25, ఫిబ్రవరి 2025, మంగళవారం

14-02-గీతా మకరందము

 14-02-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జ్ఞానముయొక్క మహిమను ఇంకను తెలియజెప్పుచున్నారు -


ఇదం జ్ఞానముపాశ్రిత్య 

మమ సాధర్మ్యమాగతాః | 

సర్గేఽపి నోపజాయన్తే 

ప్రళయే న వ్యథన్తి  చ || 


తాత్పర్యము:- ఈ జ్ఞానము నాశ్రయించి జనులు నాతో నైక్యమునొందినవారై (నా స్వరూపమును బడసి) సృష్టికాలమున జన్మింపరు. ప్రళయకాలమున నశింపరు. (జననమరణరహితులై పునరావృత్తిలేక యుందురని భావము).

వ్యాఖ్య:- ‘మమ సాధర్మ్యమాగతాః’- జ్ఞానముయొక్క అఖండమహిమను తెలియజేయుచున్నారు. ఈ జ్ఞానమును తెలిసికొనినవారు సాక్షాత్ భగవంతునితో నైక్యమొంది భగవద్రూపులే యగుచున్నారు. (జ్ఞానీత్వాత్మైవ మే మతమ్ (7-18) అని పూర్వమీభావమునే గీతాచార్యులు వ్యక్తపరచియుండిరి. ఈ జ్ఞానముచే జీవుడు శివుడగుచున్నాడు. భక్తుడు భగవంతుడగుచున్నాడు. "సాధర్మ్యమ్" అని చెప్పుటవలన జ్ఞాని భగవంతునితో సరిసమానమైన రూపము, ధర్మములు గలిగియుండునని స్పష్టమగుచున్నది. అట్టి స్థితి ఐక్యమువలననే సిద్ధించగలదు. ఏలయనిన, సమానధర్మములుగల - అనగా సద్రూపముగల రెండు వస్తువులు ఎచటను ఉండనేరవు. ఒకే సద్వస్తువు లోకమున ఉండగలదు. కాబట్టి జీవుడు జ్ఞానోపార్జనచే పరమాత్మయందు తప్పక లీనమగుచున్నాడని  ఋజువగుచున్నది. ఆహా! ఎంత గొప్ప పదవి! సాక్షాత్ భగవంతుడే తానగుటలో ఎంత ఘనత కలదు! కావున అట్టి మహోన్నతస్థితికై ఈ జీవితమందే యత్నించువాడు ధన్యాతిధన్యుడు.

అయితే అట్టి భగవత్సాయుజ్యమును, సాధర్మ్యమును, బొందుటవలన కలుగు ఫలితమేమి యనిన, అట్టివారు జననమరణరహితులై పునరావృత్తిలేక యుందురు. వారు సృష్టికాలమున జన్మించుటగాని, ప్రళయకాలమున నశించుట, బాధనొందుటగాని లేనివారై - "పునరపి జననం పునరపి మరణమ్" - అనుదానిని తప్పించుకొనినవారై ఈ సంసారచక్రపరిభ్రమణమునుండి విడివడి" పరమానంద మనుభవించుచుందురు. వెయ్యేల! ఆనందరూపులే యగుదురు. (సర్గేఽపి నోపజాయన్తే ప్రళయే న వ్యథన్తి  చ). కాబట్టి సంసారవ్యథలనుండి, బాధలనుండి తప్పించుకొనవలెననిన, ఈ ఆత్మజ్ఞానమొకటియే జనులకు శరణ్యమని తేలుచున్నది.


ప్రశ్న:- ఈ జ్ఞానమును బొందుటవలన గలుగు ఫలితమేమి?

ఉత్తరము:- ఈ జ్ఞానమును బొందుటచే జనులు (1) భగవంతునితో నైక్యమొందినవారై భగవత్స్వరూపులే యగుదురు. (2) మఱియు సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నాశమొందరు, బాధితులుకారు. (జననమరణరహితు లగుదురని భావము).

ప్రశ్న:- (దీనినిబట్టి) భగవత్సాయుజ్యమును, మోక్షమును బొందుట కుపాయమేమి?

ఉత్తరము:- పరమార్థజ్ఞానమును బడయుటయే.

కామెంట్‌లు లేవు: