31, మే 2024, శుక్రవారం

సభాయై నమః*

 *సభాయై నమః*


మీరందరూ పెక్కు చోట్ల పై సంబోధనలను వినే ఉంటారు. అంటే సభను గౌరవించడం అన్నమాట, అక్కడ సమీకరింపబడిన సమాజంలో గొప్ప హోదా కలిగిన వ్యక్తులకు సభాముఖంగా నమస్సులు అందించడం అన్నట్టు. ఈ లెక్కన అక్కడ - అంటే ఓ బహిరంగ సభ కావొచ్చు లేదా మనలాంటి వాట్సప్పు సమూహాలు కావొచ్చు - ప్రోగయిన వ్యక్తులందరూ గౌరవింపదగిన వారే. దీనిలో ఎంతమాత్రం సందేహం లేదు. వారు వ్యక్తిగతంగా ఎలాగైనా మసలుకొని ఉందురు గాక, కాని సభా ముఖంగా అందరూ గౌరవింపదగిన వారే. సభనుద్దేశించి అందరినీ గౌరవించవలసినదే. అందుకే పెద్ద పెద్ద వేద పండితుల దగ్గర నుండి ఎంతటి పండితులైనా *సభాయైనమః* అంటూ సభకు సమస్కరిస్తారు. 


సభ అంటే అది సరస్వతీ స్వరూపమని లోకవిదితము. సభలో విద్వాంసులు ఉంటారు. పామరులూ ఉంటారు. పెద్దలు, పిన్నలూ అందరూ ఉంటారు. ఎవరి గొప్పలు, ఎవరి హోదాలు, ఎవరి విద్యానైపుణ్యాలు, ఎవరి వృత్తి సాంకేతిక పరిజ్ఞానాలు వారివే. ఎవ్వరూ ఎవరికీ పోల్చదగినవారు కారు, కించపరచడం అంతకన్నా కాదు. 


ఏమో, కొందరికి అందులో కొందరు నమస్కారార్హులు కాకపోవచ్చునని అనిపించవచ్చు. కాని అది నిండు సభ.  ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు. అది సంస్కారవంతుల లక్షణం కాదు. ఏమైనా లోటుపాట్లు ఉన్న యెడల ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కాని సభాముఖంగా కాదు. ఈ అలవాటు ఓ గొప్ప సంస్కృతి. గొప్ప సంప్రదాయం. 


ఒకవేళ ఎవరైనా ఇతరులను కించపరచినట్లయితే వారి వంశావళిలో లోపమున్నట్టే. యథా రాజా తథా ప్రజా అనే నానుడి ప్రకారం వారి తల్లిదండ్రులు తాతముత్తాతలు ఇలాంటి సభా గౌరవాలను సన్నిహిత స్నేహ బంధుత్వాలతో అలాగే మెలిగారు కాబోలు. అలాంటి సంస్కారమే వారి సంతతులకు కూడా అబ్బడం అతిశయోక్తి కాదు. జన్యుపరమైన బాంధవ్యాలలో ఇలాంటి ఒకేలాంటి ప్రవృత్తులు కలిగియుండడం సమంజసమే. 


ఏది ఏమైనా సభను గౌరవించడం నేర్చుకోవాలి. అలా వీలుకాని పక్షంలో ఆ సభ నుండి నిష్క్రమించడం ఉత్తమం.

కామెంట్‌లు లేవు: