25, ఫిబ్రవరి 2025, మంగళవారం

అభిజ్ఞానశాకుంతలమ్

 🙏అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం 🙏

                   రెండవ భాగం 

..

దుష్యంతునకు శకుంతల ధర్మాలు, నీతిబోధ చేయడం నాటక లక్షణాలకు పూర్తిగా విరుద్ధం.అందువల్లనే కాళిదాసమహాకవి దుర్వాస శాపవృత్తాంతం ప్రవేశ పెట్టి నాయకుడు అసత్యవాది కాదని నిరూపిస్తాడు. అంతేగాక జాలరి వృత్తాంతం కూడా చేర్చాడు శాప విమోచననికి జాలరి వృత్తాంతం ఎంతో ఔచిత్యం వహించింది. ఈవిధమైన భారత కథ మార్పు వల్ల అభిజ్ఞానశాకుంతలమ్ నాటకం నాటకరాజం ఆయింది 

కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా

తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"

అనే ఆర్యోక్తి చరితార్ధమైనది. ఎన్నివేల సంవత్సరములైన నిత్య నూతనంగా ఉన్నది 

మొత్తం కథ వ్రాయలేము గాని సంక్షిప్తంకథ చూద్దాము 

కథలోకి వస్తే 

శకుంతల జాతకం ప్రకారం శకుంతలను దుష్టగ్రహాలు పీడిస్తుంటాయి. ఆ గ్రహాల్ని శాంతింపచేయడానికి కణ్వుడు సోమతీర్థానికి వెళుతాడు. రాక్షస మూకలు, ఏనుగుల గుంపులు భీభత్సం సృష్టించకుండ తపోవనాన్ని సంరక్షించాలని మునులు దుష్యంతుడ్ని కోరుతారు. రాజు కొన్నాళ్ళు అక్కడే విడిది చేస్తాడు. శకుంతల అతనికి అతిథి మర్యాదలు చేస్తుంటుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరు మరింత దగ్గరై గాంధర్వ వివాహం చేసుకుంటారు. కణ్వుడు లేని సమయంలో అతని కూతురిని తీసుకుని వెళ్లడం సాంప్రదాయం కాదనుకుంటాడు. గుర్తుగా తన పేరు చెక్కివున్న ఒక వజ్రపు ఉంగరాన్ని శకుంతలకు ఇస్తాడు. దాని మీద ఎన్ని అక్షరాలున్నవో అని రోజులు గడవక ముందే తన మనుషుల్ని పంపుతానంటాడు. కణ్వుని ఆశిస్సులతో శకుంతలను సాదరంగా హస్తినకు రప్పించుకుంటానంటాడు.

శకుంతల అనుక్షణం దుష్యంతుడినే తలుచుకుంటూ ఈలోకాన్ని మరచిపోతుంది. ఒక రోజు దుర్వాసుడు వచ్చి బిక్షం అడుగుతాడు. పరధ్యానంలోవున్న శకుంతల ముని రాకను గమనించదు. దుర్వాసుడు రెండోసారి అరుస్తాడు. అప్పుడూ శకుంతల గమనించదు. తనకు జరిగినపరాభవానికి దుర్వాసుడు రగిలిపోతాడు. శకుంతల ఎవరి గురించి ఆలోచిస్తున్నదో అతనే ఆమెను పూర్తిగా మరిచిపోవాలని శపిస్తాడు. ముని తనను శపించిన విషయం కూడ శకుంతలకు తెలీదు. శకుంతల చెలికత్తెలు వెళ్ళీ మునిని శాపవిముక్తి చేయమని ప్రాధేయపడతారు. దుష్యంతుడు శకుంతలను మరిచిపోయినా జ్ఞాపికను చూపగానే అతనికి తిరిగి జ్ఞాపకం వస్తుంది అంటాడు దుర్వాసుడు. శకుంతల దగ్గర ఎలాగూ ఉంగరం భద్రంగా వుంది కనుక ఇక ముని శాపం ప్రభావం లేనట్టేనని చెలికత్తెలు భావిస్తారు. ముని శాపం విషయాన్ని శకుంతలకు చెప్పరు..


కణ్వుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేనాటికి శకుంతల గర్భం దాల్చి వుంటుంది. దుష్యంతుని వంటి సద్గుణాల రాజు అల్లునిగా దొరికినందుకు అతను సంతోషిస్తాడు. ఇద్దరు శిష్యులను తోడుగా ఇచ్చి శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపుతాడు


దారిలో శచీతీర్థం దగ్గర పడవలో పోతూ నదిని మొక్కుకుంటుంది శకుంతల. ఆ సమయంలో, దుష్యంతుని జ్ఞాపిక అయిన ఆమె వేలి వుంగరం ఆమెకు తెలియకుండానే నదిలో జారిపోతుంది..

ఆమె వియోగ వ్యథ చేత చిక్కి ఉంగరం వదులై జారి పడిపోయినట్లు అద్భుతంగా వర్ణిస్తాడు 

  దుర్వాసుని శాపం ప్రకారం ఏనాడో శకుంతలను మరిచిపోయిన దుష్యంతుడు ఆమె ఎదురుగా వచ్చి నిలబడినా గుర్తు పట్టలేడు. స్వార్ధపరులైన స్త్రీలు భోగపరాయణుల్ని తేనెలొలుకు కల్ల మాటలతో ఆకర్షిస్తారని నిందించి రాజసభలో ఆమెను అవమానిస్తాడు. కణ్వుని శిష్యులు కూడ శకుంతలను నిర్దయతో వదిలిపోతారు.


నిస్సహయురాలైన శకుంతలను ఆమె తల్లియైన మేనక ఆదుకుంటుంది. ఒక అప్సరసను పంపి శకుంతలను కశ్యప ముని తపోవనానికి చేరుస్తుంది. అక్కడే ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది శకుంతల. అతడే భరతుడు.

శకుంతల జారవిడిచిన ఉంగరాన్ని ఒక ఎర్రని చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరికి దొరుకుతుంది. ఆ జాలరి కూర వండడానికి చేపను కోసినపుడు దాని కడుపులో వుంగరం బయటపడుతుంది. ఆ వుంగరం అనేక మలుపులు తిరిగి దుష్యంతునికి చేరుతుంది. దాన్ని చూడగానే దుష్యంతునికి శాపవిమోచన జరిగి గతం అంతా గుర్తుకు వస్తుంది. శకుంతలకు తాను చేసిన అన్యాయం తెలిసివచ్చి కుమిలిపోతాడు. విచారంలో మునిగి రాజ్యంలో ఉత్సవాలన్నింటినీ రద్దు చేసే స్తాడు.

ఇంద్రుని సూచన మేరకు కశ్యపుని తపోవనానికి వెళ్ళిన దుష్యంతునికి సింహపు కూనలతో ఆడుకుంటున్న భరతుడు కనిపిస్తాడు. అతను తన కొడుకే అని పోల్చుకుంటాడు. అక్కడే శకుంతలను కూడ కలిసి అందరి ముందు క్షమాపణ కోరుతాడు. శకుంతల అతన్ని మన్నిస్తుంది. కశ్యపుని ఆశిస్సులతో శకుంతల, భారతుడ్ని వెంట బెట్టుకుని దుష్యంతుడు హస్తినపురికి ప్రయాణమౌతాడు

. మహాభారతం యొక్క పురాణ యుద్ధంలో పోరాడిన కౌరవులు మరియు పాండవుల వంశానికి భరతుడు పూర్వీకుడు . ఈ భారతం తర్వాత భారతదేశానికి "భరతవర్ష", 'భరత దేశం' అనే పేరు వచ్చింది

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: