ఒక్క అక్షరమును నేర్పించినవారిని కూడా గురువని గౌరవించడము మన ధర్మము. అటువంటప్పుడు శ్రేష్ఠమైన బ్రహ్మవిద్యను బోధించేటటువంటి జగద్గురువులయందు ఎటువంటి శద్ధాభక్తులను కలిగియుండవలెననెడిది స్పష్టమగును.
యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ ।
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః॥
ఎవరు గురువును దేవుడివలె చూస్తారో మరియు గురువు విషయంలో అపారమైన భక్తిని కలిగియుంటారో, వారికి సకల శ్రేయస్సులూ లభించును అని ఉపనిషత్తు తెలియజేస్తోంది. ధర్మమార్గమును బోధించి ఇహమునందు సుఖశాంతులను అనుగ్రహించడమేగాక, బ్రహ్మవిద్యను ఉపదేశించి దుఃఖమయమైన సంసారసాగరమును దాటించెడి వారు గురువులు. ఆత్మతత్త్వమును తెలిసికోగోరిన శిష్యుడు గురువును ఆశ్రయించవలెనని ఉపనిషత్తులు తెలుపుచున్నవి. దానినే భగవద్గీతలో కూడా తత్త్వదర్శులూ, జ్ఞానులూ అయిన గురువులను ఆశ్రయించి, వారిని సేవించి, వారినుండి తత్త్వమును తెలుసుకోవాలని ఉపదేశించబడినది –
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్త్త్వదర్శినః॥
అటువంటి గురువరేణ్యులను కలిగియున్న అవిచ్ఛిన్న పరంపరలో రత్నసదృశులైనటువంటి శ్రీకృష్ణపరమాత్మని, వేదవ్యాసమహర్షులను మరియు శ్రీమత్ శంకరభగవత్పాదాచార్యులను విశేషముగా పూజించి తదనంతరము సదాశివునినుండి మొదలైన గురుపరంపరలో ఉన్నట్టి అందరు గురువర్యులను స్తుతించి వారి కృపకు పాత్రులగుట గురుపూర్ణిమ యొక్క వైశిష్ట్యము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి