12, సెప్టెంబర్ 2024, గురువారం

పూజల్లో రాగిపాత్ర

 పూజల్లో రాగిపాత్రల విశిష్టత

-- విభాతమిత్ర( జనార్దన శర్మ)



నేను మొన్న పూజల్లో రాగి పాత్రలు మాత్రమే వాడాలి, వెండి వాడకూడదు అని చెప్పాను.  అది వాయు పురాణములో ఉంది అని కూడా చెప్పాను. 

తర్వాత, ఇంకా గ్రంధాలు పరిశీలించగా,  ఇంకా కొన్ని పురాణాలలో రాగి పాత్రల వైశిష్ట్యత వివరించబడింది అని తెలిసింది. కాని నేను పరిశీలించిన గ్రంధాలు మూల సంస్కృత గ్రంధాలు కావు. ఎవరో తర్జుమా చేసి, సంక్షిప్తము చేసి వ్రాసినవి.  వీటి మూల సంస్కృత గ్రంధాలు ఒకటి రెండు చూశాను గాని, అవి వేల పేజీలు ఉన్నాయి. కొన్నిటికి విషయ సూచిక లేదు. 

అయితే, ఇప్పటికి నాకు తెలిసిన సమాచారము ప్రకారము, కింది పురాణాలు రాగిపాత్రల విశిష్టతను తెలుపుతున్నాయి

.

అగ్ని పురాణము-- [ ౨౧౫ అధ్యాయము, పదవ శ్లోకము ] లో 

యజ్ఞాలలో రాగి పాత్రల ప్రాశస్త్యము, దానివల్ల ఆధ్యాత్మిక శక్తుల అభివృద్ధి వంటివి వివరించబడినాయి

భవిష్య పురాణము--[ ౧౪౩ అధ్యాయము, ౧౫ వ స్లోకము ] 

దేవతా పూజలో రాగిపాత్రలను వాడితే అది ఆయా దేవతలను సంతృప్తి పరచును అని చెపుతుంది

గరుడ పురాణము --[ ౧౨౫ అధ్యాయము, ౨౦ వ శ్లోకము ]

భగవదారాధనలో రాగి పాత్రలు వాడుట వలన మనసును, ఆత్మను శుద్ధి చేస్తుంది అని వివరిస్తుంది

మత్స్య పురాణము--[౨౪౫ అధ్యాయము, ౧౦ వ శ్లోకము ]

క్రతువులలో రాగి పాత్రలు ఉపయోగించుట యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది, దాని వల్ల, ఆధ్యాత్మిక అభివృద్ధి, మరియు సకల సంపదలు కలిగిస్తుంది 

స్కాంద పురాణము --[ ౯౮ వ అధ్యాయము, ౨౫ వ శ్లోకము ]

రాగిపాత్రలు శుభ ప్రదమైనవి, వాటిని పూజల్లో వాదుట వలన సకారాత్మక శక్తులు విజృంభిస్తాయి అని తెలుపుతుంది.

వరాహ పురాణము--[౧౪౩ అధ్యాయము, ౧౭ వ శ్లోకము ]

// తామ్ర భాజనే యజేత్ దేవన్, న రజతం, న కాంఅమయే //

అనగా,  దేవతలను పూజించునపుడు రాగిపాత్రలను మాత్రమే ఉపయోగించవలెను, వెండి, బంగారు పాత్రలు కాదు --అని.

// తామ్ర పాత్ర ప్రదీపశ్చ, న రజతం, న కాంస్యం //

పూజలు చేసేటప్పుడు, రాగి పాత్రలు, దీపాలు మాత్రమే వాడాలి, వెండి, కంచు వి కాదు.

ఈశ్లోకము వాల్మీకి రామాయణములో అరణ్య కాండలో ఉందని కొందరన్నారు. నాకైతే కనపడలేదు. ఇంకే కాండలోనైనా ఉందేమో. 

గరుడ పురాణం లో ఉన్నది పదహారు అధ్యాయాలే. 

అయితే, ఈ శ్లోకాలు కాని, ఉటంకింపులు కాని, అన్ని గ్రంధాలలో ఉండవు. మూల గ్రంధాలను ఆసాంతమూ అనువాదము చేసిన పుస్తకాల్లో కానీ, మూల సంస్కృత గ్రంధాలలోనైనా కానీ ఉంటాయి. అయితే , అధ్యాయాలు, శ్లోకాల సంఖ్యలు సరిగా ఉన్నాయని చెప్పలేము, ఎందుకంటే నేను పరిశీలించినవాటిలో ఆ సంఖ్యల్లో ఆ శ్లోకాలు లేవు. వేల పేజీలు ఉండటము, విషయసూచికలు లేకపోవడము వల్ల  కనుక్కోవడము అంత సులభము కాదు. 

[ మొత్తానికి ఏ ఐ, మెటా లను నమ్మితే అధోగతే. ]

అగ్ని పురాణము ప్రకారము, కుమార స్వామి వీర్యము భూమిపై పడగా అది రాగి [ తామ్రము ] గా మారింది.  దానికి అభివృద్ధినొందించే గుణము ఉంది కాబట్టి తామ్రము పూజల్లో సర్వ శ్రేష్టము--అని లోక విఖ్యాతి పొందినది.

ఇక, వెండి ని పూజల్లో ఎందుకు వాడకూడదు--అనుదానికి సమాధానము తైత్తిరీయ సంహిత లోని ప్రథమ కాండలోని పంచమ ప్రశ్నలో ఉంది.

 // దేవాసురాస్సంయత్తా ఆసన్..// అనే అనువాకములో ఇలాగుంది

దేవతలు, అసురులు చేసిన యుద్ధములో  దేవతలు గెలిచి, దానవులనుండి గెలుచుకొన్న శ్రేష్టమైన ధనము [ అది అమృతము కావచ్చు, సోమము కావచ్చు, బంగారము కావచ్చు] అగ్నిలో ఉంచినారు. అగ్ని ఆ ధనము తనదే అని అనుకొని స్వీకరించినాడు. దేవతలు అగ్నిలో తమ ధనాన్ని ఎందుకు పెట్టారంటే, ’ఒకవేళ తరువాతి యుద్ధములో తాము ఓడిపోతే , తాము గెలుచుకొన్న ధనము సురక్షితముగా ఉంటుంది అని. [ తదగ్నిర్న్యకామయత , తేనాపాక్రామత్ ]  అగ్ని ఆ ధనము తనదిగా చేసుకొని, దేవతల నుండీ దూరముగా వెళ్ళిపోయినాడు. అదృష్టవశాత్తూ తరువాతి యుద్ధములో దేవతలు మరలా గెలిచినారు. తమ ధనాన్ని తిరిగి తీసుకోవడానికి అగ్ని వెంట పడినారు. వెంట పడి తమ ధనాన్ని బలవంతంగా లాక్కోవటానికి ప్రయత్నించారు.  దానితో అగ్ని ఏడ్చినాడు. అగ్ని ఏడ్చుట వలన అతడి కన్నీరు భూమిపై పడి, వెండి గా మారింది. 

ఏ కారణము చేత అగ్ని రోదించాడో, ఆ కారణము వలన అగ్నికి రుద్ర రూపము కలిగింది[ అగ్నికి రుద్రుడు అని మరో పేరు రుద్రోవా ఏష యదగ్నిః ] అని మంత్రము] 

అగ్ని కన్నీరు వల్ల పుట్టినది కాబట్టి వెండి కి యజ్ఞములలో దక్షిణ గా ఇవ్వబడే అర్హత పోయింది. యజ్ఞము చేసిన యజమాని గనక వెండిని దక్షిణ గా ఇస్తే, ఒక సంవత్సరం లోపలే ఆ యజమాని ఇంటిలో  రోదనకరమైన అనర్థాలు జరిగి ఆ యింటివారు రోదిస్తారు.  కాబట్టి వెండిని ఎన్నడూ దక్షిణగా ఇవ్వరాదు. రోదించడము వలన పుట్టినది కాబట్టి, వెండిని పూజల్లో వాడటము కూడా అనర్హముగా భావించడము మొదలైంది.

 అగ్ని కథ ఇంకా ముందుకు వెళ్ళి, ఆ ధనములో మొదట నాకు భాగము రావాలి, తర్వాతే మీకు --అని షరతు పెడితే దేవతలు ఒప్పుకుంటారు. అందుకే యజ్ఞములు, హోమములు ఏవి చేసినా మొదట పునరాధానము చేయునది. ఆ పునరాధానము [ హవిస్సు, లేక సమిధలు ] మొదట చేసి, అగ్నికి సమర్పించి, అటుతర్వాతే తమ ఇష్ట దేవతలకు హవిస్సునిచ్చుట ఆచారమైనది.

కామెంట్‌లు లేవు: