15, అక్టోబర్ 2021, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*456వ నామ మంత్రము* 15.10.2021


*ఓం హంసిన్యై నమః* 


సోహం, హంసః అనే అజపారూపమగు హంస గలిగిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *హంసినీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం హంసిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు, ఆ అమ్మవారు ఆత్మానందానుభూతిని కలుగజేయును.


యతులలో శ్రేష్ఠులైనవారు హంసలు అని యని బడుదురు. ఈ హంసస్వరూపులైన యతీశ్వరులు ఆత్మజ్ఞానసంపన్నులు. ఆత్మజ్ఞాన సంపన్నులైన యతీశ్వరులు సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపులగుటచే అమ్మవారు *హంసినీ* యని అనబడినది. అనగా హంసలు అనబడే యతులు పరమేశ్వరినుండి అభేదముగా నున్నారు. అందుచే అమ్మవారు *హంసినీ* యని అనబడినది.


అజపా రూపమగు హంసగలది పరమేశ్వరి.


బీజాక్షరాలను ప్రయత్న పూర్వకంగా పలకకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచే అవి (ఆ శబ్దాలను) వినిపించే మంత్ర పద్ధతి. శ్రీనాథ మహాకవి తన కాశీఖండం పంచమా శ్వాసంలో ఈ మంత్రాన్ని గురించి వ్రాశారు. ‘‘హంకారంబున బహిర్గమనంబును సకారంబున అంతర్గమనంబును జేయుచు హంస హంసయను ప్రణవాక్షర మూల భూతంబగు నజపామంత్రంబున....


హ కారము ఉచ్ఛ్వాస అయితే స కారము నిశ్వాస. ప్రాణాయామం చేయునపుడు ఉచ్ఛ్వాసనిశ్వాసములను అదుపులో ఉంచగలిగిన సాధకుడు పరమహంస అని యనబడును.


శరీరంలో షట్చక్రములందు మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకూ, మరియు బ్రహ్మరంధ్రం నుండి మూలాధారం వరకూ సాధకునిచే నడిపింపబడే శ్వాసయే హంస. అనంతకోటి జీవరాశులలో నెలకొనియున్న చైతన్యస్వరూపిణి అయిన ముఖ్యప్రాణశక్తినే హంస అని అందురు. ఈ ముఖ్యప్రాణశక్తియే పరమేశ్వరి యగుటచే, ఆ తల్లి *హంసినీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం హంసిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: