17, నవంబర్ 2022, గురువారం

ద్రోణాచార్యుడు

 మహాభారతంలోని పాత్రలు 

*1* *ద్రోణాచార్యుడు*


ద్రోణుడు భరద్వాజుని పుత్రుడు. ఈతని భార్య కృపి. కొడుకు అశ్వత్థామ. తండ్రి దగ్గరే సకలవిద్యలూ నేర్చుకున్నాడు. అగ్నివేశుడనే ముని దగ్గర ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ద్రుపదుడూ, ద్రోణుడూ చిన్ననాటి మిత్రులు. కానీ వీరి జీవన స్థాయిలో ఆకాశానికీ, భూమికీ ఉన్న అంతరం. ద్రోణుని అపారమైన విద్యానైపుణ్యాలు అతని పేదరికంతో మరుగున పడిపోయాయి. తనకూ పాలు కావాలని మారాం చేశాడు. పిల్లవాడికి పాలను కూడా సమకూర్చలేని తన దీనస్థితికి తానే చింతిస్తూ డబ్బుకై వెదుకులాడగా పరశురాముడు చాలా దానాలు చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళతాడు. అయితే ద్రోణుడు అక్కడికి వెళ్ళే సమయానికి పరశురాముడు సమస్తాన్నీ దానం చేసేస్తాడు. ద్రోణున్ని వట్టి చేతులతో పంపడం ఇష్టం లేక అస్త్రయోగ రహస్యాన్ని నేర్పుతాడు. ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ బాల్యాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయగా ద్రుపదుడు రాజకుటుంబీకులకూ, పేదవారికీ మధ్య స్నేహ సంబంధం అసంభవమని అవహేళన చేసి మాట్లాడుతాడు. ఆర్థిక సహాయం చేయమని అర్థించినా ద్రోణుని అవమానించి వెళ్ళగొడతాడు. ఆ అవమానాగ్నితో బాధపడుతూ ద్రోణుడు ఆ ఊర్లో ఉండలేక తన భార్యనూ, కొడుకునూ వెంటబెట్టుకొని తనకు చెల్లెలినిచ్చి పెళ్ళి చేసిన బావ కృపాచార్యుని దగ్గరకు హస్తినాపురానికి వస్తాడు.భీష్ముని ఆజ్ఞమేరకు కృపాచార్యుని దగ్గరే శిష్యరికం చేస్తున్న కురుపాండవులు ఒకనాడు ఆడుకుంటూ బంతిని బావిలో పడేస్తారు. దాంట్లోంచి బంతిని ఎలా తీయాలో తెలియక సతమతమవుతున్న వారిని చూసి ఆ బంతిని నేను తీయగలనని చెప్పి గడ్డిపరకలనే అస్ర్తాల్లాగ ప్రయోగించి సునాయాసంగా బయటకు తీసి వారిచేతిలో బంతిని పెడతాడు ద్రోణుడు. ఈతని గొప్పదనాన్ని భీష్మునికి పరిచయం చేస్తారు కురుపాండవులు. భీష్మునికి తన గురించిన పూర్తి వివరాలూ సత్యభాసితంగా చెప్పిన ద్రోణుడి ఉదాత్తతకు చలించి భీష్ముడు కురుపాండవులకు అస్త్ర విద్యాభ్యాసం చేయాలనీ వేడుకొని ధనధాన్య వస్త్ర, వస్తువులతో సత్కరించి ఆదరిస్తాడు. ఆనాటి హస్తినలో కురుపాండవులకు గురువుగా స్థిరపడిన ద్రోణుడు వారిని మంచి నిపుణులుగా తీర్చిదిద్దుతాడు. అర్జునునికి ప్రత్యేకంగా విలువిద్యను నేర్పి తనను మించిన వాడుగా చేస్తాడు. నిజానికి అర్జునునిపై గల పక్షపాతంతో ఏకలవ్యుని దగ్గర బోటనవేలిని గురుదక్షిణగా తీసుకొని తన గురుత్వానికి తగిన న్యాయం చేయలేకపోయాడు ద్రోణుడు. అన్నం పెట్టినందుకు తీర్చుకునే ఋణంగా భావించాడు. కురుపాండవుల విద్యాభ్యాసం ముగియగానే తనకు గురుదక్షిణగా ద్రుపదున్ని ప్రాణాలతో పట్టి తెచ్చి నాకు అప్పగించమని కోరాడు. అందరూ ప్రయత్నించారు. కానీ చివరికి అర్జునుడు విలువిద్యా నిపుణుడైన ద్రుపదున్ని బంధించి తెచ్చాడు. ద్రుపదుని రాజ్యాన్ని తాను తీసుకొని అందులోని సగభాగాన్నే భిక్షగా ద్రుపదునికిచ్చి ఇప్పుడు మన స్నేహంలో సమానత్వం ఉందని చెప్పి అతణ్ని ప్రాణాలతో వదిలేస్తాడు ద్రోణుడు. అర్జునునికి తన సమస్తాన్నీ నేర్పి తనతో ప్రతియుద్ధం చేయరాదని మాట తీసుకుంటాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడు తన శిష్యులైన కురుపాండవుల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి వ్యథ చెందుతుండేవాడు. లక్క ఇంట్లో పాండవులు మరణించారని తెలిసి చాలా దుఃఖించిన ద్రోణుడు వారు బతికే ఉన్నారనీ ద్రౌపదిని పెళ్ళి చేసుకున్నారనీ తెలుసుకొని సంతోషించాడు. పాండవులను నాశనం చేసేందుకు కౌరవులు చేస్తున్న ప్రయత్నాలకు వత్తాసు పలుకకపోగా ద్రోణుడు వాటిని వ్యతిరేకిస్తే దుర్యోధనుడు ఈతన్ని పాండవ పక్షపాతిగా చూసేవాడు. కానీ భీష్మ ధృతరాష్ర్టులు ద్రోణున్ని గౌరవించే పద్ధతికి జీవితమంతా కట్టుబడే ఉన్నాడు ద్రోణుడు. కురుక్షేత్ర యుద్ధంలో గురువుగా తన ఆశీస్సులను పాండవులకిచ్చి, ఒక రాజసేవకునిలా కురుపక్షంలో పోరాడాడు ద్రోణుడు. కర్ణ దుర్యోధనులు ఎంత తులనాడినా తనకు జీవితాన్నిచ్చిన భీష్ముని ఆదరణకు తలొగ్గాడు ద్రోణుడు. అంపశయ్యపైకి భీష్ముడు చేరుకోగానే ద్రోణుడు సర్వసేనాధిపత్యం వహించాల్సి వచ్చింది. ధుర్యోధనుని ఆలోచన మేరకు ధర్మరాజుని సజీవంగా బంధిస్తానని వాగ్థానం చేస్తాడు ద్రోణుడు. విశ్వ ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. పాండవులకు ద్రోణుని వీరోచిత యుద్ధ విహారం కూడా ఆటంకం కలిగించింది. ఇంతలో అశ్వత్థామ చనిపోయినట్టూ అది ద్రోణుని కొడుకు కాదు ఏనుగనే విషయం ద్రోణునికి వినిపించకుండా ఎత్తువేసి యుద్ధం నుంచి పక్కకు వచ్చేలా చేశారు పాండవులు. ధర్మరాజు మాటలు నమ్మి కుప్పకూలిపోయాడు. దుష్టద్యుమ్నుని చేతిలో చివరికి మరణించాడు. పాండవులూ కౌరవులపైన ద్వేషంతో ద్రోణున్ని నిందించారు. కౌరవులు ద్రోణుడు పాండవ పక్షపాతని భావించి తులనాడారు. ఏది ఏమైనప్పటికీ ద్రోణుడు తన పరిస్థితుల కారణంగా గురుపదాన్ని చేపట్టాల్సి వచ్చింది. ధర్మాధర్మాల వ్యత్యాసం తెలిసినా రాజధర్మానికి తలొగ్గి ఏకపక్షంలో తన జీవితం నడిపించాల్సి వచ్చింది. తన భావాలకూ, మానసిక సంఘర్షణలకూ అన్యాయం చేసుకోవాల్సి వచ్చింది. పరతంత్ర పరీక్షలో స్వేచ్ఛను ఫణంగా పెట్టాల్సి వచ్చింది. పరాధీనతలో నలిగిపోయిన దిగ్గజమే ద్రోణాచార్యుడు.

కామెంట్‌లు లేవు: