5, సెప్టెంబర్ 2022, సోమవారం

పరమేష్టి

 ధర్మాకృతి : పరమేష్టి గురువులు - 2


శ్రీవారి సన్నిధిలో నిరంతరం భాష్య పాఠం జరిగేదట. ఆ రోజుల్లో మహామహాపాధ్యాయులైన మన్నారు గుడి పెరియవాగా ప్రసిద్ధి చెందినా రాజుశాస్త్రి గారు, హరిహర శాస్త్రిగారు, తిరువయ్యార్ బాలకృష్ణ శాస్త్రి గారు వంటి మహా పండితులు తరచుగా శ్రీవారి సమక్షంలో వాక్యార్థం చేస్తూ ఉండేవారట. స్వామివారికి స్వయంగా సంగీతంలో అభినివేశం ఉంది. అనేకమంది సంగీత విద్వాంసులు శ్రీవారి వద్ద తమ సంగీతాన్ని వినిపించి వారి మన్ననలనందుకోవడం మహా గౌరవంగా భావించేవారు. పాపనాశం శివం వంటి వాగ్గేయకారులు వీరిపై కృతులు కూడా చేశారు.


కొంతకాలం తరువాత ధర్మ ప్రచారానికి బయలుదేరిన స్వామివారు తంజావూరు, ఒడయార్ పాళెం, దక్షిణార్కాటు, తిరుచ్చి, కోయంబత్తూరు, మళయాళ దేశాలలో విస్తృత పర్యటన చేశారు. వీరు పండితులలోనూ, పామరులలోనూ ప్రతి ఒక్కరిని పలుకరించి మాట్లాడి, వారి సుగుణాలను ఉత్సాహపరుస్తూ, కష్టాలకు తరుణోపాయం ప్రసాదిస్తూ అందరికీ అత్యంత ప్రేమాస్పదులై ఉండేవారట. వీరు కోపమన్నదే ఎరుగరని చెబుతారు.      


1876లో పంచాంగ గణన రీతులపై వెంకటేశ్వర దీక్షితులు, సుందర శ్రౌతి ఒక పక్షం గానూ. తిరునల్వేలి కృష్ణ జోశ్యులు వేరొక పక్షం గాను వివాదపడగా, స్వామివారు ఆ కాలంలో ప్రముఖ గణిత శాస్త్ర పండితులయిన శ్రీనివాసయ్య అప్పశాస్త్రి, అప్పా దీక్షితులు మధ్యస్థులుగా ఇద్దరి వాదనలనూ ఆసాంతముగా విని, మధ్యస్థులు సుందర రామ శ్రౌతి పక్షమైన దృక్సిద్ధాంతమే సమంజసమైనదని అభిప్రాయ పడగా, స్వామివారు కూడా నిర్ణయాన్ని పరిశీలించి, శ్రీముఖం ద్వారా దృక్సిద్ధాంతమే సమంజసమైనదని కట్టడి చేశారు. దక్షిణ దేశంలో, ఆంద్ర దేశంలోనూ ఈ సిద్ధాంతమే ప్రస్తుతము ఎక్కువ ప్రచారంలో ఉంది.


కంచి పీఠాధిపతుల పూర్వీకులు ఎంతోమంది యావద్భారత విజయ యాత్ర చేసినట్లు వారి గురు సంప్రదాయం చెబుతోంది. స్వామివారు కూడా వారి పూర్వాచార్యుల బాటలోనే 1877లో ఉత్తర దేశ యాత్ర సంకల్పించారు. మాయవరం, చిదంబరం, వైదీశ్వరం, విల్లుపురం మీదుగా కాంచీపురం చేరి తమ మఠంలో కొంతకాలం ఉండి మదరాసు మీదుగా తిరువట్రియూరు చేరారు. తిరువట్రియూరుకు కంచి పీఠానికి అనేక తరాలుగా సంబంధం ఉంది. శంకరుల విగ్రహం ఉన్న అతి కొద్ది శివాలయాలలో ఈ ఊరి దేవాలయము ఒకటి. ఇక్కడి అమ్మవారికి శంకరులే స్వయంగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రసిద్ధి. కంచి కామకోటి పీఠానికి ఇక్కడ స్వంత మఠమున్నది. పూర్వాచార్యుల సిద్ధి క్షేత్రములో కట్టిన బృందావనాలున్నాయి. స్వామివారు ఆలయ ప్రధాన దేవత అయిన త్యాగేశ్వరుని అతి పురాతనమైన దక్షిణామూర్తిణి, ఆదిశంకరుని, అమ్మవారిని దర్శించి ఆంద్రదేశములో అడుగు పెట్టారు. మూడు ఏనుగులు, రెండు లొట్టిపిట్టలు, పది గుర్రపు బళ్ళు, నలభై ఎడ్ల బళ్ళు ఆవులు, మూడు వందలమంది పరివారంతో యాత్ర సాగింది.


ఆంధ్రదేశ ప్రజల శ్రద్ధాభక్తులకు సంతుష్టులయిన స్వామివారు యాత్ర ఎంతో నిదానంగానే కొనసాగించారు. దారిలోని సంస్థానాధీశ్వరులైన కార్వేటి నగరపు రాజా వంటి వారి ఆహ్వానములను అందుకొని వారి దేశములలోని ముఖ్య గ్రామములను పావనము చేస్తూ ధర్మ ప్రచారము ముఖ్య కార్యంగా యాత్ర సాగించారు. 


పూర్వాచార్యుల కాలంలో ఆరంభించబడిన పీఠ వ్యతిరేక ప్రచారము వీరు చేరక ముందే ఆయా సంస్థానములకు వెళ్ళింది. అక్కడి సంస్థానాధీశ్వరులందరూ సభ చేసి ఆధారాలను పరిశీలించి, కంచి కామకోటి పీఠాన్ని ఆదిశంకరులు అధిష్ఠించిన సర్వజ్ఞ పీఠంగా గుర్తించి స్వామివారిని ఎంతో ఆదర భావంతో ఆహ్వానించారు. శ్రీమఠపు ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి అందరికీ ఈ పరిశ్రమ ఎంతో ఉపయోగకారి అయింది. విజయనగర రాజ సంస్థానపు పండితులు తాము ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాక, తగిన సమాధానమియ్యవలసినదని మదరాసు మహాజన సభను కోరడం జరిగింది. తత్ఫలితమే ‘శంకరతత్త్వ సుబోధిని’ అనే పేరుతో ఏలూరు వాస్తవ్యులు గాధి జగన్నాథపాకయాజి గారిచే వ్రాయబడిన గ్రంథము.


పీఠాపురం తుని సంస్థానాల మీదుగా 25.7.1865న శనివారం ఉదయం పదిగంటలకు విజయనగరము (తూర్పు ఆంద్ర) విజయం చేశారు. స్వామివారి ఈ విజయనగర విజయ యాత్ర ఆ సంస్థాన పక్షాన రికార్డు చేయబడి ముద్రించబడినది. వారి మాటలలో విజయనగరమునకు స్వామివారిని ఆహ్వానించిన తీరు ఈ దిగువ వివరించబడింది. “శ్రీ జగద్గురు భగవత్పాదులు శ్రీపీఠ పరివారంతో విజయనగరమునకు విజయము చేయునవసరమున శ్రీ విజయనగర సంస్థానము రెండేనుగులు, తూర్పు సవర్లు, కుడతాఘాట్లు, లౌక్యులు, పండితులు, పురోహితులును, నయోధ్య ప్రాంతమునకు ముందుపోయి, శ్రీవారి నెదుర్కొని భక్తిపూర్వకముగా స్వాగతమొనర్చి పల్లకీనధిరోహించి ఉన్న శ్రీవారిని తీసుకొని వచ్చి శ్రీ ఓరుగంటి లక్ష్మీకాంతం గారింట్లో నిలిపిరి. బ్రాహ్మణ భోజన నిమిత్తము 300 మందికి వలసిన సామాగ్రి శ్రీమఠమునకు సమర్పించబడినది. 26వ తేదీ వ్యాసపూజ అనంతరము మహారాజా వారు స్వామివారికి వ్యాసపూజ చేసి 116/-రూ.లు 5౦౦ల మందికి భోజన సామాగ్రి సమర్పించినదే కాక శ్రీవారికి నగరములో ఏర్పాటు కాని రోజులలో రోజుకు 25రూ.ల చొప్పున సంస్థాన పక్షాన భిక్ష చేయవలసినదని’ ఆదేశించారు. ఆ రోజుల్లో బంగారం తులం 13రూ.లు ఉండేది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: