9, మే 2022, సోమవారం

ఆనందాభిలాషి

 మానవుడు ఆనందాభిలాషి. నిజానికి మానవుడే కాదు ప్రతి జీవీ ఆనందాభిలాషే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఆనందమయోభ్యాసాత్‌’ అంటుంది శాస్త్రం. అంటే, జీవుడు నిజానికి ఆనందస్వరూపుడే. అందుకే, ఆనందాన్వేషణ అతనికి సహజంగానే ఉంటుంది. అయితే అతను కేవలం శరీరం ద్వారానే ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. కానీ, శరీరం ద్వారా లభించేది సుఖమే గాని ఆనందం కాదు! అందుకే శాస్ర్తాలు ఆనందం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపదేశిస్తున్నాయి. ధర్మచ్యుతితో మానవుడు పాపరాశులు మూటగట్టుకొని దుఃఖభాగుడవుతాడు. ఈ విషయమే భాగవతంలో ‘అధర్మశీలస్య సుదుఃఖితస్య’ అన్నారు. తెలిసో, తెలియకో జీవుడు పాపాలు చేసి, కష్టాలు కొనితెచ్చుకొని దుఃఖాలకు లోనవుతాడు.అతని కష్ట పరంపర తొలగి అసలైన ఆనందం లభించడానికి ఏకైక పరిష్కారం ఆధ్యాత్మిక మార్గమే. అది కేవలం భక్తుల సాంగత్యంతో లభిస్తుంది.

భాగవతంను సప్తమ స్కంధంలో ఉపబర్హణుడనే గంధర్వుని కథ ఆధ్యాత్మిక ఆనందం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఉపబర్హణుడు గొప్ప అందగాడు. గానకళలో నిష్ణాతుడు. దానితోపాటు అతనికి భోగ ప్రవృత్తిపై ఆసక్తి ఉండేది. ఒకసారి దేవలోకంలో జరిగే భగవన్నామ సంకీర్తనకు ఈ గంధర్వుడిని అతిథిగా పిలిచారు. సంగీత విభావరి మొదలైంది. స్త్రీ సాంగత్యంలో, మదిరా మైకంలో ధర్మచ్యుతుడై ఉపబర్హణుడు భగవన్నామ కీర్తనకు బదులు, దేవతా కీర్తనం మొదలుపెట్టాడు. అది ప్రజాపతులకు నచ్చలేదు. భూ లోకంలో మనిషిగా జన్మించమని శపించారు. అలా ఓ మానవకాంత కడుపున పుట్టాడు ఉపబర్హణుడు. ఆమె ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పనిమనిషిగా ఉండేది. కొడుకు కూడా ఆ ఇంట్లోనే ఆడుకునేవాడు. అయితే, ఓ వర్షకాలం కొందరు భక్తాగ్రేసరులు ఆ బ్రాహ్మణుడి ఇంటికివచ్చారు. నాలుగు నెలలు ఆ ఇంటనే బస చేశారు.

ఆ భక్తులు నిరంతరం శ్రీకృష్ణుడి సేవలో తరించేవారు. కృష్ణ నామసంకీర్తన, కృష్ణుడి కథాచర్చ, కృష్ణ ప్రసాద సేవనం ఇలా.. ఏం చేసినా కృష్ణుడే వారికి పరమావధి. ఆ దాసీబాలుడికి ఈ భక్తుల సాంగత్యం లభించింది. ఆ పిల్లాడు అన్ని ఆటలూ మానుకొని వారితోనే కాలం గడపసాగాడు. ఆ పసి మనసులోనూ కృష్ణభక్తి మొగ్గ తొడిగింది. వానకాలం గడిచిపోయింది. భక్తబృందం వారు తమ ఇండ్లకు వెళ్తూ బాలుడికి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించారు. దాసీపుత్రుడు ఆ మంత్రాన్ని నిరంతరం జపించడం మొదలుపెట్టాడు. ఓ రోజు హఠాత్తుగా పాముకాటుకు గురై తల్లి మరణించింది.

తల్లి పోయేనాటికి ఆ బాలుడికి ఐదేండ్లు. అంతటి పసివయసులోనూ ఎప్పుడూ కృష్ణనామాన్ని జపిస్తూ ఉండేవాడు. దానికి ప్రతిఫలంగా కొంతకాలానికి భగవంతుడి దర్శనం క్షణకాలం పాటు లభించింది. దానితో ఆ బాలుడి జీవితంలో ఆనంద వెలుగులు నిండాయి. అయినా భగవంతుణ్ని నిరంతరం చూడాలని ఆ పిల్లవాడు ఉబలాటపడ్డాడు. అది సాధ్యం కాదని భగవంతుడు సెలవిచ్చేసరికి ఆ దేవదేవుడిని నిరంతరం దర్శించే దివ్య గడియ కోసం ఎదురుచూస్తూ కాలం గడిపాడు. సమయం రాగానే దేహత్యాగం చేశాడు. తర్వాత దివ్యశరీరధారియై శ్రీనారదమునిగా అవతరించాడు. దుర్భర జీవితాన్ని గడిపిన దాసీపుత్రుడి జీవితం ఎక్కడ? నిరంతరం ముల్లోకాల్లోనూ, వైకుంఠంలోనూ తిరుగాడే నారదముని జీవితం ఎక్కడ? ఇదంతా కేవలం ఆధ్యాత్మిక మార్గం ద్వారానే సాధ్యపడింది. మానవుల అపారమైన దుఃఖాలను, క్లేశాలను తొలగించే ప్రశస్తమైన మార్గమే భాగవతం బోధించే ఆధ్యాత్మిక మార్గం. భువిలోని మానవుల శ్రేయస్సు కోసం నారదుడు స్వానుభవంతో భాగవతాన్ని తెలియజేశాడు.

కామెంట్‌లు లేవు: