25, ఫిబ్రవరి 2025, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*299 వ రోజు*


*ధర్మరాజు అభిమన్యుని మరణానికి చింతించుట*


ధర్మరాజు తన శిబిరంలో కూర్చుని ఇలా " చింతింస్తున్నాడు. " ద్రోణాచార్య సురక్షితంమైన దుర్భేద్యమైన పద్మవ్యూహం ఛేదించుటకు అభిమన్యుని ఏల పంపవలె. నన్ను సంతోషపెట్టుటకు అభిమన్యుడు ఏల పద్మవ్యూహంలోకి చొరబడవలె. దుశ్శాసనాధి కురుప్రముఖులను ఓడించుట అనేక మంది యోధులను చంపుట పసి బాలునకు సాధ్యమా ? ఇది ఒరులకు ఏల సాధ్యము. అర్జునుడు వచ్చి ఏడీ నా కొడుకు అని అడిగిన నేను ఏమి చెప్పవలె. కృష్ణుడు వచ్చి నా గారాల మేనల్లుడు ఏడీ అని అడిగిన నేను ఏమి చెప్పవలె? అయ్యో ! బాలుడు సుకుమారుడు అయిన అభిమన్యునికి యుద్ధరీతులు ఏమి తెలియును. మహావీరులకే దూర శక్యముకాని పద్మవ్యూహము లోకి నేను ఎందుకు పంపించాను. పెద్దలు పిన్నలకు బహు ప్రియముగా బహుమానము ఇత్తురు నేను యుద్ధమునకు పంపి మరణముకు కారణమయ్యాను. నేను ఎంతటి పాషాండుడను. అభిమన్యునితో నేను పాటు నేను ఎందుకు మరణించ లేదు. పుత్రశోకంతో అలమటించే అర్జుడిని నేను ఎలా ఓదార్చగలను. కాలకేయులను చంపి ఇంద్రుడు అంతటి వాడిని ఆదుకున్న అర్జునుడు కుమారుడు ఇలా పగవారి చేత హతుడుకావలసిన దుర్ధశ దాపురించింది కదా! తన కొడుకును చంపారన్న కోపంతో అర్జునుడు ద్రోణాదులను చంపవచ్చును కాని మరణించిన కుమారుడు రాడు కదా! ఈ భూమిలోని సకల సంపదలు స్వర్గలోక సుఖములు సహితం చిరునవ్వులు చిందించు అభిమన్య ముఖారవిందముకు సాటి రావు కదా ! " అని పరి పరి విధముల విలపిస్తున్నాడు.*


*వ్యాసుని రాక*


అప్పుడు ధర్మరాజు వద్దకు వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజు ఆ మహామునికి అర్ఘ్యపాద్యములు సమర్పించి సత్కరించి ఇలా అన్నాడు. " మహానుభావా ! శత్రుసేనలను జయించడానికి నేను అభిమన్యుని పంపాను. అభిమన్యుడు శత్రుసేనలను ఎదుర్కోడానికి పద్మవ్యూహములో జొరపడ్డాడు. వెంటనే మేము కూడా వెళ్ళాము కాని పరమశివుని వరప్రభావంతో సైంధవుడు మమ్ము అడ్డుకున్నాడు. అప్పుడు కౌరవయోధులు పెక్కు మంది అభిమన్యుని చుట్టుముట్టి రకరకములైన ఆయుధములతో అధర్మంగా చంపారు. బాలుని ఒంటరిగా యుద్ధముకు పంపిన నాలాంటి పాపాత్ముడు ఎక్కడైనా ఉంటాడా ! విపరీతమైన దుఃఖంతో నా మనసు ఉడికి పోతుంది నా పాపానికి నిష్కృతి లేదు " అని విలపించాడు. వ్యాసుడు " ధర్మజా ! శోకింపకుము. ఎంతోమంది యోధాను యోధునులను చంపిన అభిమన్యుడు బాలుడా ! శత్రువులు అతడి మీద క్రూరబాణములు వేయక పూలబాణములు వేస్తారా ! తెలివి విపత్తులు కలవారు నీలా శోకించరు. మరణం ఈ లోకంలోని ప్రాణులకు సహజం . గరుడ, ఉరగ, దానవులకే మరణం జయింప శక్యము కానిది. మానవ మాతృలము మనమెంత . విధినిని తప్పించుట ఎవరికి సాధ్యము. కనుక ధైర్యము తెచ్చుకుని కాగల కార్యము గురించి ఆలోచింపుము " అని పలికాడు. మునీంద్రా ! ఈ భూమిని ఏలిన ధైర్యశాలులైన, పరాక్రమవంతులైన రాజులు మహాత్ములు ఒక్కరు కూడా మృత్యుముఖము నుండి తప్పించుకొనుటకు సాధ్యము కాలేదే ఎందుకు " అని అడిగాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: