15, అక్టోబర్ 2021, శుక్రవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *15.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*



*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.17 (పదిహేడవ శ్లోకము)*


*నిర్గుణే బ్రహ్మణి మయి ధారయన్ విశదం మనః|*


*పరమానందమాప్నోతి యత్ర కామోఽవసీయతే॥12791॥*


స్వచ్ఛమైన మనస్సుగల యోగి తన మనస్సును నిర్గుణ పరబ్రహ్మమైన నాయందు నిలిపి, ఆ నిర్గుణ నిరాకార రూపమును ఉపాసించినచో, అతనికి పరమానందము ప్రాప్తించును.అట్టి స్థితిలో అతనికి ఏవిధమైన కోరికలునూ ఉండవు. దీనినే *కామావసాయిత* అను సిద్ధిగా పేర్కొందురు.


*15.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*శ్వేతద్వీపపతౌ చిత్తం శుద్ధే ధర్మమయే మయి|*


*ధారయంఛ్వేతతాం యాతి షడూర్మిరహితో నరః॥12792॥*


శ్వేతద్వీపాధిపతిని, ధర్మమయుడను ఐన నా యొక్క శుద్ధస్వరూపమునందు చిత్తమును స్థిరముగా నిల్పినవానిని ఆకలిదప్పులు, కామక్రోధములు, శోకమోహములు బాధింపవు. అతడు పరమాత్మనైన నా శ్వేత (శుద్ధ) స్వరూపమును పొందును.


*15.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*మయ్యాకాశాత్మని ప్రాణే మనసా ఘోషముద్వహన్|*


*తత్రోపలబ్ధా భూతానాం హంసో వాచః శృణోత్యసౌ॥12793॥*


నేను ఆకాశమువలె సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపుడను. నాయందు మనస్సును నిలిపి అనాహతనాదమును (ప్రాణఘోషను) చింతించెడి యోగి *దూరశ్రవణము* అని సిద్ధిని పొందును. అతడు ఆకాశమున సంచరించుచుండెడి వివిధ ప్రాణుల భాషలను విని అవగాహన చేసికొనగలడు.


*15.20 (ఇరువదియవ శ్లోకము)*


*చక్షుస్త్వష్టరి సంయోజ్య త్వష్టారమపి చక్షుషి|*


*మాం తత్ర మనసా ధ్యాయన్ విశ్వం పశ్యతి సూక్ష్మదృక్॥12794॥*


నేత్రములకు అధిష్ఠాతయైన సూర్యునిపై దృష్టిని నిలిపి, ఆ సూర్యబింబమును నేత్రములయందు సంయోగపఱచుచు నన్ను మనస్సున ధ్యానించు యోగియొక్క దృష్టి సూక్ష్మమగను (నిశితమగను). అతడు దూరదర్శన సిద్ధిని పొందును. అంతట అతడు విశ్వమునగల ఏ ప్రదేశమునైనను చూడగలడు.


*15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*మనో మయి సుసంయోజ్య దేహం తదనువాయునా|*


*మద్ధారణానుభావేన తత్రాత్మా యత్ర వై మనః॥12795॥*


మనస్సును, దేహమును ప్రాణవాయువుతో సహా నా యందు సంలగ్నమొనర్చి నన్ను ధ్యానించుయోగి *మనోజవము* అను సిద్ధిని పొందును. దాని ప్రభావమున అతడు తాను సంకల్పించీన స్థానమునకు క్షణములో చేరగలడు.


*15.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*యదా మన ఉపాదాయ యద్యద్రూపం బుభూషతి|*


*తత్తద్భవేన్మనోరూపం మద్యోగబలమాశ్రయః॥12796॥*


యోగి తన మనస్సును నాయందే బాగుగి నిలిపినచో తత్ప్రభావమున యోగబలమును పొందును. అంతట ఆ యోగబలమున అతడు తాను కోరుకొనిన రూపమును (కామరూపమును) ధరింపగలడు.


*15.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*పరకాయం విశన్ సిద్ధ ఆత్మానం తత్ర భావయేత్|*


*పిండం హిత్వా విశేత్ప్రాణో వాయుభూతః షడంఘ్రివత్॥12797॥*


ఇతర దేహమునందు ప్రవేశింపదలచినప్పుడు యోగి తన చిత్తమును ఆ శరీరమును ధ్యానింపవలెను. అంతట అతని ఆత్మ ఆ శరీరమును వీడి వాయురూపమును దాల్చి, తుమ్మెద ఒక పూవునుండి మరియొక పూవునందు ప్రవేశించినట్లు తాను సంకల్పించిన శరీరమునందు ప్రవేశించును. దీనిని *పరకాయప్రవేశ సిద్ధి* యందురు.


*15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*పార్ష్ణ్యాఽఽపీడ్య గుదం ప్రాణం హృదురఃకంఠమూర్ధసు|*


*ఆరోప్య బ్రహ్మరంధ్రేణ బ్రహ్మ నీత్వోత్సృజేత్తనుమ్॥12798॥*


స్వచ్ఛందమరణమును కోరుకొను యోగి పాదమూలముతో మూలాధారమును (గుదమును) ఒత్తిపట్టి, ప్రాణవాయువును క్రమముగా హృదయము, వక్షస్థలము, కంఠముద్వారా మూర్ధస్థానమునకు చేర్చవలెను. అచటినుండి బ్రహ్మరంధ్రముద్వారా బ్రహ్మమునందు లీనమై తనువును త్యజింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: