12, సెప్టెంబర్ 2024, గురువారం

మారేడు చెట్లు

 *మారేడు చెట్లు కాపాడుకో మహేశ్వరా!!!*

అనంతసాహితి: శ్రీక్రోధి నామ సంవత్సర గణపతి నవరాత్రులు! -05


ఉమాపుత్రాయ నమః అంటూ బిల్వపత్రంతో బొజ్జగణపయ్యకు పూజ చేస్తాం. కనుక బిల్వపత్రాలు వినాయకుడి పరమైపోయాయి. అమ్మవారు జూదం పేరుతో నెలవంకను, నందీశ్వరుడినీ లాక్కుంటే, పూజపేరుతో బిల్వదళాలు వినాయకుడు లాక్కున్నాడు. 

ఇప్పుడు వినాయకుడి నుంచీ మారేడు చెట్లను మ్లేచ్ఛులు లాక్కుంటున్నారు. దోచుకుపోతే దోచుకుపోయారు అనుకుంటే భారతదేశంలోనే మారేడు చెట్లు అంతరిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఘోషిస్తోంది. ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం. 

వైద్యానికి పనికివచ్చే వనమూలికల ఎగుమతిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారతదేశం ఉందని గర్వపడాలో ఏడవాలో తెలియని స్థితికి మనం చేరుకున్నాం.

మ్లేచ్ఛుల చరిత్ర ప్రకారం 5 వేల ఏళ్ళ నుంచీ బేల్ చెట్టు అనే మారేడును మనం కొలుస్తున్నాం, వైద్యంలో వినియోగిస్తున్నాం. 

ఐక్యరాజ్యసమితి 21 వేల వృక్షజాతులు వైద్యంలో ముఖ్యమైనవి అని జాబితా తయారు చేసింది. ప్రపంచంలో 400పుష్పజాతి మూలకుటుంబాలు ఉంటే వీటిలో 315 జాతులు భారతదేశంలో దొరుకుతాయని ఐరాసా అంటోంది. ప్రపంచంలో వనాలనుంచీ వైద్యఔషాథాలు సేకరించిన చరిత్రలో భారతదేశానిదే ప్రథమస్థానం. అయితే ఇక్కడ విచారకరమేమంటే మారేడు చెట్లు అంతరిస్తున్న వృక్షజాలం జాబితాలో ఐరాసా చేర్చడం. అంతేకాదు బిల్వవృక్షానికీ చెదపురుగులు తినే చైనాకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా, చైనా కూడా బిల్వచెట్లు అంతరిస్తున్నాయని అంటోంది. 


వేదకాలం నాటి అద్వితీయమైన వృక్షదేవత ఏగెల్ మార్మెలోస్. దీన్ని మారేడు, బిల్వం అని పిలుస్తారు. ఇది మహేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైంది. వేదకాలం నుంచీ ఉన్న వృక్షదేవతల్లో ఇది ప్రథమమైంది. నెత్తిన మూడు మారేడు దళాలు, పురిసెడు గంగనీరు పోస్తే బోళా శంకరుడు సంతోషిస్తాడని అష్టైశ్వర్యాలు ఇస్తాడని ప్రవచనకారులు చెబుతారు. కానీ మారేడు చెట్టు అంతరిస్తోందని చెప్పరు. ఎందుకంటే వారికి ఆ సంగతి తెలియదు.


మారేడు దళాలకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. శివలింగాన్ని తాకిన మారేడు దళాలు శివశక్తిని తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. కాస్మిక్ కిరణాలు ఉన్న మారేడు దళాలు ఎవరి దగ్గర ఉంటే వారు అత్యంత శక్తివంతులు అవుతారు.

నిజానికి శివునికి అభిషేకం చేయడంలో కూడా ఆంతర్యం అదే. నీటికి కూడా కాస్మిక్ కిరణాలు దాచుకునే గుణం ఉంది. కనుక వీటిని శివలింగం మీద పోయడం వలన శివశక్తి నీటిలో చేరి అది భూమికి శుభం చేకూరుస్తుందని, ఆ నీరు తీర్థంగా సేవిస్తే, మారేడు దళాలు ప్రసాదంగా స్వీకరిస్తే శివశక్తి సంప్రాప్తిస్తుందని అంటారు. ఇవి భక్తి విశ్వాసానికి శాస్త్రీయతకూ చెందిన అంశాలు.


ఇక వైద్యానికి వస్తే మారేడు చెట్టులో పనికి రాని పదార్థమే లేదు. ఆకులు, కొమ్మలు, బెరడు, కలప, వేళ్ళు, పళ్లు, గింజలు అన్నీ వైద్యానికి పనికి వచ్చేవే. పచ్చకామెర్ల వంటి ఆంగ్లవైద్యానికి తెలియని చికిత్సలు కూడా ఇది చేసేది. మలేరియా, అనేక చర్మవ్యాథులు, పుళ్ళు, పొట్టలో పుళ్ళు, ఎలర్జీల వల్ల చర్మంపై వచ్చే మచ్చలు, దద్దుర్లు వంటివి, బిపి, సుగర్ వంటి రోగాలకు చికిత్స చేస్తుంది. నేడు పీడాకారం ఆంగ్లవైద్యవిధానం వచ్చాక బిల్వ చెట్టును వైద్యంలో సంపూర్తిగా ఉపయోగించడం లేదు. నిజానికి బిల్వ చెట్టు ఉపయోగాలు చూసి ఆధునిక వైద్యులు కూడా ప్రతిరోజూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు.


ఇది భారతదేశలోనే పుట్టిన మహా ఔషథరాజం. మహాభిషజుడు అయిన మహేశుడే తనకు అత్యంత ప్రీతి పాత్రమైంది బిల్వం అన్నాడంటే దీని వైద్య మహిమ మనం ఊహించలేం. కేన్సర్ కూడా తగ్గించే శక్తి ఉంది. అల్కలాయిడ్స్ (ఏగెలిన్, ఏగెలెనైన్, మార్మెలైన్) కౌమెరిన్స్, పోలిసచ్చారైడ్స్ వంటివి ఉన్నాయి. బిల్వం వల్ల చక్కెర వ్యాధి నయం అవుతుందని ఏజెలైన్ 2 లనే కాంపౌండును అధ్యయనం చేసి అంటున్నారు. అంతేకాక, హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ లో బిల్వం వాడితే అధిక ప్రయోజనాలున్నాయట. బిల్వంలోని మర్మెలోసిన్ కేన్సర్ మందుల్లోని విషాలు తొలగిస్తుందని మలబద్ధకాలు రానివ్వదని, గుండెకు, మెదడుకు మంచిదని తేలుస్తున్నారు.


మారేడు పళ్లను ఉత్తరాదిన జ్యూస్ గా సేవిస్తారు. ధాయిలాండ్ లో, ఇండోనేషియాలో చింతచిగురు మాదిరిగా మారేడును కూర చేసుకొని తింటారు. ప్రపంచం అంతా బిల్వ చెట్టును కేవలం తినే వస్తువుగా లేకపోతే వైద్యవస్తువుగానో చూస్తోంది.

కేవలం భారతదేశంలో మాత్రమే దీన్ని వేదకాలంనాటి వృక్షరాజంగా చూస్తున్నారు. అయితే అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్షజాతిలో బిల్వ చెట్టు ప్రథమస్థానంలో ఉంది. భారతదేశంలో కూడా ఇది కనపడడం చాలా కష్టమైపోతోంది. ఒకప్పుడు బిల్వవనాలు ఉండేవి. కానీ నేడు అడవుల్లో కూడా దొరకడం లేదు. పూర్వం ప్రతి ఇంటిలో బిల్వచెట్టు ఉండేది. నేడు ఊరికి ఒకటి ఉండడం కష్టం అయింది.


వినాయక చవితి వస్తోంది. దసరాలు వస్తున్నాయి. తరువాత శివరాత్రీ వస్తుంది. అందరూ బిల్వ పత్రాలకోసం వెంపర్లు ఆడతారు. కానీ బిల్వ చెట్టు పెంచని భక్తుడికి బిల్వ పత్రాలు స్వామికి అర్పించే అర్హత ఎక్కడ ఉంది?


బిల్వ చెట్లు అంతరిస్తున్నాయన్నది ఐక్యరాజ్యసమితి సాక్షిగా చెబుతున్న నగ్నసత్యం. కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుడినో ప్రభుత్వ ఉద్యానవనమాలినో అడిగి తెలుసుకోండి. వీరిలో ఏ ఆయుర్వేద వైద్యుడైనా బిల్వ చెట్ల కొరతలేదు అంటే ఆ వైద్యుడికి ఏమీ తెలియదని లెక్క. వారి దగ్గరకు వెళ్లకండి. ఇదేమాట ఏ ప్రభుత్వ ఉద్యానవనాధికారి లేదా వనమాలి అయినా అంటే వాడంత పనికిమాలిన వాడు మరొకడు లేడని ప్రజల సొమ్ము క్షవరం చేసే ప్రభుత్వఉద్యోగిగా గుర్తించండి.


ఐక్యరాజ్యసమితి చెబుతోంది నమ్మండి. లేదా మీ అంతట మీరే ఒక చిన్న పరీక్ష చేసి చూడండి. వినాయకచవితికి ఒక మారేడు చెట్టు దర్శించి దానికి నమస్కరించండి. దళాలు కోయకండి. ఈ చెట్లు ఎంతగా అంతరించిపోయాయో మీకే తెలుస్తుంది. ఈ పరీక్ష హైదరాబాద్ వాసులకు కాదు చెబుతోంది. అరణ్యప్రాంతం ఉన్న మెదక్, కర్నూలు జిల్లాల్లోని పల్లెవాసులకు పెడుతున్న పరీక్ష. అంగుళం భూమిని లక్షలు పోసి కొంటున్న పగోజి తూగోజి వాళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదు.


సరదాగా సెలవు రోజున ఈ పరీక్ష చేసి చూడండి. మీకు సిగ్గువేస్తే వెంటనే బిల్వచెట్లు నాటండి. శివాపరాధం నుంచీ బయటపడమని చెప్పడం లేదు. మీ ఆరోగ్యాలు ఆయుర్వేదం ద్వారా రక్షించుకోమని చెబుతున్నాము. ఎందుకంటే నేడు మారేడు చెట్టు నుంచీ వచ్చే ఆయుర్వేద మందులు రేపు దొరకవు. ఇది ఐరాస హెచ్చరిక.



స్వామి అనంతానంద భారతి

అనంతసాహితి ఆశ్రమం

కామెంట్‌లు లేవు: