12, ఆగస్టు 2022, శుక్రవారం

రామాయణానుభవం_ 121*

 🌹 *రామాయణానుభవం_ 121*


*రావణ మందిరం*

రావణాసురునితో సుఖాన్ని అనుభవించిన రమణీమణులు ఆయనకు సమీపంలోనే ఉన్నారు. కొందరు కూచున్నారు. అలసినవారు పడుకొన్నారు.


ఆ రాక్షస స్త్రీలకు దూరంగా ఒంటరిగా ఒక అందమైన శయ్యలో రూప సంపన్నురాలైన మరొక స్త్రీని హనుమ చూచాడు.


ఆమె అద్భుత సౌందర్యవతి, సర్వాభరణ భూషిత, రాజలక్షణ లక్షిత. ఆమె రావణుని పట్టపురాణి మండోదరి.


హనుమ ఆ అతిలోక సుందరిని చూచి సీతాదేవే అనుకొన్నాడు. "ఓహో! నా ప్రయత్నము ఫలించింది! నా అన్వేషణ (వెతుకుట) నెరవేరింది! సీతాదేవి నాకు కనబడింది" అని అత్యంత హర్షాన్ని పొందాడు.


ఆ ఆనందము పట్టలేకపోయాడు. తన భుజాలను, తొడలను చరుచుకొన్నాడు. తన తోకను ముద్దుపెట్టుకొన్నాడు. నవ్వుతున్నాడు. ఆడుతున్నాడు. ఇటు వెళ్లాడు. అటు వెళ్లాడు. " ఆ భవనములోని స్థంభాలపై పాకుతూ ఎక్కాడు. వాటినుండి జారి భూమిపై పడ్డాడు.


*ఆయాస్పోటయామాస చుచుంబ పుచ్చం!*

 *ననంద, చిక్రీడ, జగౌ, స్థంభానరోహత్,* *నివపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం* ॥


హనుమ తన కోతి స్వభావాన్ని ప్రదర్శించాడు అంటాడు వాల్మీకి.


మనుష్యులమైన మనమే కోతి చేష్టలను చేస్తుంటే నిజంగా కోతి అయిన హనుమ సహజమైన కోతి చేష్టలను చేస్తే కోతి బుద్ధిని చూపితే తప్పేమిటి?


"హనుమ నిజంగా కోతి మాత్రమే కాదు. బుద్ధిమతాం వరిష్ఠుడు. అంటే బుద్ధిమంతులలో గొప్పవాడు.


అందువలన హనుమ నిజంగా తన ఆలోచనకు మరొకసారి సిగ్గుపడ్డాడు. "ఛీఛీ ఎంత పాడు ఆలోచన!" అని తనను తానే అసహ్యించుకొన్నాడు.


*న రామేణ వియుక్తాసా స్వప్ను మర్హతి భామినీ। న భోక్తుం న్యాలంకుం। నపానముపసేవితుం।*


శ్రీరాముని ఎడబాసి నిరంతరము దుఃఖించే సీతామతల్లి నిద్రపోతుందా? ఆమెకు తిండి సహిస్తుందా? పానీయాన్ని ఆమె సేవిస్తుందా? ఆమెకు అలంకారాలు ఇష్టమవు తాయా?


*నాన్యం వరముపస్థాతుం। సురాణామపిచేశ్వరం||*


ఆమె అన్యుడైన పురుషుని మహేంద్రుని సైతము సమీపిస్తుందా? 


అందువలన ఈమె సీత కాదు. వేరే ఏ స్త్రీయో? అని నిశ్చయించుకొని పానభూమిలో సంచరించాడు.


**

హనుమకు మరొక విచారము ఆయన మనస్సులో బాధించడం మొదలుపెట్టింది.


"సాధారణంగా స్త్రీలను దగ్గరినుండి చూడకూడదు కదా! అందులో నిద్రిస్తున్న వారిని దగ్గరగా చూడడం మరింత పనికిరాదు కదా! మరి నేనిప్పుడు చేసిన పనేమిటి? బొట్టు చెదిరి, అందెలు తొలిగి, హారాలు, చీరలు జారిన ఆడవాళ్లను నిద్రిస్తుండగా దగ్గరి నుండి చూచానే? ఇది పాపం కాదా?"


హనుమ కొంతసేపటికి ఒక నిశ్చయానికి వచ్చాడు. తనకు తానే సమాధానం చెప్పుకొన్నాడు.

*తదిదం మార్గితం తావచ్ఛుద్ధేన మనసా మయా৷৷*

*రావణాన్తఃపురం సర్వం దృశ్యతే న తు జానకీ.*

“మనము ఏ పనిచేసినా ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నదే ముఖ్యము. 


నేను దురుద్దేశ్యంతో ఈ స్త్రీలను గమనించలేదు. వీరు ఇంత అస్తవ్యస్తంగా పడుకొని ఉన్నా,

వీరిని చూచినప్పుడు నా మనస్సు చెడు ఆలోచనలకు చోటివ్వలేదు. 

*న హి మే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ৷৷*

*అయం చాత్ర మయా దృష్టః పరదారాపరిగ్రహః.*

ఇంద్రియాలు చెడుగా ప్రవర్తించాలన్నా, మంచిగా నడుచుకోవాలన్నా మనస్సే కారణము. వీరిని ఈ స్థితిలో చూచినా నా మనస్సు చక్కగానే ఉంది. అయినా సీతాదేవి కూడ ఒక స్త్రీయే కదా!


ఆమెను స్త్రీల మధ్యలోకాక పోతే ఇంకెక్కడ వెతుకుతాము?


సీత కోసం సముద్రం దాటి లంకకు వచ్చాను. లంకలో ఎక్కడ వెదకాలి? ఏ జాతి జంతువు తప్పిపోతే ఆ జాతి జంతువులలోనే వెదకాలి.


 *న శక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుమ్.* 

స్త్రీ తప్పిపోతే స్త్రీలలోనే వెదకాలి. ఆడలేళ్ళలో వెదికితే స్త్రీ దొరకదు కదా! 


సీతజాడ తెలుసుకోమన్న ప్రభువు ఆజ్ఞను పాటించి రావణాంతఃపురం అంతా వెదికానే తప్ప స్త్రీలను చూడాలనే ఆసక్తితో కాదు. అందువలన నాకు ధర్మలోపం కలగదు." అనుకున్నాడు.


హనుమంతుడు నిరుత్సాహానికి లోనయ్యాడు. రావణమందిరం నుంచి దూరంగా వెళ్ళి ఆలోచించాడు.

కామెంట్‌లు లేవు: