25, ఫిబ్రవరి 2025, మంగళవారం

కేయూరాణి

 


*కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥*


భావము:


భుజ కీర్తులు గానీ దండ కడియాలు వంటి అలంకరణలు కానీ పురుషుని అలంకరింపవు. చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించు నటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు కూడా పురుషుని అలంకరింపజాలవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరణలతో సమతూగలేవు. పూల ధారణలు, వివిధ రకాలా కేశాలంకరణలూ కూడా పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.


వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాది భూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడి యున్నట్టి *వాక్భూషణమే* నశించనటువంటి *నిజమైన భూషణము.*


(ఇక్కడ పురుషుడు అంటే మానవజాతినే సంబోధిస్తుంది కాని పురుషులు స్త్రీలు అన్న లింగబేధాలు కావు, అందరికీ వర్తించగల సమర్థతగల పద్యం). 


మన ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా పై పద్యానికి ధీటైన సమాధానమే తెలుగులో నొసంగారు. దానిని గుర్తు తెచ్చుకోవడం ఇక మీ వంతే

కామెంట్‌లు లేవు: