31, మే 2024, శుక్రవారం

యిపుడా శిల్పులు

 పెనుగొండ లక్ష్మి!


          సీ:  గండపెండేరంబు  ఘల్లు ఘల్లు మన  దాన


                                 ముల తోడ  దేశాక్షి  బలుకు నాఁడు ;


              సులతాను లెల్ల  దలలు వంచి కల్కి తు


                                 రాయీల  నిను  బూజ సేయునాఁడు ;


               ఆదివరాహ  ధ్వజాంతరంబులనీడ


                                  నీకీర్తి  సుఖముఁ బండించునాఁడు ;


             గుహల  లోపల దూరికొన్న  యాగజపతి


                                               తలపైని  నీకత్తి  గులుకు నాఁడు;


      గీ:   నీదు కన్నుల వెలిఁజూపు  నీడ లోన  


             చీమయును హాయిగా నిద్రఁ జెందునాఁడు;


             గలుగు నాంధ్రుల  భాగసాకల్య గరిమ


              బూడిదనుబడి  నీతోడ బోయె  దల్లి!


     


   మ:  ఉలిచే రాలకు  జక్కిలింతలిడి  యాయు ష్ప్రాణముల్వోయు  శి


               ల్పుల మాధుర్య  కళాప్రపంచన  లయంబున్ జెందె ,పాతాళమున్


                గలసెన్  బూర్వ కవిత్వ వాసనలు , నుగ్గైపోయె  నాంధ్రావనీ


                తల మంబా! యిక లేవ యాంధ్రులకు  రక్తంబందు  మాహాత్మ్యముల్;


                      పెనుగొండ లక్ష్మి--- సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు!


                               పాండిత్యం కవిత్వం కలిపి ఆపోసనంగొన్న అగస్త్యునిగా, డా సి నా రె ప్రశంసల నందుకొన్న నారాయణనాచార్య

రాయలసీమలోప్రభవించిన అనర్ఘకవితారత్నం! శతాధిక  గ్రంధకర్తలైన వీరికృతుల్లో  చిన్ననాట రచించిన పెనుగొండ లక్ష్మి, షాజీ , శివతాండవము  మొదలగు కృతులు  జగత్ప్రసిధ్ధములు. 


                               వీరు ద్వాదశ వర్షప్రాయులైయున్నప్పుడే  కవితారచనకు గడంగి  విజయ నగర రాజుల రాజ్యవైభవమును సూచించు పెనుగొండ లక్ష్మిని రచించినారు. పైపద్యములు రెండును ఆకావ్యములోనివియే! వేసవి విడిదిగా రాయలు పెనుగొండదుర్గమునకు వచ్చెడు వాడట. నాటివైభవమంతయు కనులకు గట్టునట్లుగా సీసపద్యమును ,నాటి శిల్పవైభవమునకు

దిక్సూచిగా  మత్తేభమును రచించినారు.


                        మత్తేభమున కవి తన నైపుణ్యమునంతను ప్రదర్శించినారు. " శిల్పులు ఉలిచే రాలకు చక్కిలిగింతలుపెట్టి , వాటికి  

ఆయువును ప్రాణమును బోసెడివారట. ఏరి యిపుడా శిల్పులు? .ఏవి ఆశిల్పములు? మధురాతిమధురమైన తమకవితలతో మహనీయమైన కావ్యములల్లిన ఆకవులేరీ? ఇపుడాకవిత్వమేది? బూడిదలోకలసినవి. ఇక నటువంటి వైభవమును చవిచూచు భాగ్యము ఆంధ్రులకు రాదా? యనివాపోవుచున్నారు.


                           1926 సం: ప్రాంతమున రచించిన యీకావ్యము , షాజీ యను వీరి మరోకావ్యము  ముద్రణకు నోచుకొన్నవి. అంతేగాదు,ప్రభుత్వముచే పాఠ్యగ్రంధములుగా నెన్నుకొన బడినవి. కాబట్టి వారిని గురించి యధికముగా జెప్పవలసినదేమున్నది?

కానీ యామహనీయునకు దక్కవలసినంత గౌరవము దక్కకపోయెను. అదియేమావంటివారికి విచారము. 


                


                   

                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: