*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*455వ నామ మంత్రము* 15.10.2021
*ఓం మాలిన్యై నమః*
ఏబది ఒక్క అక్షరములయొక్క అభిమానదేవతయైన మాలినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మాలినీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం మాలిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ పరమేశ్వరి శాంతిసౌఖ్యములతోను, ధనకనకవస్తు సమృద్ధితోను, కీర్తిప్రతిష్టలతోను వర్ధిల్లునట్లు అనుగ్రహించును.
జగన్మాత మాలలు ధరించియుండునది గనుక *మాలినీ* యని అనబడినది. అమ్మవారు ధరించిన మాల అక్షరమాల. ఏబది ఒక్క అక్షరములకు అభిమానినీ దేవత పరమేశ్వరి. అమ్మవారు *మాతృకావర్ణరూపిణీ* యని లలితా సహస్ర నామావళి యందు 577వ నామ మంత్రములో స్తుతింపబడినది. *అ* నుండి *క్ష* వరకూ గల మాతృకాక్షరముల స్వరూపిణి. అట్టి మాతృకల నుండియే సకల మంత్రములు, వేదశాస్త్రములు, సకల భాషలు ఉద్భవిస్తున్నాయి. అనగా సకలమూ జగజ్జనని నుండియే ఉద్భవిస్తున్నది గనుక ఆ తల్లి మాతృకాక్షరముల (అ నుండి క్ష వరకూ గల వర్ణముల) మాలను ధరించినది యగుటచే *మాలినీ* యని అనబడినది. ఆ మాలలో అ నుండి హ వరకూ మాలలోని పూసలు కాగా, క్ష అను అక్షరము కొలికిపూస (మేరువు) అయినది. అటువంటి అక్షరమాలను ధరించిన పరమేశ్వరి *మాలినీ* యని అనబడినది. అమ్మవారు మహా చతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడుచూ, ఆ యోగినీల స్వరూపంతో విరాజిల్లుచున్నది. అలాగే పార్వతీ దేవి చెలికత్తెయైస మాలినీ స్వరూపంలో భాసిల్లు చుండుటచే, ఆ తల్లి *మాలినీ* యని అనబడినది. వామన పురాణంలో అమ్మవారు మాలినీ యని వ్యవహరింపబడినది గనుకనే ఆ తల్లి *మాలినీ* యని అనబడినది. ఛందస్సులో *మాలిని* యను పేరుతో ఒక వృత్తము (పద్యలక్షణము) ఉన్నది. అమ్మవారు ఆ మాలినీ వృత్తస్వరూపిణిగా వర్ణింపబడుటచే, ఆ తల్లి *మాలినీ* యని అనబడినది.
శివుని జటాజూటంలో గల గంగాదేవి (మందాకిని) కి మాలిని అను పేరుగలదు. అటువంటి గంగాస్వరూపురాలై, *మాలినీ* యను నామము తనదై పరమేశ్వరి భాసిల్లుచున్నది. ఏడు వత్సరముల బాలికను మాలిని యని అందురు. అట్టి ఏడు వత్సరముల బాలికా స్వరూపిణియైన *మాలినీ* స్వరూపిణి అమ్మవారు.
అమ్మవారు కాళికగా కపాల మాలలు, గ్రామదేవతగా నిమ్మకాయల మాలలు, లలితా త్రిపురసుందరిగా అక్షరమాలను ధరించియుండును గనుక ఆ తల్లి *మాలినీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మాలిన్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి