. *విశ్వనాథవారి కొబ్బరి పచ్చడి!*
పేరాల బాలకృష్ణ.
నాన్నగారు, గురువుగారు, నాన్నగారి తోకలా నేను ఒకసారి బెజవాడలో కాళేశ్వరరావు మార్కెట్ కు వెళ్ళాం. నాన్న గారితో కూరల మార్కెట్కుకి వెళ్ళటం చాలా సరదాగా ఉంటుంది. ఆ కూరలమ్మే పల్లె పడుచులతో కబుర్లు, వాళ్ళ అమాయకపు మాటలకు నాన్నగారి వ్యాఖ్యానాలు....... నేటి తరానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాన్నగారితో *కూరల షాపింగ్* చాలా సరదాగా, ఆటవిడుపుగా ఉండేది. అలాంటిది గురువుగారితో కూడా మార్కెట్కి అనేసరికి ఇంకా ఉత్సాహం! ఇద్దరి చేతుల్లోనూ పాత పడక్కుర్చీ పట్టాలతో కుట్టించిన చారల చారల కూరల సంచీలు. పాత పడక్కుర్చీ పట్టాలతో సంచీలేంటని ఆలోచిస్తున్నారా? కుర్చీ పట్టాలకు పైన కింద రూళ్ళ కర్రల్లాంటివి ఎక్కించి కుర్చీకి రెండు వైపులా ఖానాల్లో ఎక్కిస్తే కూర్చోవటానికి కుదురుతుంది కదా! కొంత కాలానికి పట్టా నెమ్మదిగా కుర్చీ చెక్కకు ఒరుచుకుని, నలిగి చినుగుతుందిగా. అట్లా చినగటం వల్ల ఇహ తప్పదుగా పట్టా మార్చ వలసి వస్తుంది. ఆ పట్టాలన్నమాట. రూపాంతరం చెంది మరో జన్మ ఎత్తి, పాపం ఇలా కూరల సంచీలై మన సేవ చేసుకుంటాయి. అప్పటికీ ఆ పట్టాకు ఋణ విముక్తి కాదు. మరికొంత కాలానికి ఆ సంచీ హాండిల్స్ నలిగి చినిగి పనికిరాకుండా పోతుంది. అప్పటికి సంచీ కూడా మోత బరువుకి, చిరగటం మొదలవుతుంది. పాపం అప్పటికీ ఆ సంచీకి విముక్తి రాదు. అప్పుడు ఆ సంచీ తన హాండిల్స్ కోల్పోయి పూర్తిగా వికలాంగియై, సింహద్వారం దగ్గర కాళ్ళు తుడుచుకునే పట్టాగా మారుతుంది. అప్పుడుకూడా పూర్తిగా శిధిలమై చివరకు మన కాలి వేళ్ళు ఆ చినుగుల్లో చిక్కుకుని మొహం పగిలేలా పడబోయి తప్పించుకున్న ఏ నాన్నగారో, లక్షుడు పెదనాన్నగారో గట్టిగా అరిచి, చీవాట్లు పెట్టి రోడ్డుమీదకు విసిరెస్తే తప్ప ఆ పట్టాకు జన్మ రాహిత్యం రాదు.
రాజ భంగ నీచ యోగం ( నీచ భంగ రాజ యోగం లాగానే --- పెద్దవాళ్ళ కుర్చీ పట్టాగా పుట్టి, కూరల సంచీఅయి, కాళ్ళు తుడుచుకునే పట్టాగా మారటమే రాజభంగ నీచ యోగ మన్న మాట ) పట్టిన అలాంటి చరిత్ర ఉన్న కుర్చీ పట్టాతో చేసిన కూరల సంచీలతో మార్కెట్ అంతా కలియతిరిగి నెమ్మదిగా ఓ కొట్టుదగ్గర ఆగి నాన్నగారు గొంతుక్కూర్చుని ఏరటం మొదలుపెట్టారు. మాంఛి నిగనిగలాడే వంకాయలు ఓ సవాసేరు తూకం వేయించి, దానిపైన ఓ కాయ కొసరు వేయించుకుని మళ్లీ ఇంకో సవాసేరు తీసుకున్నారు, ఆ అమ్మి మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ఇంకో కాయ కొసరు వేయించుకుని మరీ. అవధానాలకు 116/- అడగటం చేతకాదు కానీ దీనిదగ్గర కొసరు బాగానే దబాయించావ్ పాత ఖాతా కాబోలు! అంటూ కొంటెగా గాల్లోకి చూస్తూ ఓ నవ్వు నవ్వారు గురువుగారు! మాష్టారి మాటలకు పగలబడి నవ్వుతూ, కూరలమ్మాయి వంక చూసారు నవ్వాపుకునే ప్రయత్నం చేస్తూ! అదే చేత్తో నా మొహాన ఓ రెండు సవాసేర్లు పడేయి అన్నారు నవ్వుతూ. వంకాయలకి డబ్బులిచ్చి ఇంకో కొట్టు వైపు కదిలారు. ఎవరి డబ్బులు వాళ్లే ! గురువుగారు ఆ విషయంలో ...... తగ్గేదేలే ! ఓ పది గజాలు నడిచారో లేదో పంతులుగారూ నమస్కారం! ప్రసాదం తీసుకెళ్లండి అంటూ ఓ పిలుపు వినపడింది! నాన్నగారు అటు చూసేసరికి కిరాణా షాప్ లో నుంచి శెట్టి గారు నాన్నగారిని పిలుస్తున్నారు. నాన్నగారు మాష్టారు ఇద్దరూ అటుగా కదిలారు ఆ కొట్టాయన చెరో కొబ్బరి ముక్క ప్రసాదం పెట్టాడు. నాక్కూడా. ఆనాడు శుక్రవారం. మార్కెట్లో అందరూ సాయంత్రం పూజ చేయించుకుని కొబ్బరికాయ కొట్టి, తమ కొట్టుకొచ్చిన వాళ్లకు తలా ఓ ముక్క ప్రసాదం పెట్టటం రివాజు.
ఈ శెట్టి గారు నాన్నగారికి ఎలా పరిచయం అనుకుంటున్నారా? అంతకు వారం రోజులు ముందే ఆవకాయ సామాన్లు కొనడానికి మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఈ శెట్టి గారి కొట్లోనే ఎండు మిరపకాయలు నమిలి, పెద్దగా కారం లేవోయి అని కొనకుండా వదలి శెట్టి గారిని అవాక్కయ్యేలా చేసి వెళ్ళిపోయింది.
అలా తీసుకున్న కొబ్బరి ముక్కలు గుప్పెట్లో పట్టుకొని గురువుగారు ముందడుగు వేశారు. నాన్నగారు ముక్క కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో బోయి గురువుగారు ఇంకా తినకపోవడంతో ముక్కను అలాగే చేత్తో పట్టుకుని ఆయన వెనకే ముందుకు నడిచారు. ఆ తర్వాత ఇంకేవో కొన్ని కూరలు కొని ఆ కూరల వాడి దగ్గర కొన్న కూరల్లోంచి ఓ పచ్చిమిరపకాయ తీసుకుని వెనక ఉన్న కిరాణా కొట్టు దగ్గర బయటపెట్టిన ఉప్పు మూటలోంచి నాలుగు ఉప్పు రాళ్లు తీసుకుని ( బెజవాడ కాళేశ్వర రావు మార్కెట్టులో కింద పాత గోనె సంచులు పరిచి కూరలు కుప్పలు పోసి అమ్ముతారు. ఈ కూరల కొట్ల వెనక వరసగా కిరాణా దుకాణాలు ఉంటాయి) ఆ కొబ్బరి ముక్క, ఈ పచ్చిమిరపకాయ, ఉప్పు రాళ్లు కలిపి నమలటం మొదలుపెట్టారు. భరత శర్మా నువ్వు కూడా ఇలా తిని చూడు ! బాగుంది. అని నాన్నగారి చేత కూడా ఆ కొబ్బరి ముక్కని నోటి పచ్చడి చేయించారు. కారానికి దడిచి సాహసం చేయలేదు కానీ నాకు నోరూరి పోయింది. ఇప్పటికీ నోరూరుతునే ఉంది!
*తన రుచి బ్రతుకులు తనవి గాన* అంటే ఇదేనేమో ! ఉన్నదానిని తృప్తిగా అనుభవించటం, ఆస్వాదించటం, ఆ ఆనందాన్ని నలుగురికి అందించటం అనేది మనిషికి ఎంత సంతోషాన్నిస్తుందో కదా! ఈ గురు శిష్యుల బాంధవ్యం, బోధన , సాహిత్యంలోనే కాదు, నిజ జీవితంలో కూడా! గుర్తుకొస్తే చాలు శరీరమూ, మనసూ పులకరిస్తాయి! అలాంటి గురువులు విశ్వనాథ వారు. అలాంటి గురువును పొందిన శిష్యులు నాన్నగారు భరత శర్మ గారు ధన్యులు. అంతటి మహానుభావుడికి నాన్నగారు శిష్యులయ్యేందుకు పునాదివేసిన మా లక్షుడు పెద్దనాన్నగారు ప్రాతః స్మరణీయులు.
మొన్నొక రోజు ఇంట్లో మా ఆవిడ నైవేద్యం పెట్టిచ్చిన కొబ్బరిముక్క చూడగానే గురువుగారు గుర్తొచ్చి ఓ పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉప్పు ( ఈ నవ నాగరిక ప్రపంచం కల్ల ఉప్పును మరిచిపోయిందిగా ) కలిపి నమిలి ఆనాడు గురువుగారు తింటున్నప్పుడు కారానికి జడిసి కోల్పోయిన గురువుగారి ఆ కొబ్బరి పచ్చడి ఆనందాన్ని, అనుభూతిని ఇంట్లో నెమరువేసుకున్నాను!
అందరమూ ఆ రుచిని అనుభవించి తీరవలసిందే!
పేరాల బాలకృష్ణ
హైదరాబాదు
15-09-2022.
రసజ్ఞభారతి సౌజన్యంతో-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి