12, ఆగస్టు 2022, శుక్రవారం

సాధ్వీమ తల్లులు

 మన అందరికీ పురందరదాసు కథ తెలిసిందే . అందులో సాధ్వీమతల్లి అయిన ఆయన ధర్మపత్ని సరస్వతమ్మ గూర్చి తెలిసిందే . పురందరదాసు అసలు పేరు శీనప్ప . కన్నడ సామ్రాజ్యములో పేరుబడసిన రత్నాల వ్యాపారి . ఆయన పిల్లికి బిక్షం వేసే రకం కాదు . మరి అయన ధర్మపత్ని మాత్రం అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు అందరికీ వారు వీరు అనిలేకుండా సకల మర్యాదలు చేసే మహా ఇల్లాలు . ఇదంతా గమనించిన శీనప్ప ప్రతీవాటినీ తన ఇంటిలో చెక్క పెట్టెలలో పెట్టించి తాళాలు వేసుకుని తాళాల గుత్తి తన దగ్గరే ఉంచుకునే వారు . ఒక సారి ఓ పేద బ్రాహ్మణుడు శీనప్ప ఇంటికి రాగా ప్రతీ రోజు రేపు రమ్మని తిప్పుకునేవాడు . అలా తిరిగీ తిరిగీ ఆ బ్రాహ్మణుడు అలసిపోయాడు గానీ విత్తం గానీ ఇంత ధాన్యం కానీ దానం చేయలేదు శీనప్ప . ఓ రోజు శీనప్ప ఇంట లేని నాడు ఆ బ్రాహ్మణుడు సరస్వతమ్మను దర్శించి తన పేదరికం బాపమని వేడుకున్నాడు . ఆమె ఇంట ఇపుడు ఏమీ ఆమె స్వాధీనములో లేదు . ఆ పేద బ్రాహ్మణుని పేదరికం చూసి జాలిపడి ఆమె తన ముక్కుకు ఉన్న రత్నం పొదిగిన ముక్కెర ఇచ్చి వేసి అమ్మి వేసి సొమ్ము తీసుకుని జీవించమంది . ఆ బ్రాహ్మణుడు అది అమ్మడానికి నేరుగా శీనప్ప కొలువై యున్న రత్నాల అంగడికి వెళ్లి అమ్మజూపాడు . ఆ ముక్కెర తానే స్వయంగా రత్నం పొదిగి చేయించింది , అత్యంత విలువైనది . అది చూసిన ఆయనకు నమ్మబుద్ధి కాక వెంటనే తన వద్ద ఉన్న నౌకరుని పంపి వెంటనే తన శ్రీమతి వద్ద యున్న రత్నం పొదిగిన ముక్కెర తీసుకురమ్మనమని చెప్పమని వ్రాసి పంపాడు . ఆమె ఆ పత్రం చదివి బెంబేలు పడిపోయి ఇంక తనకు ఇక దిక్కు తాను నిరంతరం కొలిచే పాండురంగడే అని తలచి విషం తీసుకోబోగా ఆపాత్రలో ధగ ధగ మెరిసే ముక్కెర కనబడింది దానిని తీసి శుభ్రం చేసి ఆమె ఆ ముక్కెరను నౌకరు చేత పంపింది . అది గాంచిన తరువాత శీనప్ప ఖరీదు కట్టి ఆ రత్నం పొదిగిన ముక్కెర కొని దానిని ఇంటికి తీసుకు పోయి అసలు విషయం విచారించగా అపుడు సంగతి తెల్సింది . ఆమె ఆ ముక్కెర ఆ బ్రాహ్మణునికి దానం చేసిన విషయం .. విష పాత్రలో ముక్కెర ఉండటం . అంతే అంతవరకూ కాకికి ఎంగిలి చేయి విదల్చని శీనప్పలో మార్పు వచ్చేసింది . మొత్తం తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ దాన ధర్మాలు వినియోగించారు . భక్తితో శ్రీరంగని మీద , వెంకటేశ్వర స్వామి వారి మీద కన్నడములో అనేక కీర్తనలు రచించారు . దాస సంగీతానికి ఆద్యుడు , కర్ణాటకా సంగీత పితామహుడు అయిన పురందర దాసులో మార్పు తెచ్చిన సంఘటన ఇదే . ఇటువంటి సాధ్వీమ తల్లులు పుట్టిన నేల ఈ భారతం .

కామెంట్‌లు లేవు: