31, మే 2024, శుక్రవారం

హనుమంతుని తోకకథ*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


*హనుమంతుని తోకకథ*


*జూన్ 1 శనివారం హనుమజ్జయంతి సందర్భంగా...*


శివపరమాత్మకు ఎప్పటినుండో శ్రీహరి పాదసేవ చెయ్యాలని కోరిక. కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుణ్ణి పుట్టించాడు. వాడు అచ్చు గాడిదలా అరుస్తాడు కనుక, 'గార్ధభ నిస్వనుడని పేరు. వాడు శివునికోసం తపం చేశాడు. స్వామి వరం కోరుకో అన్నాడు. వాడు, "నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చని పోవాల"ని కోరాడు. అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం అది. శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు.


ఆ వరంతో వాడు పదిమంది కలిసిన చోటుకి వెళ్లి అరవడం మొదలు పెట్టాడు. అలా జనాలను వాడు ఖాళీ చేసేస్తున్నాడు. అందరూ బ్రహ్మతో కలిసి, హరి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అతడు, 'మనం ఏమి చేయకూడదు. వాడు శివభక్తుడు కదా! శివుడే పరిష్కరించాల'ని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్లారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్లి హరిని ఆలింగనం చేసుకొన్నాడు. అపుడు హరి అన్నాడు.


"మిత్రమా! నీ భక్తుడు గార్ధభ నిస్వనుడు అందరినీ చంపేస్తున్నాడు. నువ్వే వాణ్ణి శిక్షించాలి". అన్నాడు. దానికి శివుడు, "నా భక్తుడు అంటున్నారు కదా! నేనెలా చంపుతాను?" అన్నాడు. ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేదు. దానితో హరి కోపించి, "అలాగైతే. నేనే చంపవలసి వస్తుంది" అన్నాడు. హరుడు కోపంతో "అయితే ఇంకేం? వెళ్లి ఆ పని చూసుకోండి" అన్నాడు. దానికి హరి. “నీపట్ల గౌరవం కొద్దీ వచ్చాం. నేను చంపలేక కాదు" అన్నాడు. దానికి హరుడు మరింత కృతక కోపంతో, "నువ్వే కనుక నా భక్తుణ్ణి చంప గలిగితే నీకాళ్లు కడిగి నెత్తిపై జల్లుకొని నీకు దాస్యం చేస్తాను. నువ్వు చెయ్యలేక పోతే నా కాళ్ళు పట్టుకొంటావా?" అన్నాడు రెచ్చకొడుతూ. హరి 'సరే' అన్నాడు. హరి చంపగలడని శివునికి తెలుసు. హరి ఇన్నాళ్లకు శివ మాయలో పడ్డాడు. వెంటనే శివుడు, "ఇదిగో దేవతలారా। ఓ బ్రహ్మా! మీరంతా సాక్ష్యం సుమా!" అని ఆ ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్లి పోయారు. ఏమైనా ఆరాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి, ఆ రాక్షసుని వెనుకే వెళ్లి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో... వాడు అరవలేక చనిపోయాడు. మరుక్షణం శివుడు కమండులువుతో సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి... అది శివమాయ అని. కాళ్లు కడగపోతే హరి దూరంగా జరిగాడు. వెంటనే శివుడు బ్రహ్మాదులని పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇక తప్పలేదు. హరికి. శివుడు సంతోషంగా హరి పాదాలు కడిగి నెత్తిపై చల్లుకొన్నాడు. నేటినుండి నీకు దాసుణ్ణి అన్నాడు. వెంటనే హరి, "ఇప్పుడు కాదు. శివా వచ్చే నా రామావతారంలో దాస్యం చేద్దువు" అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే | పరిమితం చేశాడు. వెంటనే పార్వతి, "హరీ! నేను వారి అర్ధదేహాన్ని. కనుక నేనూ నీ దాసురాలిని అవుతాను" అంది. అపుడు హరి, "సోదరీ కాత్యాయనీ! నువ్వు పందెం వేయలేదు. శివుడు నిన్ను పందెంలో ఒడ్డలేదు. కనుక నువ్వు చెయ్యడానికి వీలు లేద"న్నాడు హరి. దానికి పార్వతి, "సోదరా! నేను ఆయన్ని వీడి ఉండను కదా!" అన్నది. అపుడు హరి, "సరే! నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు" అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు వాలం కల వానరంగా అవతరించాడు. హనుమ సర్వ శక్తులూ తోకలోనే ఉంటాయి. అది మహాశక్తి... పార్వతి


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: