*తిరుమల సర్వస్వం -160*
*స్వామి పుష్కరిణి -7*
*ధర్మగుప్తుడు*
ప్రాచీనకాలంలో 'ధర్మగుప్తుడు' అనే చంద్రవంశపు రాజు ఉత్తరభారత దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహారాజు క్రూరమృగాలను వేటాడుతూ దట్టమైన అరణ్యం లోనికి ప్రవేశించాడు. ఒక భీకరమైన వనసూకరాన్ని (అడవిపంది) చాలాసేపు వెంటాడిన నందువల్ల కాలాతీతమై, సంధ్యచీకట్లు కమ్ముకున్నాయి. ఆ కీకారణ్యంలో మరే ఆశ్రయము లభ్యం కాకపోవడంతో ఆ రాత్రికి తనను వన్యమృగాల బారినుండి రక్షించు కోవడం కోసం, శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఒక వటవృక్షాన్ని ఆశ్రయించాడు. అంతలో ఒక సింహం అతివేగంగా తరుముకు రావడంతో, తన ప్రాణసంరక్షణార్ధం ఒక భల్లూకం కూడా అదే చెట్టును ఆశ్రయించింది. అలా వటవృక్షం యొక్క ఒక శాఖపై ధర్మగుప్తుడు, దాని ప్రక్కనే ఉన్న మరొక శాఖపై ఎలుగుబంటి కూర్చుని ఉన్నారు. వీరిద్దరినీ వృక్షశాఖలపై కాంచిన సింహం చెట్టు మొదట్లో మాటు వేసింది. దాంతో ధర్మగుప్తుని పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది. చెట్టు పైన ఉన్న తనపై ఎప్పుడైనా భల్లూకం దాడి చేయవచ్చు. క్రిందకు దూకితే తాను సింహానికి బలవ్వడం ఖాయం. ఆ విధంగా, ఏం చేయాలో పాలు పోకుండా సందిగ్ధావస్థలో ఉన్న ధర్మగుప్తుణ్ణి ఉద్దేశిస్తూ ఆ భల్లూకరాజం ధైర్యవచనాలు పలికింది. ఆందోళన వలదని, హాయిగా నిదుర పొమ్మని, ఆ సమయంలో ధర్మగుప్తునికి సింహం నుంచి ఏ హానీ జరగకుండా తాను కాపాడుతానని, మరి కొంతసేపటి తరువాత తాను నిద్రించినప్పుడు ధర్మగుప్తుడు తనను కాపాడాని పలికింది. అలా, ఇద్దరూ ఒక ఒప్పందానికి రావడంతో కొంతసేపు ధర్మగుప్తుడు నిశ్చింతగా విశ్రమించాడు. ఆ సమయంలో క్రింద వేచియున్న కుటిలబుద్ధి గల సింహం ఎలుగుబంటితో, ధర్మగుప్తుణ్ణి క్రిందకు త్రోసి వేయమని, అతనిని భుజించడంతో తన క్షుద్బాధ తీరుతుందని, ఆ విధంగా ఎలుగుబంటి రక్షింపబడుతుందని నమ్మబలికింది. కానీ, ధర్మానికి కట్టుబడ్డ ఎలుగుబంటి, తనను నమ్ముకున్న మహారాజుకు తాను అభయమిచ్చానని, తాను నమ్మకద్రోహం తలపెట్టనని సమాధానమిచ్చింది.
మరి కొంతసేపటికి ధర్మగుప్తుడు నిద్ర నుండి మేల్కొనడంతో, ఎలుగుబంటి నిద్రకు ఉపక్రమించింది. అలా ఆ భల్లూకం గాఢనిద్రలో ఉన్న సమయంలో సింహం ధర్మగుప్తునితో కూడా అదే విధంగా ప్రస్తావించింది. అంతట ధర్మగుప్తుడు ఏమాత్రం ముందువెనుకలు ఆలోచించకుండా స్వార్థబుద్ధితో, నమ్మకద్రోహానికి ఒడికడుతూ ఎలుగుబంటును క్రిందకు త్రోసివేశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్ర నుండి మేల్కొన్న భల్లూకం క్రిందనున్న మరో చెట్టుకొమ్మ సాయంతో తిరిగి పైకి చేరుకోగలిగింది. స్వార్థమానవుని విశ్వాసఘాతుకానికి గురైన భల్లూకం పట్టరాని కోపంతో, ధర్భగుప్తునికి తన పూర్వజన్మ వృత్తాంతం తెలిపింది.
తాను అటవీమృగాన్ని కానని, 'ధ్యానకాష్ఠ' అనే నామధేయం కలిగిన మునిపుంగవుణ్ణని, మోక్షప్రాప్తికై ధ్యాననిష్ఠలో ఉన్న తనను దర్శించుకునే నిమిత్తం ఎందరో భక్తులు తన చెంతకు చేరేవారని, తనకు తపోభంగం కలుగకుండా ఉండే నిమిత్తం వేర్వేరు రూపాలు ధరించి సాధన చేసుకుంటానని, అందులో భాగంగానే తానీ సమయంలో ఎలుగుబంటి రూపంలో నున్నానని విశద పరిచింది. అంతే గాకుండా, ఆశ్రితులను కాపాడవలసిన మహారాజే నమ్మకద్రోహానికి ఒడిగట్టడంతో అతనిని పరుషమైన పదజాలంతో దుర్భాషలాడుతూ; మానవసహజమైన విచక్షణాజ్ఞానాన్ని విస్మరించి ప్రవర్తించినందున ధర్మగుప్తుడు, ఇకమీదట యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి ఉన్మత్తుడై సంచరిస్తాడని శపించింది. ధర్మగుప్తుడు తక్షణం మతిస్థిమితం కోల్పోయాడు.
ఇలా మతితప్పినవాడై, కేశసంస్కారం లేకుండా, ఆకులు-అలములు భుజిస్తూ, అరణ్యాలలో అలమటిస్తున్న ధర్మగుప్తుడు కొంతకాలానికి తన రాజ్యాన్ని చేరుకుంటాడు. ఆ మహారాజును గుర్తెరిగిన మంత్రులు అతనిని వానప్రస్థాశ్రమంలోనున్న మహారాజు తండ్రిగారైన 'నందుని' వద్దకు చేర్చుతారు. పుత్రుని దీనావస్థకు తీవ్రంగా మనస్తాపం చెందిన నందుడు తన వానప్రస్థాశ్రమాన్ని తాత్కాలికంగా విడనాడి, పుత్రునితో పాటుగా 'జైమినిమహర్షి' ని దర్శించుకొని, తన పుత్రునికి శాపవిముక్తి కలిగించ వలసిందిగా ప్రాధేయ పడతాడు. తన దివ్యదృష్టితో పూర్వాపరాలను అవగతం చేసుకున్న జైమినిమహర్షి, విశ్వాసఘాతుకానికి పాల్పడిన ధర్మగుప్తునికి నిష్కృతి లేదని, వేంకటాచలాని కేతెంచి, స్వామిపుష్కరిణిలో స్నానమాడి శ్రీనివాసుణ్ణి శ్రద్ధాభక్తులతో సేవించుకుంటే శాపవిముక్తుడవుతాడని శాపాంతరాన్ని బోధిస్తాడు.
జైమినిమహర్షి వాక్కుననుసరించి నందుడు ఉన్మత్తుడైన పుత్రుణ్ణి తోడ్కొని వేంకటాచలాని కేతెంచి, స్వామిపుష్కరిణిలో స్నానమాడి, పుష్కరిణి తటాన సద్ర్భాహ్మణులకు విశేషంగా దానధర్మాలు చేసి, వేంకటాచలపతిని సేవించుకుంటాడు. స్వామిపుష్కరిణి మహిమతో, వేంకటేశ్వరుని కృపాకటాక్షాలతో ధర్మగుప్తుడు శాపవిముక్తుడై, తిరిగి రాజ్యభారాన్ని చేపట్టి, ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు.
[ రేపటి భాగంలో... *త్రేతాయుగంలో స్వామి పుష్కరిణి* గురించిన విషయాలు తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి