదు?
హనుమ అత్యంత వినయ సంపన్నుడు. రాముడు తనను దూతగా పంపడం, తాను సముద్రం దాటి లంకలో సీతాదేవిని సందర్శించి ఆమెను ఓదార్చడం, రాక్షస సైన్యాన్ని వధించడం, సీతాక్షేమవార్తను శ్రీరామునికి తెలియజేయడం మొదలైన అద్భుత కార్యాలను తాను నిర్వహించినా, వీటన్నిటికి కారణము తన గొప్పదనమని హనుమ ఎన్నడు అనుకోలేదు. వీటన్నిటికి “తన పేరు” వాడు కోవడం ఆయనకు ఎంత మాత్రము ఇష్టము లేదు.
ఈ కాండకు తన పేరుతో “హనుమత్కాండ” అని పేరు పెట్టడం తనకేమాత్రము ఇష్టము లేదని వాల్మీకి మునీంద్రుని కలలో కనబడి హనుమ చెప్పాడని పురాణాంతరాలలో ఒక కథ ఉంది. ఆ కథ నిజమో, కాదో తెలియదు. కాని హనుమ స్వభావము మాత్రము ("స్వోత్కర్ష"ను) తన గొప్పదనాన్ని ప్రకటించుకోవడానికి విరుద్ధమని అందరికి తెలిసిందే.
"యధా రాఘవ నిర్ముక్తః శరః" అని తనను రాఘవుడు ప్రయోగించిన బాణంగా (రాముని పనిముట్టుగా) హనుమ భావించాడు.
బ్రహ్మ వరప్రసాదంగా ("సర్వంతేవిదితంభవతి” అని) అన్ని తెలిసిన వాల్మీకి మహర్షి హనుమ స్వభావాన్ని గుర్తించినందువలన ఈ కాండకు "హనుమత్కాండ" అని నామకరణం చేయలేదు. అయితే ఈ కాండను హనుమంతుని పేరు నుండి వేరు చేయడం కూడ వాల్మీకి మునీంద్రుని ఇష్టం కాదు. హనుమ పేరును సూటిగా పెట్టవద్దు. కాని “హనుమ” అనే అర్ధము వచ్చేట్లుగా పేరు పెట్టాలి.
"సుందరో, వానరః కపిః” అని “సుందరుడు”, “వానరుడు”, “కపి” అనే పదాలు హనుమను సూచిస్తాయి. మిగిలిన పదాల కంటే “సుందరుడు” అనే పేరు బాగుంటుందని వాల్మీకి కవీంద్రుడు అనుకొని ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టాడు.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి