_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 9 వ భాగము*_
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
*తల్లిని జ్ఞాతులకు అప్పజెప్పుట:*
శంకరుని సన్న్యాస వార్త విని కాలడి గ్రామం అంతా ఒక్కసారి గుప్పుమన్నది. ఆర్యాంబకు అండ పోతోందని అంతా బాధ పడ్డారు. “ఎంతటివాడు పుడితేనేమి? పాశాలు త్రెంపుకుని పోతున్నాడు. అందరూ అనుమానిస్తూనే ఉన్నారు. ఏనాడో ఇలా ఉడాయిస్తాడని, అనుకొన్న దంతా అవుతోంది” అని తమలోతాము ఆర్యాంబకు చెప్పుకొంటున్నారు. కాని మరి కొందరు అర్థం చేసికొన్నవారు ధైర్యం మాటలు పలుకుతున్నారు:"ఆర్యాంబా! నీవు ధన్యు రాలవు. మీ వంశానికి అశేష కీర్తి గడించే కొడుకును కన్నావు. మేమంతా నీ హృదయం లో నిండి ఉన్నాం. లోకాన్ని రక్షిస్తోన్న అమ్మవు నువ్వు. నీ సాటి అమ్మ ఏది?' అని కొందరూ, “అమ్మా! వనం లో మొలిచిన మలయజా నివి నీవు. రవిని మించిన తేజస్సు గలవాడు సుతుడు. ఇతడు లోకాలకే వెలుగు” అని మరి కొందరూ, “నీ కుమారుణ్ణి అందరికీ కుమారునిగా చేసావు.శంకరుడు లోక శంకరుడు. లోకాలకు నేడు పండుగ. లోకాలకు జ్ఞాన భాస్కరుడు లభ్యము అయ్యాడు నేడు" అని కొందరు పలు విధాల అభిప్రాయాలు సంతోషాలు వ్యక్తం చేసికొన్నారు. చిద్విలాసంతో ఉన్న శంకరుని చూపులు మిరుమిట్లు గొలుపుతూ చూపరులకు సంభ్రమా శ్చర్యాలు కలగ జేశాయి. అప్పుడు జ్ఞాతుల వంక తిరిగి “లోకానికి సేవ చేయడానికే పుట్టాను. ఆ పుట్టుక నేటితోనే ఆరంభం. కాలడి నిత్య కల్యాణ నిలయం. మా అమ్మ అందరికీ అమ్మగా మీరు చూచు చుండే వారు. మా నాయన ఇచ్చిపోయిన అపార ధనంతో నాకు పని లేదు. మా అమ్మకూ పని లేదు. ఈమె సంగతి తెలియని వారెవ్వరు? ఇలాంటి ఈ అమ్మను మీరు ఎంతో ఆదరిస్తారని నాకు తెలుసును” అంటూ తల్లి రెండు చేతులూ పట్టుకొని జ్ఞాతులకు హస్తగతం చేశాడు బాలశంకరుడు.
*శ్రీ కృష్ణాలయ పునరుద్ధరణ:*
కాలడిలోని తమ ఇంటి ప్రక్కగానే ప్రవహించే పూర్ణానది ప్రక్కన ఆర్యాంబ కట్టించు కొన్న ఆలయంలోని శ్రీకృష్ణుని రోజూ చూచుకొంటూ మురిసిపోతూ వెడుతూ ఉంటుంది. ఒకనాడా పరవళ్ళ సందడిలో ఆలయం ప్రాకారం ప్రవాహపు ధాటికి ఆగలేక పడిపోయింది. ఒకవైపు ఒరిగినది విగ్రహం. ఆ ఆలయం మీద పూచీ ఎవరిది? శంకరునిదని తెలుసును శ్రీకృష్ణుని వారికి. "శంకరా! నీవు ఇల్లువాకిలి వదలి వెళ్ళి పోతున్నావు. ఈ గుడిని ఎవరు పట్టించు కొంటారు?” అన్నట్లుగా ఆకాశవాణి వినబడింది శంకరుని వీనులకు. వెంటనే జాప్యం లేకుండా ఆ ఆలయం బాగుచేయ డానికి తగిన ఏర్పాట్లు కావించాడు.
*శ్రీకృష్ణాలయము ఎప్పటి వలె కళకళలాడుతూంది*
*ఆర్యాంబ బెంగ:*
తనయునితో అంటోంది తల్లి: “నాయనా! నాకు జ్ఞాన బోధ చేశావు. లోకానికి సేవ చేయాలం టున్నావు. దేశం కాని దేశం తిరుగు తావు. వేళకాని వేళలు. వేళకింత అన్నం నీకు ఎవరు పెడతారు? ఎవరాదరిస్తారు? మాటాడితే పెద్దపెద్ద కబుర్లతో కడుపు నింపు తావు. ఎన్నడూ ఎవర్నీ దేహి అని అడిగిన వాడవు కాదు. నీ గురించి బెంగతో నా కడుపు తరుక్కు పోతున్నది”. అమ్మ వేదన విన్న శంకరుడు ఇలా అంటాడు: “అమ్మా! అదా నీ బెంగ! వినలేదా ఈ శ్లోకం?
‘సత్యం మాతా పితా జ్ఞానం
ధర్మం భ్రాతా దయా సఖా
శాంతం పత్నీ క్షమా పుత్రా
షడైతే మమ బాంధవా:’
అమ్మా! నాకు కూడా ఆరుగురు వెంటాడుతూనే ఉంటారు. తల్లీ, తండ్రీ, భ్రాత, సఖుడు,పత్నీ, పుత్రుడు వీళ్ళే పరివారం. వాళ్ళెవళ్ళూ ఎవరికీ కనబడరు. కాని నాలో ఉంటారు. సత్యం తల్లి గాను, జ్ఞానం తండ్రి గాను, ధర్మం సోదరుడు గాను, దయ మిత్రుడు గాను, శాంతము భార్య గాను, క్షమ పుత్రుడు గాను ఉంటూ నన్ను ఎన్నడూ విడనాడక నా బాగోగులు సర్వదా చూచుకొంటారు.
"అమ్మా! సత్యవ్రతం తల్లిలాంటిది. తల్లి ఎన్ని విధాల బిడ్డణ్ణి కంటికి రెప్పలా కాపాడుతుందో సత్యం కూడా జీవికి అండగా ఏడుగడగా ఉంటుంది. మరి తండ్రి తనయుని చదువు సంధ్యలు మొదలయినవి ఎన్నో సమకూరుస్తాడు జ్ఞానము వలెనే. ధర్మ ప్రవర్తన సోదరుని వంటిది. శరీరానికి అవయవాలు ఏ రీతిగా సహాయ సంపత్తి సమకూరుస్తాయో అలాగే సోదరుడు సహకరిస్తాడు కదా! ఇక మిత్రులు ఫలాపేక్ష లేకుండా చేదోడు వాదోడుగా ఉండేవారు కదా! దయాగుణం మిత్రుడి వంటిది. లోకంలో భార్య అన్నది ఎంతో ఓర్పుతో నేర్పుతో తన భర్తకు పిల్లలకు సకలోప చారాలుచేస్తూ, సంసారాన్ని సముద్రుడి వలె గంభీరంగా భరిస్తుంది. అదే శాంత మంటే. పుత్రులు ముసలి తనంలో తల్లిదండ్రులను ఆదుకొనేవారు. క్షమతో ఓర్పుతో ఆ లోటుండదు. అన్నీ చక్క బడతాయి. నా భవిష్యజ్జీవనంలో ఈ గుణాలే నన్ను రక్షించాలి. తదనుగుణంగా ఉంటుంది నా ప్రవృత్తి. నీవు ఏమీ భయపడ నవసరం లేదు. ఇక నాకు ముందు ముందు పని ఉంది.
శత్రువులన్న వాళ్ళు ఎదుటి వారిని నాశనం చేయడానికి పొంచి ఉంటారు. వాళ్ళకు నిద్రాహారాలు ఉండవు. శత్రు రాజులచే జయింప బడితే ప్రజల్ని పీడిస్తారు. అది బహిశ్శత్రువుల ప్రభ. ఇక అంతశ్శత్రువుల మాట? కంటికి కనుపిం చని శత్రువులు వీళ్ళు. లెక్కకు పదముగ్గురు. ఒక్కొక్కడు ఒక శాఖకు అధిపతి. వీరందరికీ సర్వసేనాధ్యక్షుడు చిత్త వృత్తి. మరొక పేరు కాముడు. తక్కిన వారందరూ వీనికి దాసులు. ఈ కాముణ్ణి జయిస్తే మిగిలినదంతా సులభమే. శంకరుడు సహజ విరాగి, విజ్ఞాని. అంతరంగవైరులే ఈయన ముందు తలవంచుకొని పారి పోవలసిందే.
*సన్న్యాస యోగము:*
తపస్సు, యజ్ఞ యాగాది క్రతువులూ, దానధర్మాలు తప్పక ఆచరించమని శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఇవన్నీ మానవులు పవిత్ర చిత్తులవడానికి వైరాగ్య సిద్ధికి మార్గాలుగా నిర్దేశించారు. కర్మలు చేస్తూ ఉన్నా, తత్కర్మఫలాలను అపేక్షించ కూడదు. కామ్యకర్మలు అసలే మానితే అది సన్న్యాస మవు తుంది. కర్మలు చేస్తూ కర్మఫలం పరమేశ్వరా యత్తం చేసి సన్న్యాసి అనిపించుకోవచ్చు. మనకు నాలుగు ఆశ్రమాలు ఏర్పరచారు: వివాహ మయ్యేంత వరకు బ్రహ్మచర్యం, విహితకర్మా చరణలతో కూడిన గార్హస్థ్యం. ఆ తరువాత గృహసుఖాలకు దూరమై, ఎక్కడో వనంలోనికి పోయి నియమితమైన కట్టుబాట్ల కు లోబడి గడిపే తపో జీవనం వానప్రస్థ్యం. సద్బుద్ధితో ఆలు, బిడ్డల్ని, ఇల్లూ వాకిలి వీడి విరాగియై నడిచేది తుది ఆశ్రమం సన్న్యాసం. సన్న్యాసాశ్రమంలో ప్రవేశించే వ్యక్తి విధిగా కొన్ని శ్రాద్ధకర్మలు పెట్టాలి. మొదట వైశ్వదేవశ్రాద్ధము, తర్వాత నాందీముఖ శ్రాద్ధము, దైవశ్రాద్ధము, ఋషి శ్రాద్ధము, దివ్య శ్రాద్ధము, మానుషశ్రాద్ధము, పితృశ్రాద్ధము, మాతృ శ్రాద్ధమూ పెట్టాలి. ఇవన్నీ ముగించి తన శ్రాద్ధము తానే పెట్టుకోవాలి.
శక్తి ననుసరించి వీటి కన్నింటికీ ధనం వెచ్చించాలి. భూదానం, అన్నదానం, వస్త్రదానం శక్తివంచన లేకుండా చేయాలి. మూడవనాటి కర్మకాండకున్న ధనంలో కొంత మిగుల్చుకొని శేషించినది పుత్రుల కిచ్చివేయాలి. ఆ పైన బంధు మిత్రులతో విందు ఆరగించాలి. ఆనాడు దిగులుండ కూడదు. దాన్ని కనిపెట్టడానికి ఉపాయం చెప్పారు. దిగులుతో ఉన్నవానికి అన్నం రుచించదు. రుచి కలుగని నాడు ఉపవాసం చేయాలి. శ్రాద్ధాన్నాన్ని వాసన చూడాలి. మరునాడే భోజనం. తొలినాడు క్షురకర్మ ఆచరించాలి. స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించాలి. అప్పుడు తనకు ఉపదేశం చేసే గురువుకీ సన్న్యాసికీ యుక్తవస్తువులు దానం చేయాలి. ఉపదేశగురువు కడు సమర్థుడై ఉండాలి. ఆనాడు విధివిహిత కర్మ యావత్తూ ఆచరించాలి. తదుపరి నారాయణ ఉపనిషత్తు పఠిస్తూ బంధుమిత్రులతో కలిసి దగ్గరలోని నదికిగాని తటాకానికిగాని వెళ్ళాలి. తన అపరాధాల నన్నిటినీ క్షమించమని వేడుకోవాలి. బంధుమిత్రులు వెళ్ళిన తరువాత ఆ నీట దిగి తానాచరించవలసిన కర్మను ముగించుకోవాలి. ఇంత కాండా సర్వులూ చేయాలా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వృద్ధులూ, రోగులూ,అవసాన దశలో ఉన్నవారు, విపత్తులో ఉన్నవారూ కర్మకాండ చేయలేరు కదా. అట్టివారికి 'ఆతుర సన్న్యాసం' విధించారు. ఆపద్దశలో ‘సన్న్యస్తం మయా' అని ముమ్మారు పలికితే చాలు. సన్న్యాస స్వీకార ఫలం. గడచిన 101 తరాల, రాబోయే 300 తరాల పితృదేవతలూ తరిస్తారని జాబాలముని మతం.
అయితే ఈ తుది ఆశ్రమం అనుసరించడమంటే చెప్పినంత తేలిక కాదు. మతి నతి నిర్మలంగా ఉంచుకోవాలి. వశీకృత చిత్తుడై ఉండాలి. శబ్ద స్పర్శజ్ఞానం తెలియ కూడదు. లేకపోతే స్పర్శతో కాయం పరవశం అవుతుంది. శబ్దం వినబడి తే తన పని దగ్ధమౌతుంది. రాగద్వేషాలను పార ద్రోలాలి. ద్వేషం మంటలను పుట్టిస్తుంది. మమ అనేదాన్ని మరువాలి, విడువాలి. ధ్యానయోగంలో నిమగ్నుడై ఉండాలి. ఏకాంతవాసం వైరాగ్యం వృద్ధిపొందించు కోవాలి.
మనస్సూ వాక్కూ అధీనం లో ఉండాలి. ఇన్ని ఉన్నా శాంతి లేకపోతేప్రయోజనం ఉండదు. ఈ సన్న్యాస ధర్మాలన్నీ క్షుణ్ణంగా అవగాహన చేసికొన్నవాడు శంకరుడు. సన్న్యాస మంటేనే ఆయన జీవితం!
*సద్గురువుకై అన్వేషణ:*
ఆ గురువులు పలురకాలు. చదువు చెప్పే గురువు ఆయనకు అక్కరలేదు. ఆయనకు పనికి వచ్చే గురువు శంకరుని కన్న అధికుడై ఉండాలి. తెరను తొలగించి రహస్యాన్ని వ్యక్తం చేయగల గురువు కావాలి. రహస్యమంతా నాలుగు మహా వాక్యాలలో ఇమడ్చబడి ఉన్నది. ఆ వాక్యాలు ఇవి:
*తత్త్వమసి. అహంబ్రహ్మాస్మి. అయమాత్మా బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ.*
ఆ వాక్యాలకు అర్థం చెప్పేవారు కావలసినది. ఆ వాక్యాల భావాల స్వరూప వంతుణ్ణి తయారు చేసే సామర్థ్యంకల గురువు కావాలి. అట్టి గురువు లభిస్తే అఖండజ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాంటివారు ఒకరిద్దరు ఉండకపోరు. దొరకాలంటే పూర్వపుణ్య ఫలం ఉండాలి. అలాంటి మహాయోగ సంపన్నుడు శంకరుడు. గురువులు అందరూ ఒకలాగున ఉండరు. గూఢుడు, ప్రీతుడు, మౌని, సకృత్కామగతుడు అని రకాలు. వీరిలో మరల విహంగమ, కూర్మ, మత్స్య భేదాలు ఉన్నాయి. విహంగమ గురుడు ఎలా ఉంటాడు? పక్షి తన పక్షాల క్రింద గ్రుడ్లను పొదిగి పిల్లలను చేస్తుంది. పక్షి వలె హస్త మస్తక సంయోగంతో తన శిష్యుని అజ్ఞానావరణంలో నుండి తొలగించి తనంతవానిగా చేస్తాడు. దీనినే విహంగ వృత్తి అంటారు. తాబేలు గ్రుడ్లు పెట్టి ఎక్కడో సంచరిస్తుంది. దానికి ఎప్పుడో గ్రుడ్ల మాట జ్ఞాపకం వస్తుంది. ఈ లోగా ఆ గ్రుడ్లు పగిలి పిల్లలు బయటికి వస్తాయి. ఇది కూర్మ వృత్తి. ఇందులో శిష్యులకు గురువు దూరంగా ఉంటాడు. కాని శిష్యుడు తనంత వాడు కావాలన్న దృఢ సంకల్పం ఇందులో ఉంటుంది. అందువలన శిష్యులు జ్ఞానులౌతారు. చేప కూడా గ్రుడ్లు పెడుతుంది. అవి ఎక్కడో నీటి అడుగున బుఱదపై ఉంటాయి. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంది. అప్పుడా గ్రుడ్లు పగిలి పిల్లలు బయటికి వస్తాయి. అదే విధంగా గురుదేవులు శిష్యులపై తమ ప్రసాద దృష్టి ప్రసరింపజేసి శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు.
ఇది కాక వేదాంత విజ్ఞాన పధంలో నాలుగు విధాల వారున్నారు:
*బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు.*
శాస్త్రం చెప్పినది తాను ఆచరిస్తూ, శిష్యుని తరింపజేసే వానిని గూఢగురువని, బహ్మ విదుడని అంటారు. తాను చేయవలసిన మంచి పనులు కూడా మరచి జ్ఞానదానంచేసే వాడే పరమహంస. దృఢగురువు అనికూడా పిలువబడు తాడు. ఆహారం మాత్రం విడిచిపెట్టక ఇతరములన్నీ మాని ఉండేవాడే బ్రహ్మ విద్వరుడు. అట్టివానిని ప్రీతుడని కూడా వ్యవహరి స్తుంటారు. సదా నిర్వికల్ప సమాధిలో ఉంటూ తెలివి వచ్చినపుడు మాత్రమే ఏదయినా సేవించేవాడు సకృత్కామగతుడనీ, బ్రహ్మవిద్వరిష్ఠుడు అనబడతాడు. అంతంత ప్రభావాలుండి బ్రహ్మాదులు కూడ గుర్తించలేనంత శక్తిమంతులై ఉంటారు గురువులు. సద్గురువుకై అన్వేషించుకోవడం, దొరికిన గురువును పరీక్షించు కోవడం శిష్యుని విధి. అందుకొరకే శంకరుని ప్రయాణము.
*కైలాస శంకర కాలడి శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*9 వ భాగము*
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి